బాబు రిమాండుకు ఆదేశించిన ఓబీసీ మహిళా జడ్జీపై ఇంత బురదజల్లడం చూశాక.. ఆంధ్రోళ్లపై తెలంగాణ సోదరుల పాత బూతులు, శాపనార్ధాలు నిజమేననిపిస్తోంది!
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 14 రోజుల రిమాండు విధించిన ఏసీబీ (అనిశా) కోర్టు జడ్జ్ బొక్కా సత్య వెంకట నాగ హిమబిందును కించపరిచే రీతిలో చేసిన వ్యాఖ్యలతో కూడిన వాట్సాప్ పోస్టులు గంట క్రితమే చూశాను.
ఆమె నిజాయితీపై బురదజల్లుతూ, శీలహననానికి (కేరక్టర్ అసాసినేషన్) పాల్పడే రీతిలో హిమబిందు గారిపై ఈ వ్యతిరేక వ్యాఖ్యలున్నాయి. మనం. అదే.. ఆంధ్రోళ్లం ఇలాంటి సందర్భాల్లో ఇలా వ్యవహరిస్తే– తెలంగాణ ఉద్యమం సందర్భంగా మన తెలంగాణ సోదరులు మనల్ని తిట్టిన బండ బూతులకు పూర్తిగా ‘మనం’ అర్హులమనిపిస్తోంది.
Ads
అసలు సామాజిక ప్రవర్తనకు సంబంధించి ‘మనం రోడ్డు మీద నిలబడితే’ బిహార్, ఉత్తర్ ప్రదేశ్ మనుషుల మోకాళ్ల వరకూ కూడా మనం రాబోమని అర్ధమవుతోంది. తెలుగువారంతా గర్వపడే త్రిపురనేని రామస్వామి చౌదరి, కట్టమంచి రామలింగారెడ్డి వంటి గొప్ప వ్యక్తుల పేర్లు తలిచే అర్హత ఆంధ్రోళ్లకు లేదనిపిస్తోంది.
పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలోని ఓబీసీ శెట్టి బలిజ కుటుంబంలో పుట్టిన హిమబిందు గారిపై సోషల్ మీడియాలో ఇలాంటి ‘దుష్ప్రచారం’ జరుగుతుందని ఊహించనే లేదు. ఈ ఏసీబీ మహిళా జడ్జీ – రెడ్డి, కమ్మ లేదా కాపు కులాలతో పోల్చితే కాస్త వెనుకబడిన సామాజికవర్గంలో (కల్లుగీత వృత్తితో సంబంధం ఉన్న కోస్తాంధ్ర కులం) పుట్టి పెరిగినా తాజా కేసులో చంద్రబాబు నాయుడు గారికి బెయిలు ఇవ్వకపోవడం వల్ల ఇంతగా విష ప్రచారానికి లోనుకావడం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
1982లో పుట్టినప్పటి నుంచీ వెనుకబడిన కులాల పక్షపాతిగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు గారి అభిమానులు ఒక ఓబీసీ మహిళా జడ్జీపై ఇంతటి ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి ధోరణలు ఇంతటితో ఆగిపోవాలని కృష్ణా జిల్లా పునాదిపాడు, గుడివాడలో మూలాలున్న వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను… Nancharaiah Merugumala
Share this Article