Bharadwaja Rangavajhala …. ఇది చాలా పురాతన పోస్టు… మళ్ళీ తగిలించా అప్పుడెప్పుడో…. పక్షవాతానికి ఆయుర్వేదపు వైద్యం అంటూ మణిభూషణ్ ఓ పోస్టు పెట్టారు. దాన్ని నేను లైక్ చేయడమే కాక ప్రపంచీకరణ నేపధ్యంలో ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని కూడా ఒక వ్యాఖ్య జోడించాను. దీనిపై కొందరు మిత్రులు ఆగ్రహించారు. మొన్ననే కన్నుమూసిన బత్తిన ఆయన సోదరుల చేపమందును కూడా తెరమీదకు తెచ్చారు. విద్య, వైద్యం లాంటి సేవలు అందించడం నుంచి తాను స్వచ్చందంగా వైదొలగుతున్నట్టు ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రకటించేశాయి.
చదువంటే నారాయణ , చైతన్యల్లో చదివేదనిన్నీ, వైద్యం అంటే…యశోదా, కేర్, అపోలోల్లో మాత్రమే చేయునది అనిన్నీ అర్ధంగా మారిపోయిన పరిస్థితి. సైంటిఫిక్ అనే పేరు చెప్పి ఊళ్లల్లో అక్కడి ప్రజల ఆర్ధిక పరిస్థితులకు అందుబాటులో జరిగే వైద్యాన్ని కాదనడం ద్వారా వారినీ కార్పోరేట్ ఆసుపత్రులకు బలిచేయడమేగా మనం చేస్తోంది.
చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆర్.ఎమ్.పి డాక్టర్ల మీద దాడులు జరిగాయి. ఆ తర్వాత ఎమ్.బి.బిఎస్సుల మీదా దాడి జరిగింది. రోగనిర్దారణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే పేరుతో అది నడిచింది. అది కూడా శాస్త్రీయత పేరుతోనే రోగుల్ని కార్పోరేట్ ఆసుపత్రులకు గెంటేసే ప్రయత్నంగానే సాగింది.
Ads
ఇక వైఎస్ రాజ్యంలో సూపర్ హిట్ పథకం ఆరోగ్యశ్రీ కూడా ప్రజల్ని కార్పోరేట్ ఆసుపత్రులకు అలవాటు చేసింది. అభ్యుదయం, శాస్త్రీయత అనే పదాల నుంచీ కూడా అద్భుతమైన లాభం పొందేందుకు కార్పోరేట్లకు చక్కటి వ్యూహాలు ఉన్నాయని అర్ధమౌతుంది. తమకు లాభం కలిగేలా ఉండే ఆలోచనలను ప్రమోట్ చేయడం కోసం…ప్రజల్లో అప్పటికే పాతుకుపోయిన నిరసనలను రెగ్యులేట్ చేయడం కోసం ఎన్జీవోల ప్రమోషనూ చేశాయి.
ఇలా వెనుకబడ్డ దేశాలను కబళించేందుకు పెట్టుబడిదారీ శక్తులకు అభ్యుదయం అనేది అద్భుతంగా ఉపయోగపడిందనే చెప్పాలి. మూఢనమ్మకాల పేరుతో… పాతంతా తప్పే అనే ఆలోచనతో కమ్యునిస్టులు చేసే ఆచరణను కూడా తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాయి సదరు శక్తులు.
తప్పు అని చెప్పడంతో పాటు ప్రత్యామ్నాయాన్ని చూపించగలగడం తక్షణ అవసరం. చేపమందు తప్పని చెప్పి బత్తిన సోదరుల దగ్గరకు వెళ్తున్న ఆస్త్మా పేషంట్లను యశోదా కేర్లకు బలి చేయడం కాకుండా అందుబాటు ధరలో వైద్యం అందించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగలిగామా? అనేది ప్రశ్న.ఒకప్పుడు ప్రోగ్రెసివ్ శక్తులు చాలా ఊళ్లల్లో ప్రజావైద్యశాలలు నిర్వహించేవి. అవన్నీ మూతపడుతున్నాయి. చాలా ఊళ్లలో మూతపడిపోయాయి కూడా. అలాగే స్కూళ్లు కూడా నడిపిన చరిత్ర ఉంది. అవీ మూతపడిపోయాయి.
