ఆమధ్య ఇదే షారూక్ ఖాన్ సినిమా వచ్చింది… పఠాన్… అబ్బో, వందల కోట్ల వసూళ్లు, బంపర్ హిట్ అని మీడియా ధూంధాం రాసేసింది… తీరా తన సర్కిళ్లోని నటీనటులే ఆ లెక్కల మీద జోకులు వేశారు… అప్పుడు కూడా షారూక్ వైష్ణోదేవి గుడికి వెళ్లి వచ్చాడు… ఇప్పుడు తన సొంత సినిమా… ఇదీ పాన్ ఇండియాయే… ఇప్పుడు కూడా వైష్ణోదేవిని దర్శించుకున్నాడు… అదనంగా తిరుమలకూ వచ్చి వెళ్లాడు… ఎందుకనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం… నాలుగురోజులపాటు దీని వసూళ్ల గురించి టాంటాం జరుగుతుంది… పక్కా…
తనకు సౌత్ మార్కెట్‌లో వసూళ్లు కావాలి… తమిళ దర్శకుడు ఆట్లీ, తమిళ హీరోయిన్ నయనతార, తమిళ విలన్ విజయ్ సేతుపతి, తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్… వాట్ నాట్… షారూక్ ఓ తమిళ సినిమాలో నటించాడు అంటే బెటర్… ఇంకా చెప్పాలంటే, రొంబ అరవ వాసన… అసలే తమిళ రొటీన్ కమర్షియల్ సినిమాలు అంటేనే అతి… పైగా ఆట్లీ… తనకూ ఓ కమర్షియల్ సినిమా కావాలన్నాడు షారూక్… ఇక చెప్పేదేముంది..?
అడ్డదిడ్డంగా ఓ కథ రాసుకుని… అతి మీరిన యాక్షన్ సీన్లను గుప్పించాడు దర్శకుడు… అఫ్‌కోర్స్, ఆ యాక్షన్ సీన్లను అదరగొట్టారు… ఆ బీజీఎం, ఆ గ్రాఫిక్స్, ఈ వయస్సులోనూ జోష్ తగ్గని షారూక్… మొత్తానికి సినిమా అంతా డిష్యూం డిష్యూం… మరి సగటు సౌత్ సినిమా అంటే రొమాన్స్, కామెడీ, ఐటమ్ సాంగ్స్ గట్రా ఉండాలి కదా అంటారా..? అక్కడక్కడా ఏదో టచ్ చేయబోయాడు గానీ… సినిమా మొత్తం షారూక్ యాక్షన్ సీన్లే కనిపిస్తాయి…
Ads
సేమ్, సగటు తెలుగు పాపులర్ హీరోలాగా… కథలో లాజిక్కులను కూడా పక్కన పెట్టేసి… సినిమా అంతా ఒకటే ఉరుకులు, పరుగులు, కాల్పులు, చేజింగులు ఎట్సెట్రా… ఈ యాక్షన్ సీన్ల నడుమ కథ అనే భ్రమపదార్థాన్ని వెతుక్కోవాలి… నటీనటుల విషయానికి వస్తే విజయ్ సేతుపతి పర్లేదు… నయనతార పేరుకే ప్రధాన నాయిక, ఆమెకు అంత పెద్ద సీనేమీ లేదు… అంతా షారూకే…
ఆమధ్య సల్మాన్ ఖాన్ ఏదో సినిమా తీశాడు… అంతకుముందు ఆమీర్ ఖాన్ తీశాడు… ఇద్దరూ పడిపోయారు… కానీ పఠాన్ సినిమాతో షారూక్ ఊపిరి పీల్చుకున్నట్టున్నాడు… ఇదీ పాన్ ఇండియా కాబట్టి మరీ అంత ఫ్లాపయ్యేలా లేదు, పర్లేదు రేంజ్ కాబట్టి గట్టెక్కుతాడు… కానీ ఒక ప్రశ్న… బాలీవుడ్ పెద్ద స్టార్లకు సౌత్ ఇండియా కమర్షియల్ సినిమా తాలూకు అతితనం బాగా ఎక్కింది, దేనికని..?
యాక్షన్ జానర్‌కు కాస్త దేశభక్తిని అద్దడం, దర్శకుడు శంకర్ సినిమాల్లోలాగా ప్రధాన పాత్రధారి సమాజోద్ధరణలో ఓవరాక్షన్ చేయడం ఈమధ్య ట్రెండ్ కదా… ఇదీ అంతే… అదే బాట… ఈ సినిమాలో కూడా హీరో చాలా చాలా బీభత్సమైన, అసాధారణమైన చర్యలతో సొసైటీని ఉద్దరిస్తూ ఉంటాడు… రైతుల ఖాతాల్లో నలభై వేల కోట్లు వేయిస్తాడు… మరోసారి ఆరోగ్య శాఖా మంత్రిని కిడ్నాప్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ ని ఆధునీకరిస్తాడు…
సాధ్యాసాధ్యాల సంగతి దేవుడెరుగు, ప్రేక్షకుడికి కనెక్టయ్యేలా చెప్పామా లేదానేదే ప్రధానం… ఎస్, యాక్షన్ ఇష్టపడే సెక్షన్‌కు ఈ సినిమా కాస్త నచ్చొచ్చు… కథ, కథనాలను వదిలేయండి… జైలర్‌తో దుమ్మురేపిన అనిరుధ్ ఇందులో పెద్దగా ఊడబొడిచింది ఏమీ లేదు… నిరాశపరిచాడు… కథలో కిక్కు లేకపోవడమే కాదు, రాసుకున్న సీన్లు కూడా ఉత్కంఠ రేపేలా ఏమీ లేవు… దర్యాప్తు చేసే నయనతార ఏం సాధించిందో ప్రేక్షకుడికి అంతుపట్టదు, బహుశా దర్శకుడికీ తెలిసి ఉండదు… అన్నట్టు ఇది ఓ పాత కథ… అప్పట్లో భాగ్యరాజా తీసిన ఖైదీవేట సినిమా కథకే కాస్త మార్పులు చేర్పులు చేశారు… అంతే… యూట్యూబ్‌లో ఆ పాత ఖైదీవేట చూడటం బెటర్ అంటారా..? మీ ఇష్టం..!
Share this Article