Tough Tongue: రాజకీయాల్లో బండ్లు ఓడలు- ఓడలు బండ్లు కావడం సహజం. ఏ సామెత అయినా ఊరికే పుట్టదు. ఒక కథ, సందర్భం, సంఘటన, ఆచారం, నమ్మకం…ఇలా ఎన్నెన్నో విషయాలను పొదివి పట్టుకునేది సామెత. సామ్యం అంటే పోలిక. సామ్యం అన్న మాటలో నుండి సామెత అన్న మాట పుట్టింది.
రాజకీయాల్లో ఇప్పుడన్నీ ఫార్చ్యూనర్లే కదా? ఎడ్ల బండ్లు ఎక్కడున్నాయి? అని ఎవరూ సామెతతో విభేదించరు. ఈ సామెత సులభంగా అర్థం కావడానికి వరంగల్ నడి బొడ్డు మీద బీ ఆర్ ఎస్ నాయకుడు, ప్రయివేటు యూనివర్సిటీ యజమాని పల్లా రాజేశ్వర్ రెడ్డి పబ్లిగ్గా మైకులో చెప్పిన “కుక్కలను పిల్లులు చేయడం” అన్న ఉదాహరణతో అన్వయించుకుంటే సామెత పుట్టు పూర్వోత్తరాలు, భాషలో సామెతల ప్రాధాన్యం…అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి.
ముందు ఆయనన్న వీడియో చూడండి.
Ads
Video Player
పార్టీ టికెట్ రాని నాయకులను ఓదార్చే పనిలో “సయేంద్రతే తక్షకాయస్వాహా!” అని ముఖమంత్రిని కూడా ముగ్గులోకి లాగి…ఏ మాటలు చెప్పకూడదో ఆ మాటలు మాత్రమే చెప్పారు. పైగా ఆ మాట అన్నది ఆయన కాదు. ముఖ్యమంత్రి అన్న మాటలను ఖుల్లమ్ ఖుల్లా చెబుతున్నాను అన్నట్లు చెప్పారు.
“మనకే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండగా…ఎందుకు సార్ మళ్లీ కాంగ్రెస్ వాళ్లను లాగేసుకోవడం?” అని ఈయన అడిగారట.
“అక్కడుంటే అనవసరంగా కుక్కల్లా మొరుగుతూ ఉంటారు. ఇక్కడుంటే పిల్లుల్లా పడి ఉంటారు” అని సార్ (ముఖ్యమంత్రి) సమాధానమిచ్చారట.
జరగాల్సిన డ్యామేజ్ జరిగాక కాలిన చేతులకు పట్టుకోవాల్సిన ఆకులు వెతుక్కుంటూ “నా వ్యాఖ్యలను వక్రీకరించారు” అన్న అరిగిపోయిన రాజకీయ నాయకుడి గ్రామఫోన్ రికార్డు ప్లే చేశారు.
ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు- స్వాములు కావడం అనే అర్థంలో ఏర్పడ్డ భావన. ఇందులో కుక్కలు, పిల్లులకు చోటు ఉండదనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఓడలు బండ్లు- బండ్లు ఓడలు అయినట్లే ప్రజాస్వామ్యంలో కుక్కలు పిల్లులు కావచ్చు; వైస్ వర్సా పిల్లులు కుక్కలు కావచ్చు!
అందుకేనేమో దాశరథి-
మనిషి మృగం కావచ్చు కానీ-
మనిషి మనిషి కావడమే కష్టం అనే అర్థంలో-
“నరుడు నరుడవుట ఎంత దుష్కరము సుమ్ము?”
అన్నాడు!
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article