మొన్నామధ్య రిలీజైన పుష్ప సినిమాలో ఓ డైలాగ్… ఇదీ నా కాలే, ఇదీ నా కాలే, నా కాలు మీద నా కాలేసుకుంటే… సేమ్… ఓ వ్యక్తి తన మొబైల్‌లో శృంగార, సంభోగ వీడియోలను చూస్తున్నాడు… పోలీసులు పట్టుకుని కేసులు పెట్టారు… అప్పుడు తనేమనాలి… పుష్ప స్టయిల్‌లో అయితే… ‘ఇది నా మొబైలే… ఇది నా బ్రాడ్ బ్యాండే, నా ఖర్చుతో నేను చూస్తుంటే మీకేంటి..?
దాదాపు ఇలాంటిదే ఈ కేసు… అసలు మన భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 292 ప్రకారం అశ్లీల చిత్రాలను వ్యక్తిగతంగా చూడటం, ఇతరులకు పంచుకోకుండా లేదా ప్రదర్శించకుండా ఉండటం నేరంగా పరిగణించబడదని కేరళ హైకోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది… కేసు ఏమిటంటే… ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిలబడి తన ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నాడు… పోలీసులు వచ్చి ‘‘రెడ్ హ్యాండెడ్’’గా పట్టేసుకున్నారు…
సెక్షన్ 292 కింద కేసు పెట్టారు… ఈ అభియోగాల్ని న్యాయమూర్తి పివి కున్నికృష్ణన్ కొట్టిపారేశారు… ఆ వ్యక్తి చర్యల్ని నేరంగా ప్రకటించలేమని తేల్చేశారు… అంతేకాదు, ఇలాంటి కేసులు పౌరుల వ్యక్తిగత ఎంపికల్లో జోక్యం చేసుకోవడమే గాకుండా పౌరుల గోప్యతకు కూడా భంగకరమని అభిప్రాయపడ్డారు… అదేమిటి..? ప్రభుత్వమే బోలెడు అశ్లీల సైట్లను నిషేధిస్తోంది… వాటి వీక్షణాన్ని నిరుత్సాహపరుస్తోంది… మరి అసలు నేరమే కాదంటారేమిటి అనేదేనా మీ ప్రశ్న…
Ads
దీనికీ జస్టిస్ సమాధానమిచ్చారు తన తీర్పులో… ‘‘ఒక వ్యక్తి తన పర్సనల్, ప్రైవేట్ టైమ్‌లో… ఇతరులకు ఆ వీడియోలను ప్రదర్శించకుండా, తనొక్కడే చూస్తున్నాడు… అందులో నేరం ఏముంది..? అసలు ఈ చర్యకు సెక్షన్ 292 ఎలా వర్తిస్తుంది..? ఆ సెక్షన్ దేనికి వర్తిస్తుందీ అంటే… అసభ్యకరమైన పుస్తకాల ప్రచురణ, అలాంటి వస్తువుల విక్రయం, పంపిణీ మరియు ప్రదర్శనలు శిక్షార్హం అంటోంది… ఇప్పుడు ఈ కేసులో ఈ వ్యక్తి తన మొబైల్‌లో తను మాత్రమే ఆ వీడియోలు చూస్తున్నాడు…
ఎవరికీ ప్రదర్శించడం లేదు… ఎవరికీ షేర్ చేయడం లేదు… ఇందులో లాభాపేక్ష లేదు… ప్రసారం, పంపిణీ, బహిరంగప్రదర్శనలు ఏమీ లేనప్పుడు ఆ సెక్షన్ తనకు ఎలా వర్తిస్తుంది..?’’ ఇదీ హైకోర్టు పోలీసులకు వేసిన ప్రశ్న…
sells, lets to hire, distributes, publicly exhibits or in any manner puts into circulation, or for purposes of sale, hire, distribution, public exhibition or circulation, makes, reduces or has in his possession any obscene book, pamphlet, paper, drawing, painting, representation or figure or any other obscene object …
… ఇదీ బ్రీఫ్‌గా 292 సెక్షన్… హైకోర్టు ఈ కేసు తీర్పులో, వ్యక్తి తను ప్రైవేటుగా ఆ వీడియోలు చూడటాన్ని నేరం కాదని చెప్పడమే గాకుండా శతాబ్దాలుగా మానవ సంస్కృతిలో భాగమని పేర్కొంటూ, అశ్లీల చిత్రాల చారిత్రక ఉనికిని కూడా హైకోర్టు ఎత్తి చూపింది… పనిలోపనిగా పిల్లల తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక, జాగ్రత్తను కూడా సూచించింది…
‘‘సరైన పర్యవేక్షణ లేకుండా ఇంటర్ నెట్ ఉన్న మొబైల్స్‌ను పిల్లలకు ఇస్తే ప్రమాదం… ఇలాంటి కంటెంట్‌ను పిల్లలు సులభంగా చూసే వీలుంటుంది… ఈజీ యాక్సెస్… అందుకని పిల్లలకు మొబైల్స్‌ను ఇచ్చేముందు తల్లిదండ్రులు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సదరు తీర్పు పేర్కొంది..! మొత్తానికి ఇంట్రస్టింగ్ తీర్పు… (బార్ అండ్ బెంచ్ వార్త ఆధారంగా…)
Share this Article