హమ్మయ్య బతికించాయి ఆ పత్రికలు… నిన్నటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ధోరణి చూస్తే ఈరోజు పత్రికల ఫస్ట్ పేజీలు, కవరేజీ ఏ రేంజులో ఉంటాయోనని అందరూ అనుమానపడ్డారు… అరెరె, మీరనుకున్నట్టు కేవలం ఆ రెండు పత్రికలు మాత్రమే కాదు… ది గ్రేట్ అధికార సాక్షి సైతం..! ఆ రెండు పచ్చపత్రికలు అంటూ అప్పట్లో వైఎస్ అన్నాడు… ఈనాడు ఆర్థిక మూలాల్ని పెకిలించే పనిలో మార్గదర్శి ఫైనాన్స్‌ను గెలికాడు… రామోజీ ఫిలిమ్ సిటీ దున్నేయాలనుకున్నాడు… ఫాఫం, వర్కవుట్ కాలేదు…
ఇప్పుడు జగన్ ఇంకాస్త ఘాటుగా ‘మన ప్రత్యర్థి టీడీపీ కాదు, చంద్రబాబు కాదు, కేవలం ఆ రెండు పత్రికలు, ఆ చానెల్ మాత్రమే’ అని తేల్చేశాడు… అనగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5… పరమ నాసిరకంగా మారిన టీవీ5 తనకు అంత బలమైన ప్రత్యర్థిగా ఎందుకు కనిపించిందో తెలియదు గానీ… ఆ రెండు పత్రికలు మాత్రం సై జగన్ అని సవాల్ చేస్తూనే ఉన్నాయి… మరీ ఆంధ్రజ్యోతి పక్కా తెలుగుదేశం కార్యకర్తలాగే వ్యవహరిస్తుండగా, ఈనాడు మాత్రం తలుపు చాటు నుంచి కన్నుకొట్టేది…
పాత్రికేయ పతివ్రత అనిపించుకునే ప్రయత్నం చేస్తూనే బాబుకు భరోసాగా ఉండేది… అవసరం ఉన్నప్పుడు బట్టలిప్పడానికి ఈనాడు ఎప్పుడూ రెడీయే… ఇక జగన్ వైఎస్ బాటలో మార్గదర్శి చిట్స్‌ను గోకాడు… అంతటి రామోజీని విచారణకు పిలిచాడు… ఇంటరాగేట్ చేశాడు… మండదా మరి… కడుపులో కసి రగిలిపోతూ ఉంటుంది కదా సహజంగానే… అదంతా ఈరోజు బయటపడింది… జగన్ పైశాచికానందం పేరిట ఏకంగా ఫస్ట్ పేజీ ఎడిటోరియల్ వచ్చేసింది…
Ads
(అప్పట్లో జగన్ అరెస్టయితే ముద్దాయి నంబర్ వన్ అరెస్టు అని ఆనందంగా రాసుకొచ్చిన ఈనాడు ఇప్పుడు చంద్రబాబు అరెస్టయితే మాత్రం అరాచక అరెస్టు అట…) ఏమాటకామాట… నిన్నటి కొన్ని టీవీల విషాదం గమనిస్తే… ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ మాస్టర్ హెడ్స్ కిందకు దింపి, వీలయితే ఫస్ట్ పేజీని బ్లాక్ కలర్‌తో నింపేసి, నిరసనను ప్రకటిస్తాయని కొందరు అనుమానపడ్డారు… కానీ అదేమీ జరగలేదు… హమ్మయ్య, సంతోషం…
