మనం అనుకుంటాం గానీ… ఓ పిక్చర్ ఫెయిలైతే, జనం తిరస్కరిస్తే ఆ నిర్మాతో దర్శకుడో హీరోయో ఒళ్లు దగ్గర పెట్టుకుని తదుపరి మంచి సినిమా ఏదైనా ప్లాన్ చేస్తారని..! కానీ ప్రస్తుతానికి అదేమీ లేదు… ఒకటే మూస దంచుడు… చెత్త కథలు, చెత్త ప్రజెంటేషన్లు ఉన్నా సరే… సదరు హీరోవి చాన్నాళ్లుగా సినిమాలు ఆడకపోయినా సరే… సదరు దర్శకుడి సినిమాలకూ పెద్ద ప్రజాదరణ లభించకపోతున్నా సరే… డబ్బులకు మాత్రం కొదువ లేకుండా పోతోంది…
చిరంజీవినే తీసుకుందాం… ఒక ఆచార్య డిజాస్టర్… సేమ్, భోళాశంకర్ మరో డిజాస్టర్… భోళాశంకర్ నిర్మాత దివాలా తీశాడనీ, చిరంజీవి తన రెమ్యునరేషన్ మాత్రం నిలబెట్టి వసూలు చేసుకున్నాడనీ, దీనికి నిర్మాత ఆస్తులు అమ్ముకున్నాడనీ బోలెడు వార్తలు రాశారు చాలామంది… అబ్బెబ్బే, అలాంటిదేమీ లేదు, నా దేవుడిని బదనాం చేయవద్దని నిర్మాత పేరిట కూడా ఏదో ప్రకటన కనిపించింది… నిర్మాత కదా, చిరంజీవి వంటి హీరోను కలలోనైనా ఒక మాట అనగలడా..? గజ్జున వణికిపోయి ఆ ప్రకటన ఇచ్చాడు…
సరే, నిజానిజాలు దేవుడికెరుక కానీ… కేవలం థియేటర్ వసూళ్లతోనే నిర్మాతలు ఆధారపడే రోజులు పోయాయి… కాదు, థియేటర్ వసూళ్లు కేవలం అదనపు సంపాదన మాత్రమే… అసలు అందరి దృష్టి ఓటీటీ, టీవీ రైట్స్ మీదే… అవి సరైన రేట్స్ పలికితే చాలు నిర్మాత గట్టెక్కినట్టే… హీరోల గొంతెమ్మ గౌరవవేతనాలకు ఢోకా లేనట్టే… వెరసి హీరోస్వామ్యం ఈరోజుకూ పదిలమే… ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… స్కంధ అనే సినిమాకు లభించబోయే ఆదాయం…
Ads
రామ్ కొన్నాళ్లుగా పెద్దగా క్లిక్ కావడం లేదు… తన యాక్షన్‌లో కూడా మొనాటనీ… కథ, కథనం, కాకరకాయ గురించి వదిలేయండి… సేమ్, మూస… ఐతేనేం… రాబోయే స్కంధ సినిమాకు ఓటీటీ, టీవీ రైట్స్‌కు గాను 54 కోట్లు చెల్లించేలా హాట్ స్టార్ సంస్థతో ఒప్పందం కుదిరింది… ఇవి గాకుండా థియేటర్ వసూళ్లు కూడా వస్తాయి… మరో సినిమా తీసి ప్రేక్షకుల మీదకు వదలడానికి ఈ డబ్బు చాలదా ఏం..? అవునూ, ఇంత రేటు ఎందుకు పలికినట్టు..?
సింపుల్… సౌత్ ఇండియా భాషలన్నింటికీ సంబంధించి ఓటీటీ, టీవీ రైట్స్ అవి… రామ్ కాబట్టి పెద్దగా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బు రాకపోయినా కాస్తోకూస్తో తెలుగులో జనం చూస్తారు కదా అంటారా..? అది నిజమే కానీ మరో కారణం ఉంది… బోయపాటి సినిమా ఎంత ఫ్లాపయినా సరే, టీవీల్లో జనం బాగా చూస్తారు… మంచి టీఆర్పీలు వస్తుంటాయి… అదే ట్రెండ్ ఓటీటీలో కూడా ఉంటుంది కదా… అందుకని ఈ రామ్ ప్లస్ బోయపాటి సినిమాకు హాట్ స్టార్ అంతగా రేటు పెట్టిందన్నమాట… పైగా ప్రజంట్ టాలీవుడ్ ‘‘హాట్ స్టార్’’ శ్రీలీల కూడా ఉంది ఇందులో… సో, థియేటర్ వసూళ్లు మాత్రమే సినిమా ఫ్లాప్, హిట్ కేటగిరీలను డిసైడ్ చేయదన్నమాట..!!
Share this Article