Education-Saffronisation :
“చేసిన పాపము; చెడని పదార్థము; వచ్చును నీ వెంట…”
“చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా!”
Ads
“కర్మను ఎవరూ తప్పించుకోలేరు”
“మన ఖర్మ ఇలా కాలింది…”
“ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు?”
“ఏ జన్మలో చేసిన పాపమో! ఇప్పుడిలా అనుభవిస్తున్నారు!”
“ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో! పెట్టి పుట్టాడు. ఇప్పుడిలా మహా యోగం పట్టింది”
“కాలమనే నదిలో కదిలే.. కర్మమనే నావ మీద
ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా.. చివరి తోడు నువ్వేలే
సాగుతున్న బాటసారి.. ఆగి చూడు ఒక్కసారి…”
“మచ్చిక కర్మ మనేటి మైల సంతలోన వెచ్చపు కర్మధనము విలువ చేసి పచ్చడాలుగా గుట్టి బలు వేంకటపతి ఇచ్చ కొలదుల నమ్మే ఇంటి బేహారి”
“కర్మణ్యేవాధి కారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫల హేతుర్భూ ర్మాతే సంజ్ఞోస్త్వ కర్మణి ||”
మామూలు వాడుక మాట మొదలు సాక్షాత్తు భగవంతుడి వాక్కు అయిన గీత వరకు అడుగడుగునా కర్మ వెంటాడుతూనే ఉంటుంది. కర్మను తప్పించుకోలేము. తప్పించుకోవాలనుకునేవారి ఖర్మ కాలుతూ ఉంటుంది. “ఖర్మ కాలడం” అన్న మాటను లోకం నెగటివ్ గా తీసుకుంది కానీ…నిజానికి అది పాజిటివ్. ఖర్మ కాలితే కర్మలు బూడిదయి అక్కడితో వాటి నుండి విముక్తి లభిస్తుంది. మన ఖర్మ కొద్దీ కర్మల తాళ్లతో మరింత బిగించుకోవడానికే ఇష్టపడతాం కాబట్టి…కర్మ బీజాలు మాడి మసై విముక్తి కలగడం మనకు నచ్చదు.
మన కర్మ ఫలమే మనకు దక్కుతూ ఉంటుంది. మధ్యలో దేవుడే దిగి వచ్చినా సాక్షిగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేడు. కర్మలు విత్తనాలు. ఏ కర్మ బీజాలు విత్తితే ఆ మొక్కలే ఎదిగి…ఆ ఫలాలనే ఇస్తాయి. అందుకే మళ్లీ మొలకెత్తకుండా విత్తనాలను కాల్చి బూడిద చేసుకోవాలని చెబుతుంది వేదాంత శాస్త్రం. వైరాగ్యం అంటే చెడు అర్థం పాతుకుపోవడం వల్ల వేదాంత వైరాగ్యం వైపు మనం కన్నెత్తి చూడము కానీ…భక్తి జ్ఞానానికి పరాకాష్ఠ వైరాగ్యమే. అందుకే అన్నంతో పాటు జ్ఞాన వైరాగ్యాన్ని భిక్షగా ప్రసాదించాల్సిందిగా అది శంకరాచార్య అన్నపూర్ణ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డాడు.
“దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య- నోపకకదా నన్ను నొడఁబరుపుచు పైపైనె సంసార బంధములఁ గట్టేవు నాపలుకు చెల్లునా? నారాయణా!”
అని యావత్ తెలుగు సాహిత్య చరిత్రలోనే ఇంకెవ్వరూ అనని మాటను ప్రయోగించాడు అన్నమయ్య. వెలుగులతో దీపించే దివ్య సుఖమట-ఆ వైరాగ్యం. పైగా ఆ వైరాగ్య సుఖం దేవుడే ఇవ్వాలట. భక్తి కర్మయోగంతో మొదలై…జ్ఞాన యోగంగా మారినప్పుడు ఈ వైరాగ్యయోగం అర్థమవుతుందంటారు. అనుభవంలోకి వస్తుందంటారు.
పాశం అంటే తాడుతో జతువును కడతాం కాబట్టి పశువు అని పేరు స్థిరపడింది. మనిషికి కనపడని కర్మ పాశాలెన్ని ఉన్నాయో లెక్కే లేదట. ఆ కర్మలు-
1. ఆగామి కర్మలు
2. సంచిత కర్మలు
3. ప్రారబ్ధ కర్మలు
అని మూడు రకాలు.
ఇంకా లోతుగా కర్మజ్ఞానం, కర్మ సిద్ధాంతం, కర్మ ఫలం లాంటి వివరాలు కావాలనుకున్నవారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- ఐ ఐ ఎం వారు కొత్తగా ప్రవేశపెట్టిన కర్మ సిద్ధాంత ఎం బి ఏ లో చేరవచ్చు.
ఈ కోర్సులో కర్మ కార్య కారణ సంబంధాలతో పాటు పతంజలి యోగసూత్రాలు, ఉపనిషత్, గీతా సూత్రాలు, యోగ వాసిష్ఠం లాంటి సనాతన మేనేజ్మెంట్ స్కిల్స్ ను శాస్త్రీయంగా ఇంగ్లీషు మీడియంలో చెప్తారట. భారతీయ పారిశ్రామిక, మేనేజ్మెంట్ దిగ్గజాలు కావాలనుకునేవారికి ఈ కర్మ బీజాక్షర మేనేజ్మెంట్ విద్య అనన్యసామాన్యంగా ఉపయోగపడుతుందట.
-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article