డెల్యూషన్స్ an idiosyncratic belief or impression maintained despite being contradicted by reality or rational argument, typically as a symptom of mental disorder... డెల్యూషన్ అని టైప్ చేస్తే గూగుల్ లో వచ్చిన సమాచారం ఇది.. మానసిక శాస్త్రంలో ఇదొక తీవ్రమైన మానసిక వ్యాధి..ఈ వ్యాధి గ్రస్తులు తాము నమ్మిన విషయాన్ని బలంగా విశ్వసిస్తారు.. అదే నిజమనే భ్రమలో బతికేస్తుంటారు…ఒక కొత్త లోకాన్ని ఊహించుకుని ఊహల్లో జీవిస్తుంటారు..
…………………………………………..
ఇప్పుడు ఈ అంశం గురించి ఎందుకు చెబుతున్నానంటే.. ఇదే వ్యాధి రెండు నిండు ప్రాణాల్నిబలితీసుకుంది.. ఏ రోగమొచ్చో..ఏ యాక్సిడెంట్ అయ్యో..లేక గుండెపోటుతోనో లేక ఇంకేదైనా కారణాలతో ప్రాణం పోతే పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ………నవమాసాలు కనిపెంచి 25ఏళ్లు వచ్చాక అదే కన్నతల్లి తాను కన్నబిడ్డను అత్యంత దారుణంగా చంపేస్తే.. అల్లారుముద్దుగా ఏలోటు లేకుండా పెంచుకున్న బిడ్డలను కన్నతండ్రి కిరాతకంగా హత్య చేస్తే అందుకు కారణం డెల్యూషన్స్.. అవును చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన దారుణమే ఇది.. సాధారణంగా ఏ కేసులోనైనా ఏదైనా అన్యాయం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు..కానీ ఈకేసులో ఫిర్యాదు చేసేదెవరు.. న్యాయం కావాలని అడిగేదెవరు.. ఈ కేసులో ఫిర్యాదిదారులు ఎవరూ లేరు..ఇద్దరూ చనిపోయారు..అది కూడా కన్నతల్లిదండ్రుల చేతుల్లో… ఎవరికీ రాకూడని కష్టం.. ఎవరూ ఎదుర్కోకూడని ఒక దారుణ మారణ ఘటన
Ads
……………………………………………………………………………………..
కన్నబిడ్డల్ని తల్లిదండ్రులే చంపడం చాలాసార్లు చూశాం..కానీ ఆఘటనలు వేరు ఇదివేరు..అగ్రకులానికి చెందిన తమ కూతురు తక్కువ కులంవారిని ప్రేిమించిందనే కారణంతో తల్లిదండ్రులే కూతుళ్లను చంపిన ఘటనలు చూశాం.. పోనీ మదనపల్లె ఘటనలో బాధితులు అలేఖ్య, దివ్య అలాంటి తప్పేమీ చేయలేదు.. ఏ తప్పూ చేయకుండానే గోరుముద్దలు తినిపించిన తల్లి చేతుల్లోనే ప్రాణాలు వదిలారు..అది కూడా అత్యంత కిరాతకంగా.. ఏ తల్లైనా ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందా.. కన్నబిడ్డకు అమ్మా అని ఏఢిస్తేనే తల్లి గుండె అల్లాడిపోతుంది.. పసిపాపకి ఆకలైతే తల్లి గుండె పాలతో నిండిపోతుంది.. బిడ్డ కడుపు నిండితే తల్లి మనసు కుదుటపడుతుంది..కానీ ఆ తల్లే బిడ్డ నుదుటన చచ్చేవరకూ కొడుతుందా..అదికూడా అత్యం త ఫైశాచికత్వంతో.. బిడ్డను కొట్టి చంపమని కన్నతండ్రే చేతులు విరిచి పట్టుకుంటాడా.అత్యంత క్రూరత్వంతో.. ఇదొక బాధాకరమైన అంశమే కాదు..చర్చనీయాంశం కూడా..సమాజానికి ఇదో గుణపాఠం కూడా..ఎంత సంపాదించినా..ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా.. మానసిక స్థితి సరిగా లేకపోతే అవన్నీ వృధానే..