ప్రజలకు ప్రత్యామ్నాయాలు తాము కల్పించలేని పరిస్థితిలోకి ఎందుకు వెళ్లిపోవాల్సి వస్తోందో ఒక్క సారి వారికి వారు ఆలోచించుకోవాలి.ఆ మధ్య నేను చండ్ర రాజేశ్వర్రావు వయో వృద్దాశ్రమానికి వెళ్లాను. ఓ మిత్రుడి తల్లిగారిని అక్కడ చేర్పించాలనేది ప్రయత్నం. అక్కడ వాళ్లు చెప్పిన విషయం ఏమిటంటే…అయ్యా…అంతా బాగానే ఉంటుంది. నెలనెలా మెస్ బిల్లు తప్ప మరేం కట్టక్కర్లేదు. అయితే ముందుగా డొనేషను మాత్రం కట్టాలి.ఓ తరహా రూముకు ఇన్ని లక్షలు, మరో తరహా రూముకు మరిన్ని లక్షలు అన్నారు. అంటే వీరున్నంత వరకూ ఆ రూమ్ వీళ్ళు కొనుక్కున్నట్టు అన్నమాట.
ఏదో నెలకు మూడు వేలో నాలుగువేలో కట్టేసి సమస్య నుంచీ గట్టెక్కేద్దామనుకున్న నా స్నేహితుడు ఖంగు తిన్నాడు. అసలు సౌకర్యాలు ఎలా ఉంటాయో చూద్దామని ఒక రూమ్ లోకి ప్రవేశించాం.అద్భుతంగా ఉందక్కడ. ఏసీ ఉంది. వాషింగ్ మెషిన్ ఉంది. సకల సౌకర్యాలూ ఉన్నాయి. ఒక ముసలావిడ ఆవిడ సహాయకురాలూ ఉన్నారు. హెల్పర్ ను తనే ఊర్నించీ తీసుకొచ్చినట్టు చెప్పారావిడ.
ఆవిడ యవ్వనంలో ఉండగా… కృష్ణా జిల్లా కమ్యునిస్టు పార్టీలో యాక్టివ్ మెంబరట. పిల్లలు స్టేట్స్ లో సెటిలయ్యారు.కాట్రగడ్డ మురారి అన్నట్టు కృష్ణా జిల్లా కమ్యునిస్టు అన్నాక ఇక కులం చెప్పాల్సిన అవసరం లేదు. తాము అమెరికా నుంచి వచ్చి చూడడానికీ, దానికీ కన్వినియంట్ గా ఉంటుందని చండ్ర రాజేశ్వరరావు వయో వృద్దాశ్రమాన్ని వారు ఎంచుకున్నారు. సింగిల్ చెక్ తో ఈ పెద్దరూమ్ తీసేసుకున్నాడయ్యా మా అబ్బాయి…అందావిడ.
ఏదో నలుగురూ మన పార్టీవాళ్లే ఉంటారు. కొందరు నాన్ కమ్యునిస్టులు కూడా ఉంటారనుకోండి… నాలుగు అభ్యుదయపు మాటలూ అవీ మాట్లాడుకోడానికి బాగుంటుంది.. అని ఇక్కడ చేరాం అని చెప్పారావిడ. ఇలా సేవ కాస్ట్ లీ అయిపోయింది.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు ఎన్నికల కమ్యునిస్టు పార్టీలు కోట్ల రూపాయలతో టెలివిజన్ ఛానళ్లు పెట్టాయి. సమాచారం కోసం జనం ముఖం వాచిపోతున్నారు. లేదూ, వాళ్లకేదో తప్పు సమాచారం ఫీడైపోతోంది. మనం దాన్ని కరక్ట్ చేద్దాం అని చెప్పడమే తప్ప ఆచరణలో జరిగేది శూన్యం.
శూన్యం జరిగి వాటిని విజయవంతంగా అమ్మేశారు కూడా.నిజానికి అవే డబ్బులతో చవకగా పేదలకు వైద్యం చేసే సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల నిర్మాణం చేయవచ్చు. చేయరు. చేద్దామనుకున్నా… అక్కడా వ్యాపారమే జరుగుతుంది. మళ్లీ ఆ కష్టాలన్నీ ఎవరు పడతారని ఛానళ్ల మీద పడ్డారు. అమ్మేసుకుని వదిలించుకుని బయట పడ్డారు హాయిగా… ఇయన్నీ చూశాక… నాకనిపిస్తోందేంటంటే…అభ్యుదయం పేరుతో కమ్యునిస్టులు చేసింది కూడా పెట్టుబడిదారీ శక్తులు త్వరగా లాభం పొందే పనులే తప్ప వేరు కాదని.
