‘‘ప్రతి గుళ్లో దేవుళ్లు అభయహస్తం చూపిస్తుంటారు… భక్తుల్ని దీవిస్తున్నట్టు… అంటే ప్రతి దేవుడూ కాంగ్రెస్ ఎన్నికల గుర్తును ప్రచారం చేస్తున్నట్టేనా..? జాతీయ పతాకం రంగుల్ని తమ పార్టీ పతాకంలో ఉపయోగిస్తారు, అది సమంజసమేనా..? అంతెందుకు..? విపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నాయి… సమర్థనీయమేనా..?’’
… ఇలా ఎప్పుడైనా ప్రశ్నలు మొలకెత్తాయా మీ మెదళ్లలో… లేదా..? అయితే మీకు రాజకీయ స్పృహ లేనట్టు లెక్క… ఆ స్పృహ ఉన్నవాళ్లకు ప్రతిదీ రాజకీయ వివాదంగా తోస్తుంది… విపక్షాలకు అధికార పక్షాన్ని విమర్శించడానికి ఎప్పుడూ ఏదో ఒకటి అందుబాటులో ఉండాలి… లేదా అందుబాటులో ఉన్న ప్రతిదీ వివాదంగా మలచాలి… ఇప్పుడిదంతా ఎందుకు అంటారా..?
కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకి వచ్చింది కదా… దాని నెత్తి మీద కొలువు తీరిన నాలుగు సింహాలు అణకువగా లేక క్రోధంగా చూస్తున్నట్టు ఉన్నాయనే అంశం కూడా ఆమధ్య వివాదం రేకెత్తించింది తెలుసు కదా… ఇప్పుడు పార్లమెంటు సిబ్బందికి అమలు చేస్తున్న కొత్త యూనిఫామ్ కూడా వివాదంలోకి వచ్చేసింది… మార్షల్స్‌కు ఒకరకం, వుమెన్ స్టాఫ్‌కు, మెన్ స్టాఫ్‌కు మరోరకం దుస్తులు యూనిఫామ్‌గా ఫిక్స్ చేశారు…
Ads
అయితే… ఓ డ్రెస్సుపై కమలాలు ఉన్నాయి… ఇంకేముంది..? ఇది ఖచ్చితంగా బీజేపీ తమ పార్టీ గుర్తును ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నమేననీ, చివరకు పార్లమెంటు స్టాఫ్ యూనిఫామ్‌ను కూడా పార్టీకరిస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి…
కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఓ ట్వీట్ చేస్తూ ‘‘పార్లమెంటు సిబ్బంది యూనిఫామ్ మీద టైగర్స్ బొమ్మలు ముద్రించొచ్చు కదా… అది మన జాతీయ జంతువు… పోనీ, నెమళ్లు ఉండొచ్చు కదా… అది మన జాతీయ పక్షి… కానీ కమలం మాత్రమే ఎందుకు ఎంచుకున్నట్టు..? ఎందుకంటే, అది బీజేపీ గుర్తు కాబట్టి, ప్రచారం పొందాలనే చీప్ ఎత్తుగడ కాబట్టి…’’ అని విమర్శించాడు…
‘‘బీజేపీ వాళ్లకు ఈ చీప్ ట్యాక్టిస్ బాగా అలవాటయ్యాయి… జీ20 సదస్సునూ అలాగే వాడుకున్నారు… ఇప్పుడేమో జాతీయ పుష్పం పేరిట కమలాన్ని, అంటే తమ ఎన్నికల గుర్తును ఏకంగా పార్లమెంటు స్టాఫ్ యూనిఫామ్ మీదకు ఎక్కించారు… ఇవి కరెక్టు ధోరణులు కాదు’’ అంటాడాయన… పార్లమెంటు సిబ్బంది అంటే బీజేపీ సిబ్బంది కాదు కదా అంటున్నాడు… ‘‘ఈ కమలం డిజైన్ ఎంపిక ద్వారా బీజేపీ మన ప్రజాస్వామిక ఆలయమైన పార్లమెంటును రాజకీయ క్షేత్రంలా మారుస్తోంది’’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్రాస్టో విమర్శించాడు… ‘‘ఇది ఒకరకంగా తమ ప్రచారం కోసం పార్లమెంటును దుర్వినియోగం చేయడమే’’ అనేది తన విమర్శ…
ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించబోతున్నారు కదా… ఈ సందర్భంగా ఈ కొత్త యూనిఫామ్ తీసుకొచ్చారు… యూనిఫామ్‌కు ఇండియన్ టచ్ ఇచ్చారు… ఇండియా -భారత్ పేరు మార్పిడి రచ్చ సద్దుమణిగినట్టు కనిపిస్తోంది కదా… ఇక ఈ యూనిఫామ్ చర్చ తెరపైకి వచ్చింది… మరో కొత్త వివాదం వచ్చేవరకు ఇదే టాపిక్..!! ఇదంతా సరేగానీ, పార్లమెంటు సమావేశాలకు వచ్చే ప్రజాప్రతినిధులకు కూడా ఓ మాంచి యూనిఫామ్ నిబంధన తీసుకువచ్చే ఆలోచన ఏమైనా ఉందా మోడీ భాయ్..?!
Share this Article