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ‘కసి కళ్లు చల్లబడ్డయ్’ అని రాసుకొచ్చాడు గానీ… ఎందుకో ఈనాడు ఎడిటోరియల్ హెడింగ్ చూస్తే అదీ అలాగే అనిపించింది… ఈనాడును జగన్ గోకుతున్న తీరు అవలోకిస్తే ఈనాడు కోపానికి అర్థముందనే అనిపిస్తుంది… అది ముసుగులున్నీ తీసేసి, యెల్లో ఫేసుతో తనూ బజారులోకి వచ్చేసినట్టే అనిపిస్తుంది… ఒక్క ఎడిటోరియల్ మాత్రమే కాదు… నాలుగైదు ప్రత్యేక పేజీల నిండా ఇవే వార్తలు… ప్రపంచంలో చంద్రబాబు అరెస్టును మించి అత్యంత పెద్ద వార్త మరేమీ లేనట్టు, ప్రళయం వచ్చేసినట్టు…
సరే, ఆంధ్రజ్యోతి పోతురాజులాగా కొరడా పట్టుకుని తన దేహం మీద ఛెళ్లుమని కొట్టేసుకున్నట్టుగా, ఎప్పటిలాగే వ్యవహరించింది… చంద్రబాబు అరెస్టు వార్త తరువాత ఆంధ్రజ్యోతి ఎలా రాస్తుందో అందరూ ఊహించగలరు, అలాగే రాసుకొచ్చింది… ఎటొచ్చీ ఈనాడు తన నిర్లజ్జతనాన్ని ఎంచక్కా బయటపెట్టేసుకుంది… ఆగండాగండి… కనీసం ఈ రెండు పత్రికలు తమ భజనను సమర్థంగా కొట్టగలవు… సాక్షికి ఈ సోయి, ఈ శరం కూడా లేవు…
ఈ కేసు గురించి తన వెర్షన్ ఏదేదో రాసుకొచ్చింది… సరే, ఆ పత్రిక జగన్‌దే కాబట్టి… ఆ రెండు పచ్చపత్రికలకు దీటుగా కౌంటర్లు రాస్తుంది కాబట్టి ఈ కవరేజీని వోకే అనుకుందాం… కానీ ఈ కేసుకే పరిమితం కాలేదు, దొరికింది చాన్స్ అనుకుని, ఇక అవినీతి అనకొండ లోగో పెట్టేసి, పాత కథనాలన్నీ తవ్వి తీసి కుమ్మేసింది… ఎడిటర్ సైతం ఎన్నెన్ని పాపాల్, ఎన్నెన్ని శాపాల్ శీర్షికతో… నెత్తురు అంటిన పచ్చటి చేయికి సంకెళ్లు తగిలించిన బొమ్మ కూడా గీయించేశాడు…
6 లక్షల కోట్లు మింగినట్టు ఏలేరు స్కాం నుంచీ పాత కథలన్నీ తవ్వితీసి, పబ్లిష్ చేసింది… దోపిడీకి రాచబాట అంటూ తన మంత్రివర్గ సహచరులతో కలిసి చేసిన అక్రమాలనీ ఏకరువు పెట్టింది… ఈనాడు నాలుగైదు పేజీల్ని చంద్రబాబు అరెస్టు వార్తలతో, భగ్గుమన్న ప్రజాగ్రహం పేరుతో నింపేస్తే… సాక్షి అదే స్థాయిలో ఉల్టా చంద్రబాబు అవినీతి కథల్ని పబ్లిష్ చేసింది… చంద్రబాబును ఉరితీయడమే కరెక్టు అనే రేంజ్‌లో ఓవరాక్షన్ కనిపించింది… సో, ఈనాడు, సాక్షి దొొందూ దొందే…
ఎటొచ్చీ ‘తెలంగాణ పత్రికలు’ మాత్రం జీ20 సదస్సు వార్తల్ని హైలైట్ చేశాయి… చంద్రబాబు అరెస్టు వార్తపై తటస్థంగా, వార్తను జస్ట్, ఒక వార్తలాగా వేశాయి… నమస్తే తెలంగాణ మాత్రం ఎప్పటిలాగే తన ధోరణిలో తన సొంత వార్తల్ని ఏవేవో హైలైట్ చేసుకుంది… ఫాఫం, దాని బాధ దానిది… ష్, చివరగా… పాపం శమించుగాక… జగన్ మరింత కసిగా రామోజీరావును అరెస్టు చేస్తే ఇప్పుడు ఈనాడు కవరేజ్ రేంజ్ ఎలా ఉంటుందో ఎవరికివారు ఊహించుకోవాల్సిందే…
Share this Article