………………………………………………………………
ఎమ్మెస్సీలో గోల్డ్ మెడలిస్ట్ అయి మాస్టర్ మైండ్స్అనే పెద్ద స్కూల్ స్థాపించి.. వేలమందికి విద్యనందించిన గొప్ప మహిళ వల్లూరి పద్మజ.. ఆ స్థాయికి రావడం ఆషామాషీ వ్యవహారం కాదు.. బంగారం లాంటి భర్త.. రత్నాల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు..కావల్సినంత ఆస్తి ఉంది.. ఏ లోటూలేదు..ఏదిగులూ లేదు.. దేవుడు అన్నీ ఇచ్చాడు.. కానీ ఆమె కిల్లర్ గా ఎందుకు మారింది అంటే.. అదో సమాధానం దొరకని ప్రశ్న…అన్నీ ఇచ్చినట్టే ఇచ్చిన దేవుడు అన్నీ లాగేసుకున్నాడా… కొత్తలోకం సృష్టించాలనే తపనతో ఊహాాతీత ఆలోచనలతో పిచ్చి ప్రేలాపనతో కన్నబిడ్డల్ని చంపుకోవాల్సిన పరిస్థితికి ఆమె రావడానికి కారణం మానసిక ప్రవర్తన..డెల్యూషన్స్ అనే మానసిక వ్యాధి.. అంటే తాను నమ్మిందే నిజమనుకోవడం..అదే భ్రమలో బతికేయడం..ఏదో ఊహాలోకాన్ని చేరుకోవాలని తపన పడడం.. క్లుప్తంగా పిచ్చిగా ఆలోచించడం… ఏంచేస్తున్నామో తెలీనంత దారుణమైన స్థితికి చేరుకోవడం… అవును.. ఆమె చదువుకున్నప్పుడు ఆ జబ్బు లేదు.. పెళ్లి చేసుకున్నపుడు ఆ జబ్బు లేదు.. పిల్లల్ని కన్నపుడు ఆ జబ్బు లేదు.. స్కూల్ ప్రారంభించినపుడు ఆ జబ్బు లేదు..మరి ఆ డెల్యూషన్స్ పురుగు ఆమె మెదడులో ఎప్పుడు చేరింది..ఎలా చేరింది..
………………………………………………………………………………………………………………………..
ధ్యానం చేస్తే పర్వాలేదు..పరధ్యానంలో హత్యలు చేస్తేనే తప్పు.. అవును ఆమెకు ధ్యానం ఎక్కువై పరధ్యానంలోకి వెళ్లిపోయింది.. ఆధ్యాత్మిక భావన తప్పు కాదు..అది పరాకాష్టకు చేరకూడదు.. దేవుడున్నాడని నమ్మడం తప్పు లేదు.. ఈ లోకాన్ని ఏదో శక్తి నడిపిస్తోంది..అది కాదనలేం..కొందరు అల్లా అంటారు ఇంకొకరు శివుడంటారు..మరొకరు జీసస్ అంటారు అలా చెప్పుకుంటూ పోతే ఎవరో ఒకరు ఏదోఒకటి నమ్ముతుంటారు.. నమ్మాలి తప్పదు..కానీ ఆమెలో ఉన్న ఆ నమ్మకం విపరీత ధోరణికి వెళ్లిపోయింది.. ఈ లోకం కాదు ఇంకేదో లోకం ఉంది.. ఈ లోకాన్ని వదిలి ఆ లోకాన్ని చేరుకోవాలని ఆమె మస్తిష్కం పదేపదే తొందరపెడుతోంది.. కొత్తలోకంలో కావాల్సిన మనశ్సాంతి దోబూచులాడుతోంది. ఆ కొత్తలోకానికి చేరుకోమని మనసు తొందరపెడుతోంది.. ఈ స్థితికి ఆమె నమ్మే ఆధ్యాత్మిక వేత్తల బోధనలు మరింత కారణమయ్యాయి..ఈ సృష్టిలో ఆత్మ,పరమాత్మల గురించి ఎవరెవరో స్వామీజీలు, బాబాలు చెప్పే మాటలు, వాళ్లు రాసే రాతలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి.. మహిమాన్విత శక్తులున్నాయి.. మంత్రతంత్రాలు ఉన్నాయి..దేవుడున్నాడంటే దెయ్యాలు ఉన్నాయని కచ్చితంగా నమ్మాల్సిందే కదా అనే వాదన ఆమెలో బలంగా నాటుకుపోయింది.. దేవుడి ముందు కొట్టే కొబ్బరికాయ కంటే ఎవరో దిష్టితీసి పడేసిన నిమ్మకాయనే ఆమె ఎక్కువగా నమ్ముతోంది..
