షారూక్ ఖాన్ తన సినిమాల విడుదలకు ముందు వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన ఉదాహరణలు ఉన్నాయ్… పఠాన్ విడుదలకు ముందు ఆ గుడికి వెళ్లి పూజలు చేశాడు… ఇప్పుడు జవాన్ సినిమా విడుదలకు ముందు కూడా వెళ్లాడు… 9 నెలల్లో రెండుసార్లు ఆ గుడికి వెళ్లాడు… ఉత్తర భారతంలోని గుడికి వెళ్లి పూజలు చేయడం ఆయా సందర్భాలలో మంచి కవరేజీని కూడా పొందింది… సహజమే… బాలీవుడ్ టాప్ స్టార్ ఓ హిందూ గుడికి వెళ్లి, తన సినిమా విజయం కోరుతూ ప్రత్యేక పూజలు చేయడం విశేషమే… అభినందనీయం కూడా…
సరే, తను ఆ ఉత్తర భారత ఆలయానికి వెళ్లడం వెనుక తన విశ్వాసం ఏదైనా ఉండనీ… ఈసారి జవాన్ సినిమా కోసం బిడ్డ సుహానా ఖాన్‌తో కలిసి తిరుపతి వచ్చాడు… తిరుమలకు తనతోపాటు సినిమాలో నాయికా నటించిన నయనతార కూడా వచ్చింది… సహజంగానే ఆమెతోపాటు మొగుడు విఘ్నేశ్ కూడా వచ్చాడు… ఇవన్నీ పెద్ద చెప్పుకోదగిన విశేషాలు ఏమీ కావు… కానీ..?
షారూక్ ఖాన్ తొలిసారి దక్షిణ భారత ప్రధాన ఆలయం తిరుమల వెంకటేశ్వరస్వామి గుడికి రావడం కొన్ని ఇతరత్రా వాదనలకు, విశ్లేషణలకు తావిస్తోంది… దీనికి నేపథ్యం స్టాలిన్ కొడుకు ఉదయనిధి చేసిన హిందూ వ్యతిరేక, సనాతన ధర్మ నిర్మూలన వ్యాఖ్యలు… సరే, కొన్ని పార్టీలు తన వ్యాఖ్యల్ని ఖండించాయి… కొందరు స్వాములు తనను శిక్షిస్తే భారీగా నగదుతో సత్కరిస్తామనీ ప్రకటించారు… మొత్తానికి ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఓ కలకలానికి దారితీశాయి…
Ads
మోడీ సైతం ఉదయనిధి వ్యాఖ్యల్ని కౌంటర్ చేయాలని తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్టు కూడా వార్తలు వచ్చాయి… ఉదయనిధి వ్యాఖ్యల్ని సొమ్ము చేసుకునే వ్యూహం అన్నమాట… ఈ జవాన్ సినిమాకూ ఉదయనిధికీ సంబంధం ఏమిటీ అనే సందేహం వస్తోందా..? ఉంది… ఉదయనిధికి చెందిన సొంత సినిమా సంస్థ రెడ్ జెయింట్ (RED GAINT)… జవాన్ సినిమాను తమిళనాడులో అదే డిస్ట్రిబ్యూట్ చేస్తోంది… ఈ సినిమా హిందీలో నిర్మితమైనా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది… మన దేశమే కాదు, బంగ్లాదేశ్, సింగపూర్, స్పెయిన్, ఇతర ఓవర్సీస్‌లో కూడా…
