Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మణిశంకర్ అయ్యరుడికి ఆరోజు బాగానే దేహశుద్ధి జరిగింది… కానీ..?

September 4, 2023 by M S R

Nancharaiah Merugumala….  పీవీకి తెలుగు బ్రామ్మల్లో ఉన్న అభిమానుల్లో నాలుగో వంతు… ఎన్టీఆర్‌ కు కమ్మ జనంలో ఉంటే…టీడీపీ స్థాపకుడి జీవితం అలా ముగిసేదా? …………………………………………………… ఎప్పుడో పాతిక ముప్పయేళ్ల క్రితం అయోధ్యలో బాబరీ మసీదు కూల్చడానికి నాటి కాంగ్రెస్‌ ప్రధాని పాలములపర్తి వేంకట నరసింహారావు గారు ఆరెసెస్‌–బీజేపీ శ్రేణులకు వీలుకల్పించినందుకు ఇప్పుడు సాటి దక్షిణాది బ్రాహ్మణ నేత నుంచి నిందలు పడాల్సివస్తోంది. కరీంనగర్‌–వరంగల్‌ ప్రాంత తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పీవీ గారిని హిందూ మతోన్మాదిగా చిత్రించారు నాటి బ్రిటిష్‌ ఇండియాలోని అవిభక్త పంజాబ్‌ నగరం లాహోర్‌ లోని తమిళ అయ్యర్‌ బ్రామ్మణ పరివారంలో పుట్టిన మణిశంకర్‌ అయ్యర్‌. దెహరాదూన్‌ బోర్డింగ్‌ స్కూల్లో పండిత నెహ్రూ పెద్ద మనవడు రాజీవ్‌ గాంధీకి మూడేళ్ల సీనియరైన ‘మణి’ నోరు ఎప్పుడూ మంచిది కాదు. వెకిలి రాతలకు ఆయన బాగా ఫేమస్‌.

ఇదివరకెప్పుడో ముఖ్యమంత్రి పదవిలో ఉండగా పిల్లల్ని కన్న పాపానికి ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ను ‘ఈయన మోటు మండల్‌ మనిషి. బండల్‌ నేత. పంది మాదిరిగా లాలూ ఎక్కువ మందికి జన్మనిచ్చాడు,’ అంటూ నాటి ప్రఖ్యాత ఇంగ్లిష్‌ వీక్లీ ‘సండే’లోని తన కాలమ్‌ లో రాశారు మణి అయ్యర్‌. ఇప్పుడు రాజకీయావసరాల కోసం అదే లాలూ పరివారంతో సోనియా–రాహుల్‌ గాంధీ కుటుంబం కూటమి కట్టినా ఈ తమిళ బ్రామ్మణ మేధావికి అసలు బాధే లేదు. లాలూ కూడా మణిని క్షమించి వదిలేశారు. తెలుగు బ్రామ్మలంటే 125 ఏళ్ల క్రితం నుంచే తమిళ బ్రాహ్మణులకు (వారు అయ్యర్లయినా, అయ్యంగార్లయినా) చాలా లోకువ. అరవ బ్రామ్మలు తమకు ఇవ్వాల్సినంత ‘మర్యాద’ ఇవ్వడం లేదనే అక్కసుతో 20వ శతాబ్దం తొలి పాతికేళ్లలో తెలుగు బ్రామ్మలు ప్రత్యేక ఆంధ్ర అంటూ ఉద్యమించారు. 1952 శీతాకాలంలో నెల్లూరు వైశ్య నేత పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానంతో విజయం సాధించారు.

తెలుగు బ్రాహ్మణులకు గర్వకారణమైన ఏకైక నేతపైనే అరవ బాపనాయన ఆక్రోశం!

Ads

……………………………………………………….

తన ఆత్మకథ మొదటి భాగం ‘మొమొయిర్స్‌ ఆఫ్‌ ఏ మావరిక్‌’లో మణి శంకర్‌ అయ్యర్‌ తాను తన గురించి మొదట్నించీ చెప్పుకుంటున్నట్టు ‘సెక్యులర్‌ ఫండమెంటలిస్ట్‌’ (లౌకిక ఛాందసవాది?) అని నిరూపించుకోవడానికి పీవీ నరసింహారావు గారి ‘పాత పాపం’పై కొత్తగా విరుచుకుపడడం అనేక మంది తెలుగు బ్రాహ్మణ మేధావులు, లౌకిక ధార్మికవాదులకు చాలా కోపం వచ్చింది. వారిలో కొందరు పత్రికల్లో ఈ విషయంపై వ్యాసాలు కూడా రాసేస్తున్నారు. అసలు తెలంగాణవారైనా, కోస్తా జిల్లాలకు చెందినవారైనా లేదా రాయలసీమకు చెందిన వారైనా సకల తెలుగు బ్రాహ్మణులందరికీ జాతీయ స్థాయిలో, ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చింది మాత్రం నరసింహారావు గారే.

