నేడు ‘చంద్ర’ జయంతి – ఎవరు మరిచిపోతారు ఈ కథను!
ఒక దశాబ్ద్దం కిందటి సంగతి. పద్మారావు నగర్ లోని వారింటికి వెళ్ళినప్పుడు,మీకు నచ్చిన ఒక కథ చెప్పమంటే చంద్ర గారు చెప్పారు ఇది. దీన్నీ ఎక్కడా ఇంతదాకా రాయలేదు. ఎందుకో ఇవ్వాళ పంచుకోవాలనిపించింది.
కథాకాలం ఎనభైలు కావొచ్చు.
Ads
చెట్టు కింద, ఆరు బయట నులక మంచంపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు దొరవారు. పక్కన మోకాళ్ళపై కూచోని పాలేరు ఉన్నడు.
దొరవారు ఎదో మాట్లాడుతుంటే పాలేరు వింటున్నాడు. ఇంతలో ఒక పాము. మంచం పక్కనుంచి జరజరా పోతున్నది. అది ఇంట్లోకి వెళ్ళేలా ఉన్నది కూడా. “చూస్తున్నావెంరా…అది విషపురుగు. ప్రమాదం” అరిచాడు దొర. దిగ్గున లేచి చూశాక, గుర్తుపట్టి “నాగుంబామురా…” అరిచాడు దొరా. పాలేరు కర్ర తెచ్చి కొట్టేలోగా దాన్ని తన చేతుల్లోకి తీసుకొని చంపేస్తాడు దొర.
ఇది మొదటి సీన్. తర్వాతి సీన్ మరొక దృశ్యం వంటిది. దాంతో కథ పూర్తవుతుంది.
కొన్ని వేల కథలకు ఇల్లస్ట్రేషన్లు వేసే క్రమంలో చంద్ర గారు తనకు పత్రికా సంపాదకులు లేదా కథకులు ఇచ్చిన ప్రతి కథా శ్రద్దగా చదవాల్సి ఉండింది. అందులోని కథ సారాన్ని దృశ్య ప్రధానంగా గుర్తు పెట్టుకొని, ఏం బొమ్మ వేయాలో అలోచించి, కథ చప్పున అర్థమయ్యేలా కాకుండా ఆ కథ ఆసాంతం చదివేలా తనదైన శైలిలో బొమ్మవేయాల్సి ఉండేది. “అలా చదివిన కథల్లో ఇది నాకు చాలా ఇష్టం” అని చెప్పారు వారు. చెప్పి మళ్ళీ కథ పూర్తి చేశారు.
పామును చంపిన కొన్నాళ్ళకు. సరిగ్గా అవే పరిసరాలు.
దొరవారు అలాగే మంచంపై పడుకుని ఉంటారు. వారు ఎదో చెబుతూ ఉంటారు. పాలేరు శ్రద్దగా వింటూ ఉంటాడు. ఇంతలో దొరవారి ముఖంపై ఎదో అడ్డుగా పడుతుంది. అది తువ్వాలా? అర్థంకాదు. అర్థమయ్యేలోగా ముఖానికి అడ్డంగా ‘దిండు’ అని బోధపడుతుంది. చేతులు రెండూ గాల్లోకి ఎత్తి కాళ్ళతో కొట్టుకుంటూ బలహీనంగా మారిన గొంతుతో “ఎందిరా… ఎం చేస్తున్నవురా? ఎందుకురా?” అడుగుతాడు దొర.
“ఏం లేదు దొరా. విష పురుగు. ప్రమాదం.” అంటూ మొస మర్లకుండా ఆ మెత్తను ముఖానికి ఒత్తి దొరవారిని చంపేస్తాడు పాలేరు.
…
కథ పూర్తిగా విన్నాక ఆ నులక మంచం పరిసరాల్లో ఉన్నట్టే ఉండింది. కీచు గొంతుతో అడిగినట్లు గుర్తు. “రాసింది ఎవరు అన్న” అని!
చిన్నగా నవ్వి చెప్పారు. “తర్వాత డిజిపిగా పనిచేసిన పేర్వారం రాములు” అని.
ఎవరు మరిచిపోతారు ఈ కథను! – కందుకూరి రమేష్ బాబు… 25.08.2023
Share this Article