ఒక నాణేన్ని తీసుకొండి… తెలంగాణలో కొన్నిచోట్ల పైసలు అంటారు… కొందరు సిక్కా అంటారు… కొన్ని ప్రాంతాల్లో కొత్తలు అంటారు… ఆంధ్రాలో అడిగి చూడండి… నాణేలు అనే అంటారు, డబ్బులు అంటారు…….. అంటే, ఒకే దాన్ని వేర్వేరుగా పిలుచుకుంటున్నాం… అన్నీ తెలుగే మళ్లీ… వేర్వేరు అర్థాలు కావు… ఒకే అర్థం, వేర్వేరు పదాలు…… అయితే ఉల్టా చేయండి ఓసారి… వేర్వేరు అర్థాలు, ఒకే పదం… అన్నీ తెలుగే మళ్లీ… కాకపోతే ఒకే పదాన్ని అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం, బాష్యం చెప్పుకోవడం వేర్వేరు… అబ్బే, దూరాన్ని బట్టి మాండలికాలు, యాసలు వేరు గానీ మన తెలుగంతా ఒకటే అనేది శుద్ధ అబద్ధం… హైదరాబాదుకు కొత్తగా వచ్చినవాడికి ఇక్కడి భాష హిందీ అనిపిస్తుంది, కానీ ఇది ఉర్దూ… నీళ్లు అంటే రెండు భాషల్లోనూ పానీ అనే పదమే… అయినంత మాత్రాన రెండూ ఒకే భాష ఎలా అవుతాయ్… ఉర్దూ, హిందీ పదాలు బోలెడు ఒక్కరీతిలోనే ఉంటయ్… కానీ వేర్వేరు భాషలే… దేని సొగసు దానిది… దాని వ్యాకరణం దానిది…
ఇదంతా ఎందుకు పునశ్చరణ అంటే… నిన్నో, మొన్నో ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలో ఓ వ్యాసం వచ్చింది… అది నిజానికి వ్యాసం కాదు, ఓ రివ్యూ… ఓ బుక్ రివ్యూ… ఈమధ్య బుక్ రివ్యులను మెయిన్ స్పాట్ వార్తల నడుమ, ఫస్ట్ పేజీల్లో, ఎడిట్ పేజీల్లో, సినిమా పేజీల్లో… ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు కదా… కొత్త ట్రెండ్ అన్నమాట… కొలకనూరి ఇనాక్ రాసిన రంధి అనే పుస్తకంపై దేవులపల్లి పద్మజ రాసిన సుదీర్ఘ సమీక్ష… మనం ఇప్పుడు ఆ పుస్తకంలోని కంటెంటు గురించి గానీ, ఈ వ్యాసంలోని తప్పొప్పుల గురించి గానీ చెప్పుకోబోవడం లేదు… ఆయన మంచి రచయితే కాబట్టి బాగానే ఉంటుంది బుక్కు… ఇక్కడ మనం చెప్పుకునేది ఆ బుక్కు టైటిల్ గురించి..! అసలు రంధి లేదా రంది అంటే ఏమిటి అర్థం..? మామూలుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రంది అంటే చింత… విచారం… రందిపెట్టుకోకు కాకా, అన్నీ మంచిగైతయ్తీ… అంటే ఇక్కడ రంది పదానికి అర్థం ఆందోళన, దిగులు… అదే ఆంధ్రాలో కొన్నిచోట్ల రంది అంటే యావ, వ్యామోహం, మోజు… ఒక పదం, రెండు ప్రాంతాల్లో రెండు వేర్వేరు అర్థాలు… కానీ ఇక్కడ సాహితీప్రక్రియలో మరిన్ని వేరే అర్థాలు… ఇందులో సమీక్షకురాలు ఏమంటున్నదీ అంటే..?
Ads
‘‘రంధి అనే పదానికి రచయిత చెప్పిన బాష్యం శృంగార ప్రతీక… నిజానికి శృంగారం అనేది ఇద్దరి మధ్య అవగాహనతో ఆనందం పంచుకునే అవకాశం… కానీ ఇక్కడ రచయిత రంధి అనే పదం బలవంతపు ఆక్రమణగా చెబుతున్నాడు… రంది, రంధి రెండూ సంస్కృత తెలుగు పదాలు… కొన్ని సందర్భాల్లో ఈ పదాలకు గొడవ, శాస్తి, బుద్ధి రావడం, కనువిప్పు వంటి పదాలకు అన్వయిం చేసుకోవచ్చు…………….’’ ఇదీ వివరణ… నిజానికి వ్యవహారంలో రంది అనే పదాన్ని ఏ అర్థాల్లో వాడుతున్నాం..? సాహితీ ప్రక్రియల్లో ఏ అర్థాలకు వాడబడుతోంది… ఇక్కడ ఈ కథనం వెనుక రంది ఏమిటీ అంటారా..? బోలెడు పదాలకు వ్యవహారిక అర్థాలు వేరు, క్రియేటివ్ ఫామ్లో చెప్పబడుతున్న బాష్యాలు వేరు… ప్రాంతాలను బట్టి, రచయితల ప్రాంతీయతలను బట్టి… వాళ్ల అవగాహనలను బట్టి… ఇక్కడ రచయిత భాష మీద బ్రహ్మాండమైన పట్టున్నవాడే కాబట్టి తప్పుపట్టేది ఏమీ లేదు… కాకపోతే ఇలాంటి బహుళార్థాల మీదే మన రంది…!!
Share this Article