తమిళనాడు, కేరళ కలిపి థియేటరికల్ రైట్స్ 50 కోట్లకు విక్రయం జరిగింది… (తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజ్ డిస్ట్రిబ్యూటర్…) పేరుకు హిందీకి బద్ధవిరోధులుగా తమిళులు కనిపిస్తారు గానీ హిందీ సినిమాలు బాగానే ఆడతాయి… పైగా ఈ సినిమాలో హీరోయిన్ నయనతార… దర్శకుడు ఆట్లీ… చెన్నైలో ప్రిరిలీజ్ ఫంక్షన్ కూడా భారీగా నిర్వహించారు… పైగా హిందీవాళ్లకు ఇప్పుడు సౌతిండియా మార్కెటే ప్రధాన రెవిన్యూ వనరుగా కనిపిస్తోంది… ఆమధ్య సల్మాన్ ఖాన్ అదేదో సినిమాను సగం తెలుగు, సగం హిందీ అన్నట్టు తీశాడు కదా… అందులో బతుకమ్మ పాట, వెంకటేశ్ పాత్ర కూడా ఉన్నాయి…
ఉదయనిధి వ్యాఖ్యలతో హిందువుల ఆగ్రహం ప్రభావం జవాన్ సినిమా మీద ఉంటుందేమో అనేది సినిమా నిర్మాతల ఆందోళనగా తెలుస్తోంది… సినిమా నిర్మాత షారూకే… భార్య గౌరీఖాన్ పేరుతో…!! అందుకని స్ట్రెయిట్‌గా సౌతిండియాకు, అందులోనూ చెన్నైకి దగ్గరలోని తిరుమలకు వచ్చేసి (తిరుమల కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధానాలయం).., సో, ఉదయనిధి (Baby Stalin అని కొందరు తాజాగా పేరుపెట్టారు…) తన వ్యాఖ్యలతో తను రిలీజ్ చేసే సినిమాకు నష్టం రావద్దనే భావనతో ఇక హీరో షారూక్ ఖాన్‌ను తిరుమలకు రప్పించి, హిందూ సమాజాన్ని సంతృప్తి పరిచే ప్లాన్ వేశాడనే అభిప్రాయం వినిపిస్తోంది…
పార్ధసారధి పోట్లూరి ఏమంటారంటే…? ‘‘వార్ని! షారూక్ టెంపుల్ రన్ వెనక ఉన్న రహస్యం ఇదా? షారూక్ ఖాన్ జవాన్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది! అయితే తమిళనాడుకు సంబంధించి జవాన్ సినిమా హక్కులు రెడ్ జయింట్ (RED GAINT) సంస్థ కొన్నది! రెడ్ జయింట్ సంస్థ ఉదయనిధిది! So, పిక్చర్ క్లారిటీగా కనపడుతుంది కదా? అమ్మ, షారూకు, ఎంత నాటకం ఆడావు! ఉదయనిధీకి నష్టం రాకూడదు అనే కదా?’’ ఇదీ తన వ్యాఖ్య… ఇటు హిందువుల్ని, అటు సినిమా ప్రేక్షకుల్ని కలిపి పిచ్చోళ్లను చేయడానికి ప్రయత్నిస్తున్న ఉదయనిధికి పాఠం నేర్పాలంటే ఈ సినిమాను ఎందుకు బహిష్కరించకూడదు అనేది ఓ సెక్షన్ అభిప్రాయం… ఇవన్నీ సరే, ఈ వివాదాలు, రచ్చతో ఉదయనిధిని బాగా పాపులర్ చేస్తున్నారా..? తనలో నిజంగానే పరిణతి ఉందా..? తన రేంజ్ అంత పెద్దదా..? కాషాయ శిబిరం ఈ కోణంలో ఆలోచించనట్టుంది బహుశా…!!
అన్నట్టు… పనిలోపనిగా ఈ వీడియో కూడా చూసేయండి… సదరు ఉదయనిధి అమ్మ… తన ఇంట్లో పూజలు ఎలా చేస్తుందో, ఆమె పూజగది ఎలా ఉందో ఇందులో చూడొచ్చు… సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అంటున్నాడు కదా ఉదయనిధి… ముందుగా మీ తల్లికి చెప్పవోయ్ అంటారా..? ఆమె తన భర్త స్టాలిన్ చెబితేనే వినదు, మామ కరుణానిధి చెబితే కూడా వినలేదు… ఇక కొడుకు చెబితే ‘సనాతన ధర్మాన్ని’ విడిచిపెడుతుందా..?! అబ్బే…!!
Share this Article