Bhasmasura Hastam: శ్లోకం:- “మరణాంతాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్ క్రియతామ్ అస్య సంస్కారో మమాఽప్యేష యద్థాతవః”
అర్థం:- విభీషణా! చనిపోయాక శత్రుత్వంతో ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్ మీ అన్న రావణుడికి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయకపోతే…నీ స్థానంలో నేనుండి ఆ సంస్కారాలు పూర్తి చేస్తాను.
ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండలో గొప్ప శ్లోకం.
Ads
ఆయనకేమి? దేవుడే దిగి వచ్చి మనిషిగా పుట్టినవాడు కాబట్టి అన్నీ ఇలాగే మాట్లాడతాడు. మనం మనుషులం కదా? రామాయణాన్ని చెవులారా వింటాం. పరవశించి నోరారా పారాయణాలు చేస్తాం. రామాయణం పుస్తకాలను నెత్తిన పెట్టుకుని పూజిస్తాం. కానీ రాముడి మాట మాత్రం వినం. ఆయన వాక్కును పాటించం. దేవుడు ఏరి కోరి మనిషిగా పుట్టి…మనిషిని గెలిపించిన కథ- రామాయణం.
పి వి నరసింహారావు అంటే నాకు చాలా అభిమానం. బహుశా రాజకీయనాయకుడి కంటే సాహిత్యవేత్తగా ఆయన గురించి జర్నలిజంలో గురువులు బూదరాజు రాధాకృష్ణ, యాదాటి కాశీపతి చెప్పిన ఎన్నో విషయాలు అలా అభిమానం ఏర్పడడానికి కారణం కావచ్చు. 1999 ప్రాంతంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో “వెయ్యేళ్ల సంస్కృత సాహిత్య చరిత్ర- ప్రాపంచిక దృక్పథం” అన్న అంశం మీద ప్రధాన వక్తగా మాట్లాడ్డానికి పి వి హైదరాబాద్ వచ్చారు. అప్పుడు నేను ఒక టీ వీ ఛానెల్లో రిపోర్టర్. ఆ సాహిత్య కార్యక్రమం రిపోర్టింగ్ డ్యూటీ నాకే వేశారు. అంతకు ముందు రోజు దూరదర్శన్ సీనియర్ కరస్పాండెంట్ సంజీవ్ థామస్ కనిపించి…రేపు మధ్యాహ్నం రాజ్ భవన్లో పి వి ని కలుస్తున్నా…నాతోపాటు రా! అని పిలిచారు- నేను పి వి ఫ్యాన్ అని తెలిసి.
మధ్యాహ్నం అనుకున్న సమయానికి రాజ్ భవన్ కు వెళ్లాము. ముందు సంజీవ్. వెనుక నేను. హౌ ఆర్ యూ సంజీవ్? ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్! అంటూ పి వీ కూర్చున్న కుర్చీలోంచి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చున్నారు. సార్! ఇతను మీ ఫ్యాన్. టీ వీ జర్నలిస్ట్ అని పరిచయం చేశారు. నమస్కారం పెట్టాను. పక్కన సోఫాలో కూర్చోమన్నారు. ఇరవై నిముషాల పాటు ఆయనతో మాట్లాడే భాగ్యం కలిగించిన సంజీవ్ కు ఆ తరువాత కనిపించిన ప్రతిసారీ కృతఙ్ఞతలు చెప్పేవాడిని. మలయాళం, ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిపోర్టింగ్ చేయగలిగిన సంజీవ్ థామస్ కు పి వి లాంటి వారే పెద్ద అభిమానులు. ఇక నేనెంత? ఒక యోగిలా బతికినవాడు. అత్యంత సౌమ్యుడు. యోగిలాగే పోయాడు. జర్నలిజానికి వన్నె తెచ్చిన సంజీవ్ థామస్ గురించి ప్రతేకంగా మరో సందర్భంలో మాట్లాడుకుందాం.
