పీవీ రమేష్ ఇంటర్వ్యూకు ఓ అర్థముంది… చంద్రబాబుపై సీఐడీ స్కిల్ స్కాం ఆరోపణలకు పూర్తి కౌంటర్ కాదు, కానీ అదొక కోణంలో వివరణ… చేతనైతే ఆయన మేఘా నుంచి రాజీనామాతో ఎందుకు బయటపడాల్సి వచ్చిందో రాయాలి… డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖన్వేల్కర్ వివరణ పబ్లిష్ చేయడంలో అర్థముంది… ఈ స్కాంలో వాళ్లదే ప్రధానపాత్ర అని సీఐడీ ఆరోపిస్తున్నది కాబట్టి…
ఒక లోకేష్, ఒక భువనేశ్వరి, ఒక బాలయ్య వ్యాఖ్యల్ని, విమర్శల్ని పబ్లిష్ చేయొచ్చు… చంద్రబాబు కుటుంబసభ్యులు కాబట్టి… నిజంగా రాయాలనుకుంటే చంద్రబాబు సీట్లో బాలయ్య కూర్చుని, ఇక నేను వస్తాను అని కేడర్‌కు పిలుపునివ్వడాన్ని రాయాలి… తను కట్టిన భవనంలోనే తనను కట్టిపడేశారు అనే భువనేశ్వరి వ్యాఖ్యల్ని రాయాలి… అక్కడికి రాజమండ్రి జైల్ బిల్డింగ్ చంద్రబాబు కట్టినట్టు..? అదొక పురాతన జైలు… పైగా తను జైలు కడితే ఇక ఆ జైలులోకి పంపించవద్దా..? ఇదేం వాదన..?
ఓ సీరియస్ కేసు… ఒకప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయాల్ని నడిపించినవాడు ఈరోజు జైలులో ఒంటరిగా, 40 మంది ఉండాల్సిన రెండంతస్థుల స్నేహ బ్లాకులో బిక్కుబిక్కుమంటూ బందీ అయిపోయిన దురవస్థలో ఎవరికి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేస్తే అది చంద్రబాబుకే నష్టం… వాళ్లెవరో అంటున్నారు, అభివృద్ధి చేసిన నాయకుడిని జైలులో వేస్తారా..? అభివృద్ధి చేశాడా..? ఏదీ పోలవరం..? ఏదీ అమరావతి..? పోనీ, అభివృద్ధే నిజమైతే అదేమైనా కేసుల నుంచి ఇమ్యూనిటీ ఇస్తుందా..?
Ads
రాజకీయాలే క్రూరమైనవి… అందులో ప్రత్యర్థులను కట్టడి చేసే సామదానభేదదండోపాయాలన్నీ ఉంటయ్… అక్రమ అరెస్టు అని మరో గోల… అరెస్టు, కేసు అక్రమమే అయితే ఏసీబీ కోర్టు తన రిమాండ్ రిపోర్టును తిరస్కరించి ఉండాలి కదా… కేసులో మెరిట్ ఉందనే కదా తనకు జైలుకు పంపించింది… చివరకు హౌజ్ అరెస్టు పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది… సిద్ధార్థ లూథ్రా కాదు, ఇంటర్నేషనల్ కోర్టు లాయర్లు వచ్చినా ఫాయిదా ఏముంటుంది..?
జగన్ అక్రమాస్తుల కేసుల వెనుక కూడా రాజకీయాలు, తనను కట్టడి చేసే ఎత్తుగడలు గాక మరేమున్నయ్..? ఇదీ అంతే అనుకుందాం… తను విచారణలకు అతీతుడని, నిప్పు అనే చంద్రబాబు సెల్ఫ్ ప్రచారాల్ని జగన్ బద్దలు కొట్టి… రేప్పొద్దున తనను అవినీతిపరుడు అన్నవారిని మరి చంద్రబాబు ఏమిటి అనే అడిగే సిట్యుయేషన్ క్రియేట్ చేశాడు… ఈ స్థితిలో చంద్రబాబు మీడియా జాగ్రత్తగా కథనాలను వెలువరించాల్సింది… కానీ..?
ఏది పడితే అది రాసేస్తున్నారు… ఒకరకంగా చంద్రబాబుకే నష్టదాయకం అవి… (నిన్నటి వార్తలు అవే రీతిలో ఉన్నాయి… ఈరోజు కూడా…) ఉదాహరణకు ఇది చూడండి…
నిన్ననేమో చంద్రబాబుకు బ్రేక్ ఫాస్ట్ ఏమిటి..? లంచ్ ఏమిటనే వార్తలు… ఈరోజు ఆ సెంట్రల్ జైలు ఖైదీలు చంద్రబాబుతో తమ గోడు వెళ్లబోసుకోవాలని ఆతృతగా ఉన్నారట… అవునూ, జైలు గోడల బయట నుంచి గంజాయి, సిగరెట్లు, బీడీలు విసిరేస్తుంటారు, చంద్రబాబుకు జైలు భద్రం కాదని రాశారు కదా… మరిప్పుడు ఖైదీలు చంద్రబాబును నేరుగా కలిస్తే ఏమీ కాదా..? ప్రమాదం కాదా..?
అసలు కేసు రిలేటెడ్ కౌంటర్లు ఏమైనా రాస్తే చంద్రబాబు పట్ల జనంలో కాస్త సానుభూతిని బిల్డప్ చేయొచ్చు… అంతేతప్ప ఇలాంటి వార్తలతో వచ్చేది లేదు, కొందరు ప్రజలు చదివి నవ్వుకోవడం మినహా… జగన్ హయాంలో ఖైదీలకు క్షమాభిక్ష సరిగ్గా అమలు కావడం లేదు, అందుకని చంద్రబాబుతో గోడు వెల్లబోసుకోవాలని అనుకుంటున్నారు అట… ఎవరు చెప్పారు..? ఏమో… ఆంధ్రజ్యోతే రాసేసింది… పైగా తను ఇప్పుడు తమతోపాటు ఖైదీ… తనేం చేయగలడు..?
చంద్రబాబు ఇప్పుడు జైలులో ఉన్నాడు కాబట్టి… ఖైదీల స్థితిగతులు గుర్తొచ్చాయా చంద్రబాబు మీడియాకు..? జైళ్ల దుస్థితి ఇన్నేళ్లూ కనిపించలేదా..? జైళ్లలో పరిస్థితులు మార్చడానికి చంద్రబాబు ఏరోజైనా ప్రయత్నించాడా..? ఆరోగ్యాలు దెబ్బతిని ఎందరో రోగులు మరణించలేదా..? జగన్‌కు గానీ, చంద్రబాబుకు గానీ ప్రత్యేక సౌకర్యాలు కలిగించకుండా… అందరితోపాటు ఉంచేస్తే వాళ్లకు జైళ్ల దుర్గతి నిజంగా అర్థమయ్యేదేమో..!!
Share this Article