డిస్‌క్లయిమర్ :: అన్ని సర్వేలు నిజమైన ప్రజాభిప్రాయాన్ని చెప్పాలనేమీ లేదు… ఆయా సర్వేల ఉద్దేశాలు, సర్వే సంస్థల క్రెడిబులిటీ, తీసుకునే శాంపిల్స్ సంఖ్య, సరైన మిక్స్, క్రోడీకరణలో శాస్త్రీయత వంటి చాలా కారణాలు ఉంటయ్…
జర్నలిస్ట్, పొలిటికల్, బ్యూరోక్రాట్ సర్కిళ్లలో ఓ జనరల్ ఒపీనియన్ ఉంది… అదేమిటంటే… తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద జనంలో బాగా వ్యతిరేకత ఉంది, వాళ్లను నమ్ముకుంటే కేసీయార్ మునిగిపోవడం ఖాయం, సిట్టింగులతో పోలిస్తే కేసీయార్ మీద మాత్రం కాస్త తక్కువ వ్యతిరేకత ఉంది…
వై నాట్ 175 అని జగన్ పైకి భీషణ సంకల్పాలు ప్రకటిస్తున్నాడు గానీ… ఏపీ ఫీల్డ్‌లో జనాభిప్రాయం ఏమిటో ఎవరూ సరిగ్గా అంచనా వేయలేని, విశ్లేషించలేని స్థితి ఉంది… ఈ నేపథ్యంలో ఐఏఎన్ఎస్-సీవోటర్ నిర్వహించిన ఓ సర్వే కాస్త భిన్నంగా, ఆసక్తికరంగా ఉంది… అది యాంగర్ ఇండెక్స్ పేరిట సర్వే చేసింది… (ఎన్ని శాంపిళ్లు, అభిప్రాయ సేకరణ తీరు మీద క్లారిటీ లేదు…) అంటే సీఎంలపై ఉన్న వ్యతిరేకత స్థాయి ఏమిటో తెలుసుకునే సర్వే అన్నమాట…
Ads
అందరిలోకన్నా కేసీయార్ మీద తెలంగాణ ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నట్టు ఆ సర్వే చెబుతోంది… 50.2 శాతం మంది, అనగా సగానికి ఎక్కువ మంది కేసీయార్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారట… ఉంటే ఉండొచ్చు, ప్రజల్లో యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ ధోరణి ఉండకూడదని ఏమీ లేదు… తెలంగాణను వదిలేసి, జాతీయ రాజకీయాల అర్రులు చాస్తున్న తరువాత ఈ వ్యతిరేకత మరింత పెరిగి ఉండొచ్చు… పోనీ, ఇంకా చాలా చాలా కారణాలు కూడా ఉండొచ్చు కూడా…
ఈ సర్వే ఫలితమే రాబోయే ఎన్నికల్లో ప్రతిబింబిస్తే కేసీయార్ మూడోసారి అధికారం చేపట్టడం కల్ల… అయితే సర్వేలోని మరో అంశం నమ్మబులేనా అనిపిస్తోంది… కేసీయార్ మీద సగం మంది ప్రజలు వ్యతిరేకతతో ఉంటే తన సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద మాత్రం కేవలం 27.6 శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారట… ఎన్‌లైటెన్ సెక్షన్లలో ఉన్న జనరల్ ఒపీనియన్‌కు ఇది విరుద్ధంగా కనిపిస్తోంది… నిజానికి కేసీయార్ మీద వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా మరి… ఇదేమిటి..?
ఏపీ రాజకీయాలకు వస్తే… జగన్ మీద 35.1 శాతం మందిలో కోపం ఉందట… చంద్రబాబు అరెస్టు తరువాత ఈ శాతం ఏమైనా పెరిగిందా..? ఎంత పెరిగి ఉండొచ్చు..? ఏమో… ఈ అరెస్టులు, కేసులు, జైళ్లు రీసెంటు పరిణామాలు కదా… ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజల్లో కోపం మాత్రం 44.9 శాతం ఉందట… అంటే జగన్ పర్లేదు గానీ ఆయన ఎమ్మెల్యేలే సరైనవాళ్లు కాదనేది జనాభిప్రాయమా..? తెలంగాణ సిట్టింగులు పర్లేదు గానీ ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని మాత్రం సహించలేమని చెబుతున్నారా ప్రజలు..?
త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో మాత్రమే ఈ యాంగర్ ఇండెక్స్ సర్వే నిర్వహించారు… ఈ కథనంలో కేవలం తెలుగు రాష్ట్రాల స్థితినే పరిగణనలోకి తీసుకుని, తెలుగు ప్రజాభిప్రాయానికే పరిమితమయ్యాం… ఒక్క ముక్కలో చెప్పాలంటే జగన్ మీద వ్యతిరేకత అంత ఎక్కువేమీ కాదు, అది మరీ ఫలితాలను తారుమారు చేసేంత తీవ్రత కాదు, కానీ తెలంగాణ సీఎం మీద వ్యతిరేకత స్థాయి మాత్రం ఖచ్చితంగా ప్రమాద సంకేతమే…!! హైదరాబాద్ జర్నలిస్టుల ఉసురు తగలబోతోందా..!!
Share this Article