ఏటా దేశరాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్లో వివిధ రాష్ట్రాల శకటాలను ప్రదర్శించడం ఒక ఆనవాయితీ. ఆసేతు హిమాచలం వివిధ సంస్కృతులకు ఈ శకటాలు ప్రతిరూపం. ఈ ఏడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున గణతంత్ర పెరేడ్లో లేపాక్షి శకటం ప్రాతినిధ్యం వహిస్తోంది.
“లేపాక్షి బసవయ్య లేచి రావయ్యా!” అని అడవిబాపిరాజు ఆత్మీయంగా అడిగితే కాదనకుండా లేవబోయిన; కైలాస శిఖరిలా కదలబోయిన; కదిలితే పొంగేటి పాల్కడలి గంగడోలు అటు ఇటు ఊగిన, అర్రెత్తి చూస్తే ఆకాశగంగ కిందికి దిగబోయిన; నంది పర్వతజాత నవ పినాకినీ జల స్నానంతో పునీతమై పెనుగొండ సీమలో ఒంగోలు గిత్తకు వారసత్వంగా నిలిచిన నంది గణతంత్ర శకటంలో ముందు ఒదిగింది. అంతటి రావణాసురుడికే శివుడి అపాయింట్ మెంట్ లేదని శపించి, తిప్పి పంపిన నంది. మహా ఐరావతాలను తన్నుకుపోగల గండభేరుండ పక్షిని మెడలో హారానికి కొలికిపూసగా చేసుకున్న నంది. గంటల గొలుసులను, ముత్యాల హారాలను మెడలో అలంకరించుకున్న నంది. కాలి గిట్టలకు కడియాలు కట్టుకున్న నంది. మూపున పట్టు పీతాంబరాలు కప్పుకున్న నంది. అయిదు వందల ఏళ్లుగా లేపాక్షిని కాపలా కాస్తున్న నంది. మరో అయిదు వేల సంవత్సరాలైనా లేపాక్షి వైభవోజ్వల కీర్తి ప్రభల బరువును మోయాల్సిన నంది. విజయనగర జయకేతనం రాతిలో ఒదిగి ప్రాణం పోసుకున్న నంది. ప్రపంచంలో అన్ని నందులకు గర్వకారణమయిన నంది. నందులన్నీ నందనానందంతో పొంగిపోయే లేపాక్షి నంది శకటంలో ముందుంది. మధ్యలో లేపాక్షి ఆలయ మధ్యలో ఉన్న శివపార్వతుల కళ్యాణ మంటపం రాతి పందిరి ప్రతిరూపం. చివర పడగవిప్పి శివలింగానికి గొడుగు పట్టే లేపాక్షి నాగలింగం.
Ads
ఆకాశానికి రాతి కొక్కేలు తగిలించి విజయనగర రాజ్య వైభవం ఉయ్యాలలో ఒయ్యారంగా ఊగిందట. ఉలితో రాళ్లకు ప్రాణాలు పోసి, శిల్పాలను నడిపించారట. రాతి స్తంభాలకే చేతనత్వం కలిగించి స రి గ మ ప ద ని స్వరాలు పలికించారట. మొన్న మొన్నటి కట్టడంలో తేడాతో వాలిన పీసా లీనింగ్ టవర్, లోహవిద్య తెలిసిన తరువాత కట్టిన నిన్న నిన్నటి ఈఫిల్ టవర్ ఇనుప మెట్ల మీద టూరిజం చరిత్ర సువర్ణాక్షర లిఖితమవుతూనే ఉంటుంది. అయిదు శతాబ్దాలుగా వేలాడే స్తంభంలో ఒదిగిన లేపాక్షి చరిత్ర రాళ్లలో రాయిగా పడి ఉంటుంది. కాలాలు మారుతుంటాయి. కానీ- అర్ధ సహస్రాబ్దం కాలానికి వంతెన లేపాక్షి. దక్షిణాపథంలో ఒక వెలుగు వెలిగిన విజయనగర రాజ్య సంస్కృతికి శిలా తోరణం లేపాక్షి. కనులున్నందుకు చూసి తరించాల్సిన మనదయిన వారసత్వ శిల్ప సంపద లేపాక్షి…………….. (ఢిల్లీ గణతంత్ర ఉత్సవాల్లో లేపాక్షి శకటాన్ని ప్రదర్శిస్తున్న సందర్భంగా ఆనందిస్తున్నవారిలో ఒకడిగా)……… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article