………………………………………………………………………………………………………………… ……………
కలియుగం అంతమైపోతోంది..సత్యయుగం ప్రారంభమవుతోంది ఆమెకు కలిపురుషుడు కనిపిస్తున్నాడు..కొత్తలోకంలోకి ఆమెను ఆహ్వానిస్తున్నాడు.. ఆమె ఏమి ఆశించి ఆ లోకంలోకి వెళ్లాలనుకుందో ఎవరికీ తెలీదు..అదే డెల్యూషన్స్.. దేవుడు ఇక్కడే అన్నీ ఇచ్చాడు కదా అక్కడికి వెళ్లి కొత్తగా ఏమి వెదుక్కుంటుంది..ఇది ఆలోచించి ఉంటే బహుశా ఇద్దరు పిల్లల్ని చంపుకుని ఉండేది కాదు..తాను బలంగా నమ్మడమే కాదు తన పిల్లల్ని తన భావనలకు ఆకర్షితుల్ని చేసేసింది..దెయ్యాలు భూతాలు ఉన్నాయని ఆ కుటుంబం మొత్తం నమ్ముతోంది. చనిపోయిన వారి ఆత్మలు గాల్లో తిరుగుతూనే ఉన్నాయని బలంగా నమ్ముతోంది.. ఆ ఆత్మల్ని తరిమికొట్టాలి.. పరమాత్ని చేరుకోవాలి.. కొత్త లోకంలోకి మళ్లీ ప్రాణం పోసుకుని కొత్తజీవితాన్ని ప్రారంభించాలి..అద్బుతం తమ జీవితంలో జరగాలి.. అంతే ఇదే ఆలోచన..
………………………………………………………………………………………………….
చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ దగ్గర సంగీతం నేర్చుకుంటున్న దివ్య.. భూపాల్ లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో చదువుతున్న పెద్ద కూతురు అలేఖ్య .. ఇద్దరూ బంగారు తల్లులే.. కానీ తల్లి చెప్పే కొత్త లోకంవైపు ఆకర్షితులయ్యారు.. జీవితంలో అద్బుత కోణాల్ని చూడాలనుకున్నారు.. తల్లిమాటలకు ఎక్కువగా ప్రభావితులయ్యారు.. కుక్కని తీసుకుని ఇంటి పరిసరాల్లో ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్లిన దివ్య….అక్కడ ఎవరో దిష్టితీసి పడేసిన నిమ్మకాయ, పసుపు, కుంకుమని తొక్కింది..అంతే తనలోకి దెయ్యం ప్రవేశించిందని నమ్మింది.. ఇంటికొచ్చి అమ్మకు,అక్కకు చెప్పింది..ఈ దెయ్యమనే అంశాన్ని విపరీతంగా నమ్మే.. ఆ కుటుంబం దాన్ని బయటకు పంపాలనకున్నారు. అంతటి విద్యావంతులు దెయ్యం ఉందనుకోవడమే ఒక విచిత్రమైతే దాన్ని బయటకు పంపాలనుకోవడం ఇంకా విడ్డూరం.