Bharadwaja Rangavajhala ఆ రోజుల్లో కె.వి రెడ్డిగారు కథను ఎలా వండేవారంటే … ముందు రచయితను పిలిచి బాబూ వేరే పనులేం లేవు కదా … ఉద్యోగం గట్రా ఏమన్నా ఉంటే ముందే చెప్పు … నాతో కొంత కాలం ట్రావెల్ అవ్వాల్సొస్తుంది…. ఇంట్లో బాదరబందీలు అవీ అన్నీ క్లియర్ చేసుకుని వచ్చేయ్ అన్జెప్పేవారు.
నరసరాజు గారిని పెద్దమనుషులుకు తీసుకునే ముందు ఆయన అడిగిన ప్రశ్నలు ఆ రెండే … పర్లేదండీ ట్రావెల్ అవుతాను … ఇంటి బాదరబందీ నా మీద లేదు అన్జెప్పాకే ఆయన్ని తీసుకున్నారు.
పింగళి బ్రహ్మచారి … కనుక ఆయనతో కె.వికి ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. అలా ఓ పాయింట్ అనుకుని దాని మీద రచయితతో కూర్చుని ఓ నాలుగు నెల్ల పాటు కథ వండేవారు. కథ ఓ షేపుకొచ్చేసిన తర్వాత … స్టూడియోలోనో, తన ఇంట్లోనో పన్జేసే ఎవరినైనాను … తన ఇంటి ముందు ఉండే టాక్సీ స్టాండ్ లోని డ్రైవర్లను, మహిళలలు పిల్లలతో సహా సమాజంలోని అన్ని తరగతుల నుంచీ ఒక్కో ప్రతినిధి ఉండేలా ఓ టీమ్‌ని తన ఇంటికి పిల్చి కూర్చోబెట్టి తాను తీయాలనుకుంటున్న సినిమా కథను వాళ్లకి పూసగుచ్చినట్టు చెప్పేవారట …
Ads
చెప్పేసి పంపేసి ఓ పదిహేను రోజులు గ్యాపిచ్చి… రోజుకొక్కళ్లని పిల్చి… నేనారోజు చెప్పానే కథ దాన్ని ఓసారి నాకు చెప్పు అనేవారట … ఆ చెప్పేవారు తను చెప్పిన కథలో ఏ అంశాలను విస్మరించారు. ఏఏ అంశాల పట్ల తనను మించిన ఉత్సాహంతో మాట్లాడారు … ఇలాంటి పాయింట్లు అన్నీ రాసుకునేవారట …
అలా మొత్తం అంత మందితోనూ తిరిగి కథ ఒప్పచెప్పించుకున్న తర్వాత మళ్లీ రైటర్ ను పిల్చి కూర్చుని ఈ మేరకు రిపేర్లు చేసి … ఒక ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేసేవారట … ఇలా కథ అనే ప్రక్రియ పూర్తయ్యాక డైలాగులు కుట్టించేవారు. ఆ డైలాగులు కుట్టేప్పుడు కూడా ఏ రోజు రాసిన డైలాగులు ఆ రోజే రివ్యూ చేసేసేవారట.
డైలాగులు రాసేప్పుడు నటుడి కెపాసిటీని దృష్టిలో ఉంచుకుని వాడెక్కడ బలంగా ఉంటాడు … ఎక్కడ వీక్ గా ఉంటాడు అనేవి తెల్సుకుని మాటలు వేయమని చెప్పి, ఆ మేరకు మార్పులు చేయించేవారట. ఈ ప్రక్రియ పూర్తయ్యాక … అప్పుడు ఆయన దృష్టిలో మేధావులు అనే బ్యాచొకటి ఉండేది … ఆ బ్యాచ్ లో కవి పట్టాభి కూడా ఉండేవారు.
ఇలా సినిమా బైట తన పరిచయస్తులు మిత్రులతో కూర్చుని ఇంకోసారి ఈ కథను డిస్కస్ చేసి ఫైనల్ టచప్ ఇచ్చి … దాన్ని దగ్గర పెట్టుకుని కెమేరామెన్ , కళా దర్శకుడు లాంటి టెక్నికల్ టీమ్ తో కూర్చుని డిస్కషన్స్ పెట్టేవారట… కథలో మార్పులు సూచించమని వారినీ కోరేవారట … వస్తే వాటిని కూడా కలుపుకుని … అప్పుడు కాస్టింగ్ … బడ్జట్ వేసేవారట.
ఆయన సినిమాకు ఎన్ని కాన్ల ఫిలిం పడుతుందని రాస్తే … అంత ఫిలిమే వాడేవారట … అడుగు ఎక్కువ కాదు తక్కువా కాదు అన్నట్టు … అసలు స్క్రిప్టులోనే ఆ సీను ఎన్ని నిమిషాల ఎన్ని సెకన్లు ఉండాలో కూడా రాసేసేవారట. ఇంత కసరత్తు చేయడం వల్లే అంత కాలం ఇండస్ట్రీలో ఉండీ పద్నాలుగు సినిమాలే తీయగలిగారు.
అదే మా దాసరి గారు చూడండి, నూటాభై తీసవతల పడేశారు … డైరక్టరంటే అట్టా ఉండాలె … నేను చెప్పింది చాలా తక్కువ… సెట్స్ మీదకు వెళ్లే ముందు ఆయన చేసే కసరత్తు చాలా ఉండేదట… ప్రతి పాత్రకి స్కెచెస్ వేయించి వాటిని మార్చి … పాటలు సంగీతం దగ్గర నుంచీ ఇలానే బోల్డు టైమ్ తీసుకుని సెట్స్ మీదకు వచ్చేవాడు … చాదస్తం అని తిట్టుకున్నా సరే…
Share this Article