ఏమాటకు ఆ మాట–పీవీ గారికి బ్రాహ్మణ జనంలో ఉన్న ఆదరణలో కనీసం నాలుగో వంతు అయినా కమ్మ మహాజనంలో నందమూరి తారక రామారావు గారికి ఉండి ఉంటే ‘విశ్వ విఖ్యాత నటసార్వభౌముడి’ జీవితం అంత దయనీయంగా ముగిసేది కాదు. ఏదేమైనా తన జాతిజనంలో (అన్ని శాఖలు, ఉపశాఖల బ్రాహ్మలు) పాములపర్తి వారు సంపాదించుకున్న ప్రేమానురాగాలు చాలా గొప్పవి. సొంత జాతీయులను ఆకట్టుకోవడంలో ఇలాంటి అదృష్టం సకలాంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఏడున్నరేళ్లకు పైగా రాజ్యమేలిన ఎన్టీఆర్‌ కు దక్కలేదు.

అమర్‌ సింగ్‌ చేతిలో తన్నులు తిన్న మణిశంకరయ్యర్‌!

……………………………………

మళ్లీ మణిశంకర్‌ విషయానికి వస్తే..పీవీని దూషించినందుకు ఆయనను తెలుగు బ్రామ్మణ మేధావులు తేలికపాటి ఆరోపణలు లేదా విమర్శలతో వదిలేశారనే చెప్పొచ్చు. అదే ఉత్తర్‌ ప్రదేశ్‌ కు చెందిన ఠాకుర్‌ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ అమర్‌ సింగ్‌ మాత్రం 2000లో తనతో బాగా మద్యం తాగి గొడవపడిన మణిశంకర్‌ ను వదిలిపెట్టలేదు. నాటి బీజేపీ తొలి ప్రధాని (నిజంగానే) అటల్‌ బిహారీ వాజపేయి మీడియా సలహాదారుగా పనిచేస్తున్న ఎచ్‌.కే.దువా పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా తోటి పంజాబీ ప్రముఖుడు, ప్రసిద్ధ ఆర్టిస్ట్‌ సతీష్‌ గుజ్రాల్‌ దిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హొటేల్లో పార్టీ ఇచ్చారు. ప్రధాని పాల్గొన్న ఈ పార్టీకి మణిశంకరయ్యర్‌ రావడమేగాక ఆరేడు పెగ్గుల విస్కీ కడుపులోకి పోసేసుకున్నారు.

అక్కడే కనిపించిన ఎస్పీ నేత ములాయంసింగ్‌ సన్నిహితుడైన రాజ్యసభ ఎంపీ అమర్‌ సింగ్‌ దగ్గరకుపోయి మణి గొడవపెట్టుకున్నాడు. ‘నా ముక్కూ, నీ బాస్‌ ములాయం ముక్కూ ఒకే తీరున ఉంటాయి. బహుశా ములాయం సొంతూరుకు 1930ల చివర్లో నా తండ్రి వెళ్లి ఆయన తల్లిని కలిసి ఉంటారు. అందుకే మా ఇద్దరి ముఖంలో పోలిక,’ అని మణిశంకర్‌ వాక్యం పూర్తిచేసే సమయానికి ఆయనను అమర్‌ నేలమట్టం చేశారు. అయ్యర్‌ పొట్టమీదకెక్కి పిడిగుద్దులు వేస్తుండగా ఆ పార్టీ కొచ్చిన ప్రముఖులు అమర్‌ సింగ్‌ నుంచి అయ్యర్‌ గారిని కాపాడారు. తన విధేయత కారణంగా తన రాజకీయ గురువు ములాయంపై మాటలు తూలినందుకు మణిశంకర్‌ కు అమర్సింగ్‌ దేహశుద్ధి చేశారు.

పీవీ కన్నుమూసిన దాదాపు 20 ఏళ్లకు నోటికొచ్చినట్టు ఆయనను విమర్శించినందుకు మణిశంకర్‌ పై ఇప్పుడు తెలుగు బ్రాహ్మణ బుద్ధిజీవులు వ్యాసాలతో కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ నేత నరేంద్రమోదీ ప్రధాని పీఠమెక్కడానికి కొన్ని నెలల ముందు ‘ఈ ఛాయ్‌ వాలా ఏఐసీసీ ఆఫీసు ముందు టీ అమ్ముకోవచ్చు,’ అనీ తర్వాత కొన్నేళ్లకు మోదీ ‘నీచజాతివాడు’ అంటూ కారుకూతలు కూసినా మణిశంకర్‌ అయ్యర్‌ కు ఏమీ కాలేదు. రాహుల్‌ ను కోర్టుకు లాగినట్టు ఈ అరవాయనపై కేసులు పెట్టలేదు. మరి 82 ఏళ్ల వయసు దాటిన మణిని తెలుగు బ్రామ్మలు కూడా బీజేపీ మాదిరిగా క్షమించి వదిలేస్తున్నారనే అనుకోవచ్చు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions