మనదేశంలో ఉత్తర ప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఇరవై కోట్ల జనాభా అంటే నాలుగయిదు యూరోప్ దేశాల జనాభాకు సమానం. ఉత్తర ప్రదేశ్ లో పరమ పవిత్ర గంగ ప్రవహిస్తుంది. కోట్ల పుణ్యక్షేత్రాల సమానమయిన కాశీ ఉంది. త్రేతాయుగం నాటి పావన అయోధ్య ఉంది. త్రివేణీ సంగమ ప్రయాగ ఉంది. సనాతన రుషులు కోరి కోరి తపస్సుకోసం ఎంచుకున్న నైమిశారణ్యం ఉంది. ఇంకా లెక్కలేనన్ని పుణ్యక్షేత్రాలున్నాయి. గోమతి లాంటి పుణ్యతీర్థాలున్నాయి. పుణ్యపురుషులు పుట్టారు. పెరిగారు. ఇంకా పుడుతూనే ఉండే పుణ్యభూమి. అలాంటి ఉత్తర ప్రదేశ్ లో ఏటా అక్షరాలా ముప్పయ్ అయిదు వేల కోట్ల రూపాయల మద్యం మాత్రమే తాగుతున్నారట. బయట మద్యం దుకాణాల్లో ద్రవం అమ్మడం, తాగడం తెలిసిందే. అలవాటున్న తాగుబోతులు ఇళ్లల్లో బాటిళ్లు నిలువ ఉంచుకోవడానికి లైసెన్సులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Ads
ఈ లైసెన్స్ కోసం మొదట యాభై ఒక్క వేలు డిపాజిట్ చేయాలి. లైసెన్స్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తం వెనక్కు ఇస్తారు. సంవత్సరానికి పన్నెండు వేలు ఫీజు కట్టాలి. ఇది మాత్రం వెనక్కు రాదు. ఈ రెండు ఫీజులు కడితే ప్రతి నెలా మూడు బాటిళ్లు ఇంట్లో రైట్ రాయల్ గా ఉంచుకోవచ్చు. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ మేడ్… ఇలా ఒక్కో బ్రాండును బట్టి సంవత్సరం ఫీజులో మార్పులుంటాయి. ఒక ఇంటి అడ్రస్ కు ఒక లైసెన్స్ మాత్రమే ఇస్తారు.
తాగుబోతులు ఇళ్లల్లో డ్రమ్ములకు డ్రమ్ములు నిలువ ఉంచుకుని మద్యధరా సముద్రమే చిన్నబోయేలా మద్యం తాగుతున్నారట. దాంతో తాగుబోతుల ఆరోగ్యాలను, వారి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దయగల ప్రభుత్వం ఈ వినూత్న బాటిళ్ల నియంత్రణ లైసెన్సు విధానాన్ని ప్రవేశపెడుతోందట. అయితే- ప్రభుత్వ వాదనతో తాగుబోతులు ఏకీభవించడంలేదు. ఎలాగయినా తాగుతాం కాబట్టి- డిపాజిట్, సంవత్సర చందాతో ఏటా మరో అయిదారు వేల కోట్ల ఆదాయం పెంచుకోవడానికి మత్తులో దెబ్బ కొడుతోందని మత్తు లేనప్పుడు బాధపడుతున్నారు. తాగుబోతులు నిజానికి నిస్వార్థపరులు! అలిశెట్టి ప్రభాకర్ మరో సందర్భంలో అన్న మాటను తిరగేస్తే-
“వారి నిద్ర-
లోకానికి మేలుకొలుపు.
వారి ఖర్చు-
ప్రభుత్వానికి ఆదాయం.
వారి అనారోగ్యం-
ప్రభుత్వ ఖజానాకు ఆరోగ్యం.”…………….. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article