ఏ ఊరు నాయనా నీది? ఏమి చదువుకున్నావ్? మీ నాయన ఏమి చేస్తారు? అని పి వి అడిగారు. పుట్టింది కడప జిల్లాలో. పెరిగింది లేపాక్షి, హిందూపురాల్లో అని చెప్పాను. మా నాన్న, తాత గురించి చెప్పాను. హిందూపురంలో స్వాతంత్ర్య సమర యోధుడు కల్లూరు సుబ్బారావుతో ఆయనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, విద్వాన్ విశ్వం, పుట్టపర్తి నారాయణాచార్యులు, చిలుకూరు నారాయణ రావు, జానుమద్ది హనుమచ్చాస్త్రి తెలుసా? అని అడిగారు. రాళ్లపల్లి వేమన వ్యాసం గురించి చెప్పాను.సంస్కృతాంధ్ర కన్నడ ప్రాకృత సంగీత సాహిత్యాల్లో రాళ్లపల్లి హిమాలయం అంతటివారు అంటూ మైమరచి చెప్పారు. విశ్వం పెన్నేటి పాట, పుట్టపర్తి శివతాందవం నుండి ఒక్కో పద్యం పాడి వినిపించాను. పులకించిపోయారు. మీ ఊళ్లో పెన్న పారి ఎన్నేళ్ళయ్యింది అని అడిగారు? హిందూపురంలో పెన్నా నది ఉందని హిందూపురంలో ఇప్పటికీ 90 శాతం మందికి తెలియదని నా అనుమానం. ఒక్కొక్క పద్యానికి ఒక్కో బంగారు నాణెం ఇవ్వాలన్నాడు ‘పిరదౌసి’లో జాషువా. నువ్ రెండు పద్యాలు పాడావు. ఒక కాఫీ అయినా ఇవ్వాలి అని బెల్ కొట్టి…కాఫీ తీసుకు రమ్మన్నారు. తెచ్చారు. తాగాము.
కడప, అనంతపురం జిల్లాల్లో పేరున్న కవులు, అష్టావధానులు, కన్నడ ప్రభావం గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు పి వి చెబుతుంటే ఆశ్చర్యంగా వింటున్నాను. ఆయన ఇక లేచి వెళ్లిపోండి అని అనలేదు కానీ…సంజీవ్ సైగ చేశాడు…బాగోదు…ఇక మనం వెళ్లిపోదాం అని. లేచి నమస్కారం పెట్టగానే…పద్యం, శ్లోకాన్ని వదలకుండా పట్టుకో…కొన్ని వెంటనే అర్థం కాకపోయినా…శబ్ద శక్తి వృథా పోదు…అర్థం కావాల్సిన వయసులో అవుతుంది…అన్నారు. తల ఊపి వచ్చేశాను.
లేపాక్షి, హిందూపురం గురించి నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు అని అనుకునేవాడిని. పి వీ చెప్పిన లేపాక్షి, హిందూపురం సంగతులు విన్న తరువాత నాకేమీ తెలియదని క్లారిటీ వచ్చింది. ఆరోజు సాయంత్రం రవీంద్రభారతిలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నా రె సభాధ్యక్షుడు. నెమ్మదిగా మొదలై దాదాపు యాభై నిముషాల పాటు గంగా ప్రవాహంలా సాగిన పి వి ఉపన్యాసం గురించి చెప్పడానికి నాకు మాటలు చాలవు. సంస్కృత శబ్దమో, ఛందస్సో కాకుండా భారతీయ సంస్కృత కవులు ప్రపంచాన్ని ఎలా చూశారు? ప్రపంచానికి ఏమి ఇచ్చారు? అన్న విషయంపై దృష్టి పెట్టాలంటూ వాల్మీకి, వ్యాస, కాళిదాస, భారవి, శంకరాచార్యుల నుండి నిన్నటి విశ్వనాథ, పుల్లెల శ్రీరామచంద్రుడి దాకా ఆయన చెప్పిన విషయాలు రాస్తే ఒక ప్రత్యేక సిద్ధాంత గ్రంథమవుతుంది.