సామ్రాజ్యవాదం రావడానికి వీలుగా నేలను చదును చేసి ఉంచారని కూడా నేను గతంలో ఇద్దరు ముగ్గురు మిత్రుల దగ్గర అభిప్రాయపడేశాను. ఈ శతాబ్దాంతానికి తొంభై శాతం ప్రాంతీయ నాగరికతలు, భాషలూ నాశనం అయిపోతామని యునెస్కో పదిహేనేళ్ల క్రితమే ప్రకటించింది.ఈ కార్యక్రమాన్ని సామ్రాజ్యవాదం ప్రపంచీకరణ అనుకూల శక్తులూ నిర్వహిస్తున్నాయనుకుంటే పొరపాటే. వాటికన్నా ముందే అభ్యుదయం పేరుతో మనోళ్లే నిర్వహించేశారు.
చేపమందు మీద యుద్దం ప్రకటించిన వారు … ఆస్త్మా పేషంట్లకు శాస్త్రీయ వైద్యం అందుబాటు ధరలో అందేందుకు కూడా ప్రయత్నం చేయవచ్చును కదా… పర్మెనెంట్ పద్దతిలో కాకపోయినా… క్యాంపుల ద్వారా అయినా చేయవచ్చును కదా… నిజానికి ఆ శిబిరాల్లో ఉన్న యాక్టివిస్టులకీ ఈ ఆలోచన కలగకుండా ఉంటుందనైతే నేను అనుకోవడం లేదు.కానీ ఆచరణకు కదలడానికి అనేక ప్రతిబంధకాలు ఉంటాయి. అవన్నీ పెట్టుబడిదారీ శక్తులే కనిపించకుండా అక్కడా వర్కౌట్ చేస్తాయి.
దయ్యమున్న ఇంట్లో మనం చేసే ఏ పనైనా దయ్యానికి తెలియకుండా జరగదు అన్నట్టుంది పరిస్థితి. ఓ పేదోడికి ఓ భారీ రోగం వస్తుంది. దానికి వైద్యం చేయించుకోవాలంటే వాడి వల్ల కాదు. ప్రభుత్వాసుత్రులకు వెళ్లాలి.అక్కడ సౌకర్యాలు ఉండవు కాబట్టి అనివార్యంగా కార్పోరేట్ ఆసుపత్రికి వెళ్లాలి. పైగా ప్రభుత్వ,ప్రభుత్వేతర ఆసుపత్రుల్లో ఆధార్, కార్టు, ఆరోగ్యశ్రీ కార్టు, రేషను కార్డు, ప్యాను కార్టు ఇలా నానా జాతి కార్డులూ సమర్పించుకుంటే… అప్పుడు వైద్యం గురించి ఆలోచించే పరిస్థితి.
ఒక వైద్యుడు తయారు కావాలంటే… బోల్డు ప్రజాధనం ఖర్చు అవుతోంది…లాంటి ఆర్గ్యుమెంట్లు చేస్తే తన్నేలా ఉన్నారు హౌస్ సర్జన్లు. మెడిసిన్ చదవాలంటే మాకెంత ఖర్చు అవుతోందో చూడండంటున్నారు. ప్రత్యామ్నాయం చూపించకుండా వద్దు అనడం తప్పు. తగ్గచ్చు… తగ్గకపోవచ్చు… అప్పులపాలైతే కారు కదా…అశాస్త్రీయం అంటూ కార్పోరేట్ శక్తులకు ఉపయోగపడకండి… ఇలా ఆలోచించే సంస్దలే ప్రజలకు తక్కువ ఖర్చులో శాస్త్రీయ వైద్యం అందే ఏర్పాట్లు చేయగలిగితే మంచిదే. లేదూ, ఉన్న స్ట్రెక్చర్ లో బెటర్ మెంటేమిటో వాళ్లకే సూచించండి…
Share this Article