అందుకే ఎక్కడో ఏదో తాంత్రికుడు చెప్పిన మాటలతో చిన్నమ్మాయి ఒంట్లో ఉన్న దెయ్యాన్ని బయటకు పంపాలనుకుంది తల్లి.. ఇంకెవరినో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ దెయ్యం తమకు మనశ్శాంతి లేకుండా చేస్తోందని బలంగా నమ్మింది.. ఇంట్లో అణువణువూ ఆ దెయ్యం తిరుగుతోందని భ్రమించింది. అందుకే కూతుర్ని చంపేస్తే ఆమె ఒంట్లో ఉన్న ప్రాణంతో పాటు దెయ్యం కూడా బయటకు పోతుందనుకుంది. అటు అక్క అలేఖ్య, ఇటు అమ్మ పద్మజ ,తండ్రి పురుషోత్తం అందరూ కలిసి నగ్నపూజలు చేసి దెయ్యాన్ని వెళ్లగొట్టాలనుకున్నారు. అనుకున్న ప్రకారం అందరూ నగ్నంగా పూజలో కూర్చున్నారు..ముందుగా చిన్నమ్మాని తలపై డంబెల్స్ తో కొట్టారు.. దెబ్బతగలగానే రక్తం రాగానే ఆమె తనను బతకనీయమని ప్రాధేయపడింది..వినలేదు..నీకు మళ్లీ ప్రాణప్రతిష్ట చేస్తాం..నీలోని దెయ్యం బయటకువెళ్లిపోవాలి అంటూ ఆమెను ఈడ్చుకొచ్చి మరీ కొట్టి చంపారు. అంతేగాదు నుదుటిన త్రిశూలంతో చెక్కారు.. తలపై త్రిశూలాన్ని గుచ్చారు..ఒక ప్రాణం రక్తపు మడుగులో కొట్టుమిట్టాడి ఎగిరిపోయింది.. నన్ను చంపేస్తావా అమ్మా.అంటూ ఆ చిన్నప్రాణం అమ్మవైపు చూస్తేనే అమ్మఒడిలోనే కన్నుమూసింది. ఆ తర్వాత పెద్దమ్మాయి అలేఖ్య.. ఆమె నోట్లో నవధాన్యాలు పోసిన కలశాన్ని ఉంచింది..నోరుపట్టకపోయిన బలవంతంగా నోట్లో కలశాన్ని దూర్చింది..ఆమెకు తలమీద జుట్టు తొలగించింది..అనంతరం డంబెల్స్ తో ప్రాణం పోయేవరకూ కొట్టింది తల్లి.. ఇద్దరు కూతుళ్లు పుట్టేపుడు ఎలా ఉన్నారో పోయేప్పుడు కూడా అలాగే కనిపించారు ఆ తల్లికి నగ్నంగా.. పుట్టేపుడు కన్నపేగును తెంచినపుడు రక్తంచిందినట్టే ఇపుడు కూడా ఆ ఇద్దరు బిడ్డల నుదుటిమీద రక్తం కనిపించింది.. పుట్టినపుడు ఈ లోకంలోకి వచ్చేప్పుడు వాళ్లిద్దరూ ఏడ్చారు..ఇపుడు ఈ లోకంనుంచి వెళ్లిపోయేప్పుడు అలాగే ఏడ్చారు.. తాను అనుకున్న అద్బుతం జరగబోతోంది.. కలియుగం నుంచి సత్యయుగంలో అడుగుపెడుతున్నాం.అంటూ ఆనందంతో ఆ తల్లి ఊగిపోయింది.ఒక చేత్తో త్రిశూలం..మరో చేత్తో డంబెల్ పట్టుకుని తానే కాళికాదేవిని అంటూ అర్చింది…
…………………………………………………………………………………….
