డెస్టినీ… పదే పదే ఈమధ్య ప్రస్తావనకు వస్తోంది అనివార్యంగా… అందుకని ఆ పదంతోనే మొదలుపెడదాం… డెస్టినీ అంటే ఇప్పుడు గోపాలకృష్ణ ద్వివేది అనబడే ఉన్నతాధికారికి సరిగ్గా అర్థమై ఉంటుంది… కెరీర్లో ఎప్పుడూ మన పాత్ర ప్రస్తానం ఊర్ద్వముఖంగా సాగిపోదు ద్వివేదీ… ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే……. ఈయన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రస్తుతం… మొన్న శుక్రవారం రాత్రివేళ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసుకు వెళ్లి, అక్కడ నిమ్మగడ్డ లేడని తెలిసీ ఆ వేళకే కావాలని వచ్చి, అక్కడ పేజీలో ఓ లేఖ ఇచ్చేసి వెళ్లిపోయాడు… అదే లేఖను కాస్త ముందుగా నిమ్మగడ్డ ఉన్నప్పుడు ఆయనకే ఇచ్చి, ప్రభుత్వ ఆలోచన సరళి ఇదీ అని చెప్పి వెళ్లిపోతే ఎంత మర్యాదగా ఉండేది..? ఈ రాజకీయాలు వదిలేయండి కాసేపు… నిమ్మగడ్డ ద్వివేదీకి చాలా సీనియర్ కదా… పోనీ, ఆ కుర్చీకైనా గౌరవం ఇవ్వాలి కదా… ఎస్, ఆ కుర్చీ అంటే గుర్తొచ్చింది… గుర్తుతెచ్చుకోవాలి… ఒక్కసారి రీవైండ్ చేసుకొండి… గత అసెంబ్లీ ఎన్నికల వేళ…
ఇదే ద్వివేదీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా పనిచేశాడు… (రాష్ట్ర ఎన్నికల సంఘం వేరు, అది స్థానిక సంస్థలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తుంది… రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈవో) వేరు… ఇది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉండే పోస్టు… ఈయన అసెంబ్లీ, మండలి, రాజ్యసభ, లోకసభ ఎన్నికలు గట్రా చూడాల్సి ఉంటుంది…) ఎన్నికల వేళ చాలా పవర్ఫుల్ పోస్టు ఇది… మిగతా సందర్భాల్లో ఆఫీసులో తిరిగే బొద్దింకలు కూడా పట్టించుకోవు… ఎన్నికల కోడ్ కారణంతో చంద్రబాబుకు చుక్కలు చూపించాడు తను… చీఫ్ సెక్రెటరీని, ఇంటలిజెన్స్ చీఫ్‌ను మాత్రమే కాదు, కీలకమైన అధికారులను బదిలీ చేశాడు… అనేక పథకాలను ఆపేయించాడు… చివరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా నిలిపివేయించాడు… (ఇది దుర్మార్గమైన చర్య)… ఉన్నతాధికారులతో డీల్ చేసే సందర్భాల్లో టెంపర్ కోల్పోని చంద్రబాబు కూడా ఒక దశలో రగిలిపోయాడు… నేరుగా ద్వివేదీ వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు… ‘‘మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొండి, ఈ ఎన్నికలయ్యాక ఎన్నికల సంఘం సంగతేమిటో చూస్తా’’ అని లెప్ట్ రైట్ తీసుకున్నాడు… ద్వివేదీ ఫరమ్గా ఉన్నాడు… తన కుర్చీకి ఎంతోకొంత విలువ తీసుకొచ్చాడు… బెస్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్ అవార్డు కూడా పొందాడు…
Ads
మరి తనకు తెలియదా ఎన్నికల సంఘం కుర్చీ విలువ, గౌరవం ఏమిటో… అచ్చు అలాంటి పోస్టులోనే కదా తను పనిచేసింది… అలాంటిది అలా ఆఫీసుకు వెళ్లి, లేఖ అక్కడ పారేసి వెళ్లిపోవడం ఏం పద్ధతి..? ఒక ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి వ్యవహరించాల్సిన తీరేనా ఇది..? నిమ్మగడ్డను ఇన్సల్ట్ చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం కావచ్చు… కానీ నిమ్మగడ్డ పేరుతో ఎన్నికల సంఘం కుర్చీ పట్ల అగౌరవం ఎందుకు ప్రదర్శించాలి..? ఇప్పుడు ఏమైంది..? పాత సంగతులు తెలుసు, కొత్త వైఖరులూ తెలుసు, నిమ్మగడ్డ అన్నీ చూస్తూనే ఉన్నాడుగా… సోమవారం ఈ ద్వివేదీతోపాటు పంచాయత్‌రాజ్ కమిషనర్‌ను బదిలీ చేసిపారేశాడు…
హహహ… అప్పట్లో చీఫ్ సెక్రెటరీని తీసేశాడు కదా ఇదే ద్వివేదీ… ఇప్పుడు తనకూ అదే స్థితి ఎదురైంది… ఏకంగా అభిశంసన… అయితే ఇదేమీ తనకు కెరీర్‌పరంగా నష్టకారకం కాకపోవచ్చు, ఈ ఎన్నికలయ్యాక జగన్ తనను హత్తుకుని, ఇంకో పెద్ద కిరీటం పెట్టవచ్చు… కానీ అలాంటి కుర్చీలోనే కూర్చున్నప్పుడు గౌరవాన్ని కోరుకున్న తనే, సేమ్ అదే కుర్చీకి మాత్రం గౌరవం ఇవ్వకపోవడాన్ని ద్వివేదీ ఏ రకంగానూ, ఏ వాదనతోనూ సమర్థించుకోలేడు… అదీ ఇప్పుడు మనం చెప్పుకునే అసలు సంగతి… అన్నిరోజులూ మనవి కావు సార్…!! అందరూ చెబుతున్నారు, జగనూ తెగేదాకా లాగకు అని…. కానీ యుద్ధం మధ్యలో తలవంచి, విల్లంబులు కింద పారేస్తే… తనే కాదు, తన సైన్యాధికారులూ బోలెడు అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది… ఇది అలెగ్జాండర్-పురుషోత్తముడి కథ కాదు… జగన్‌కు ఇంతకుమించి చెప్పేవాడూ ఎవడూ లేడు తన చుట్టుపక్కల..!!
Share this Article