సగటు తెలుగు సినిమా అనగానే… బీభత్సమైన మానవాతీత ఫైట్లు… జబర్దస్త్ తరహా వెకిలి కామెడీ… రొటీన్ కథ… రొడ్డకొట్టుడు కథనం… ప్రతీకారాలు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనలు వంటివి ఎన్నో గుర్తుకువస్తుంటాయి కదా… తలతిక్క ఇమేజీ బిల్డింగ్ మూసలో పడి కొట్టుకుపోతుంటాయి కదా… కొన్ని డిఫరెంట్ సినిమాలు వస్తుంటాయి… కొన్ని మాత్రమే… ఒకటీ అరా… అలాంటిదే ఈ సినిమా… టైటిల్ శెట్టి పోలిశెట్టి…
ఓ భిన్నమైన సబ్జెక్టు… ఓ రిజిడ్ స్త్రీ… వృత్తిరీత్యా చెఫ్… తన తల్లి చేదు అనుభవాలతో తను పెళ్లి చేసుకోవద్దని అనుకుంటుంది… కానీ సంతానం కావాలి… తన ఒంటరితనం నుంచి రిలీఫ్… ఓ బంధం కావాలి… ఓ వీర్యదాత కోసం అన్వేషణ… అప్పుడు కనిపిస్తాడు పోలిశెట్టి… స్టాండప్ కమెడియన్… వాళ్ల పరిచయం ఎటువైపు పోయిందనేది కథ… మామూలుగా తీస్తే పెద్దగా ఆనదు… కానీ అనుష్క, పోలిశెట్టి, జయసుధ, మురళీశర్మ ఎట్సెట్రా తారాగణంతో ఓ ఫుల్ ఫీచర్ ఫిలిమ్‌గా రూపుదిద్దేసరికి ఓ మోస్తరు చూడబుల్ సినిమా అయ్యింది…
పోలిశెట్టి గతంలో స్టాండప్ కమెడియన్‌గా ప్రసిద్ధుడే… కామెడీ డైలాగులు గానీ, ఇతరత్రా గానీ మంచి టైమింగుతో వదలడం తనకు అలవాటే… జాతిరత్నాలు సినిమాలో చూశాం కదా… ఈ సినిమాకు కూడా అదే బలం… అంతటి అనుష్కను కూడా డామినేట్ చేసేశాడు… సినిమా మొత్తాన్ని దాదాపుగా తనొక్కడే మోశాడు… ప్రమోషన్లు సహా… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది పోలిశెట్టి సినిమా… తన సహజమైన స్టాండప్ కామెడీ షోలో ఓ పెద్ద బిట్…
Ads
నిజానికి సినిమా అంటేనే దృశ్యప్రధానం… కానీ ఈ సినిమా ప్రధానంగా డైలాగుల మీదే నడుస్తుంది… కథ రీత్యా తప్పదు… కథనానికీ దాన్నే నమ్ముకున్నాడు దర్శకుడు… వాస్తవంగా ఈరోజుల్లో స్పెరమ్ బ్యాంకులు, ఐవీఎఫ్ సెంటర్లు బోలెడు… వీర్యదాత కోసం అన్వేషణ అనే పాయింటే కాస్త కన్విన్సింగుగా లేదు… పైగా అంతటి అనుష్క శెట్టి పక్కన జంటగా ఈ పోలిశెట్టి ఏమిటని అనుకున్నారు అందరూ… నిజంగానే ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పూర్… అనగా బాండింగ్ పూర్…
కానీ, కథాగమనంలో, కామెడీలో ఇవేవీ పెద్దగా మైనస్ అనిపించవు… పెద్దగా ఎమోషనల్ సీన్లు లేకపోయినా, ఇతరత్రా కనెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోయినా లోటుగా ఫీల్ కాము… కామెడీకి తీసుకున్న అంశాలు కూడా మరీ కృత్రిమంగా ఉండకుండా, ప్రజెంట్ యూత్, ప్రజెంట్ ట్రెండ్స్‌నే తీసుకున్నారు… తెర వంగిపోయేంత బరువైన సీన్లు ఏమీ లేవు… నవ్వొచ్చిన చోట నవ్వుకోవడం, నవ్వుతూ థియేటర్ వదిలి బయటికి రావడం… అదే సినిమా లక్ష్యం… అది నెరవేరింది…
అనుష్క అందంగా ఉంది… మరీ ఆ పాత అనుష్క కనిపించకపోయినా సరే, అనుష్క అంటే అనుష్కే… అంతే… మిగతావాళ్లు సోసో… సంగీతం, పాటలు సోసో… మిగతా నిర్మాణ విలువలు పర్లేదు… ముందే చెప్పుకున్నాం కదా ఇది పోలిశెట్టి షో అని… మరో అభినందనీయం ఏమిటంటే… సినిమా తన జానర్ నుంచి ఇంచు కూడా పక్కకు జరగలేదు… మన తెలుగు సినిమా తాలూకు సగటు చెత్తదనం, వందల కోట్ల దుర్గంధం నడుమ ఒకింత రిలీఫ్…
అవునూ, ఇందులో అనుష్క పాత్ర మంచి గ్రేస్‌తో, హుందాగా సాగుతుంది, ఇకపైన పాత్రల్ని కూడా ఇలాంటివే ఎంచుకుంటుందా..? నడుం ఊపుళ్లు, ఛాతీ విరుపులు, పృష్ట ప్రదర్శనలు వంటి సగటు తెలుగు హీరోయిన్ ధోరణులకు ఇక దూరం అన్నట్టేనా..? గుడ్… (యూఎస్ రిపోర్ట్స్ ఆధారంగా…)
Share this Article