“శతమనంతం భవతి- సంస్కృతంలో వంద అంటే 99 తరువాత వంద అని ఎంత అర్థమో; లెక్కలేనంత అని కూడా అంతే అర్థం. ఆ కోణంలో వెయ్యి అంటే 999 తరువాత వెయ్యి కాకుండా…అనంతమయిన సంస్కృత సాహిత్యం అనుకోవాలి”
“ఇప్పటి మన పరిస్థితులతో, మన సంస్కారంతో, మన కళ్లతో, ఇప్పటి మన తూనిక రాళ్లతో అప్పటి వాల్మీకి, వ్యాస, కాళిదాస, శంకరులను తక్కెడలో వేసి కొలిచి…ఎక్కువ తక్కువల మీద తీర్పులిస్తూ మనల్ను మనం తక్కువ చేసుకుంటున్నాం. అగౌరవపరచుకుంటున్నాం. మోసం చేసుకుంటున్నాం” లాంటి మాటలు సాహిత్య పరిధిని దాటి ఏదో విశ్వజనీన సత్యాన్వేషణ మార్గంలో కనుగొన్న తాత్విక రహస్యల్లా అనిపించాయి నాకు.
అలాంటి పి వి పోయిన తరువాత ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు మీద నాకు చాలా బాధ ఉంది. అయోధ్యలో వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేయడానికి ప్రధాని హోదాలో పి వి కారణమని ఒక కాంగ్రెస్ నాయకుడంటాడు. నేనే గనుక ప్రధాని సీట్లో కూర్చుని ఉంటే కూలిపోయి ఉండేది కాదని మరో కాంగ్రెస్ అగ్ర నాయకుడంటాడు. తాజాగా కాంగ్రెస్ కురు వృద్ధ నాయకుడు మణి శంకర్ అయ్యర్ రెండడుగులు ముందుకు వేసి…కాంగ్రెస్ లో బి జె పి తొలి ప్రధాని పి వి అని వ్యంగ్యంగా పి వీ ని కించపరుస్తూ ఏదేదో మాట్లాడారు. సివిల్ సర్వెంట్ గా ఉన్నత స్థానాల్లో పని చేసిన మణి శంకర్ అయ్యర్ ఏ ప్రయోజనం ఆశించి పి వీ ని విమర్శిస్తున్నారో కానీ…ఆ రాజకీయ ప్రయోజనం నెరవేరదని ఆయనకు తెలియదు.
వీలయినంతవరకు పి వీ ని డిజోన్ చేసుకోవడం ద్వారా మైనారిటీ ఓటు బ్యాంకుకు దగ్గర కావచ్చన్న రుబ్బుడు రోలు పాత చింతకాయ పచ్చడి సిద్ధాంతాన్నే కాంగ్రెస్ శంకర శిఖామణులు నమ్ముకుని ఉంటే…మోడీ- అమిత్ షాలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? హిందూ ఓటు బ్యాంక్ కమలం వైపు కన్సాలిడేట్ కావడానికి కాంగ్రెస్ లో మరింత మంది మణి శంకర్లు పూటకో మాట అంటూ ఉండాలని మోడీ- షాలు కోరుకుంటారు. సరిగ్గా వారేమి కోరుకుంటారో కాంగ్రెస్ లో చాలా మంది అదే చేస్తూ ఉంటారు.
రాముడు పుట్టిందే రావణుడిని చంపడానికి. అలాంటివాడిని అష్టకష్టాలు పడి చంపిన తరువాత గౌరవంగా అంత్యక్రియలు చేయడం సంస్కారం. బాధ్యత. కనీస ధర్మం అన్నాడు రాముడు. పీ వీ పోయిన తరువాత కాంగ్రెస్ మణులు ఈ కనీస సంస్కారం పాటించలేకుండా ఉన్నారు.
పి వి మాటతోనే ముగిద్దాం.
ఇప్పుడు మన దగ్గర ఉన్న తూనిక రాళ్లతో అప్పటి పి వీ ని తక్కెడలో తూచి తీర్పులివ్వడం సమంజసం అవుతుందా?
పి వి కి ముందు రాజీవ్ లు, ఉత్తర ప్రదేశ్ లో అధికారంలో ఉండిన కాంగ్రెస్ పెద్దలు అదే వివాదాస్పద నిర్మాణం విషయంలో ఏమి చేశారో? కాలం చూడలేదనుకుంటున్నారా?
ఈ విషయంలో పి వీ కంటే కొంచెం వెనక్కు వెళ్లి నిజానిజాలు మాట్లాడే కాంగ్రెస్ నిక్కమయిన మణి ఒక్కటయినా ఉంటుందా?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article