కన్నకూతుళ్లిద్దర్నీ కొట్టి సహకరించిన ఆ తండ్రి అది నిజమో..కాదో అనే భ్రమలోనే ఉన్నాడు..కానీ డెల్యూషన్స్ కదా.. తన భార్య ద్వార తన బుర్రలోకి చేరిన ఆ డెల్యూషన్స్ పురుగు అది నిజమే అని చెబుతోంది. అందుకే కళ్లముందు తన కన్నబిడ్డలిద్దరూ రక్తపు మడుగులో కొట్టుకుంటున్నా సరే ఆ తండ్రికి కనికరం అన్నది కనిపించలేదు..అంతా సృష్టి రహస్యం అనుకుంటున్నాడు..డెల్యూషన్స్ తో నిండిపోయిన ఆయన మెదడు కొత్తలోకంలో పరుగులుపెడుతోంది..
……………………………………………………………………………………………….. ……………….
కొత్తలోకాన్ని చూడాలనుకునే ఇలాంటి మానసిక రోగులు ఇద్దరూ వాళ్లని వాళ్లు చంపుకోవచ్చు కదా..ఇలా కన్నబిడ్డల్ని ఎందుకు చంపుకున్నారు.. అర్థఆయుష్షు దాటిపోయిన వారిద్దరూ పోయుంటే జీవితంలో అన్ని చూసినవాళ్లు కాబట్టి సమాజం పెద్దగా పట్టించుకునేది కాదు..కానీ జీవితంలో ఇంకా పావువంతు కూడా చూడని ఆ ఇద్దరు ఆడబిడ్డల ఆయుష్షు ఎందుకు తీశారు..ఇప్పుడు లోకం ఇదే ప్రశ్నిస్తోంది..
…………………
ఇప్పుడు కన్నబిడ్డల్ని చంపుకుని , సంపాదించుకున్న పేరుప్రఖ్యాతుల్ని పోగొట్టుకుని, లోకం ముంద పిచ్చిదానిగా ముద్ర వేసుకున్న పద్మజ, పురుషోత్తంలు ఇప్పుడు మనకు గురువుల్లాంటివాళ్లే..తాము ఏమి చేశామో అది ఇంకెవరూ చేయొద్దని పెద్ద గుణపాఠాన్ని చెప్పే గురువులు వాళ్లు..ఇన్నాళ్లు తమ దగ్గర చదువుకున్న పిల్లలకు ఏ పాటాలు చెప్పారో తేలీదు కానీ లోకానికి చెప్పిన గుణపాఠం మాత్రం చాలా పెద్దది.. నిజానికి మనందరం డెల్యూషన్స్ తో బతుకుతున్నవారిమే..కానీ మానసిక వ్యాధి కొందరిలో ఒకలా ఉంటే..ఇంకొందరిలో ఇంకోలా ఉంటుంది..విపరీతంగా డబ్బు సంపాదించాలనుకోవడం, అందరికంటే ఎక్కువగా బతకాలనుకోవడం, ఎదుటివాడిని నాశనం చేయాలనుకోవడం, జీవితంలో ఏమీ ఎదగలేకపోయామని తెగ బాధపడిపోవడం, ప్రతీకారేచ్చతో రగిలిపోవడం, ఇవన్నీ డెల్యూషన్స్ లక్షణాలే.. కానీ అవి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి అంతే… ఒక విధంగా అందరం మానసిక వ్యాధిగ్రస్తులమే.. కాకపోతే మనలో ఉన్న వ్యాధి మనకు తెలీదంతే..ఎదుటివారిలో మాత్రమే ఆ వ్యాధి లక్షణాలను గమనించలేము…. (ఈ కథనం చదవడానికి కూడా చాలా ఓపిక ఉండాలి..ఇది రాయడం, దీన్ని చదవాలనుకోవడం, చదివి బాగుందనో..బాగోలేదనో అనుకోవడం కూడా డెల్యూషన్స్ లో భాగమే.. ఒక జర్నలిస్టుగా గత పదిహేనేళ్లుగా చాలా వార్తలు కవర్ చేశాను..కానీ కెరీర్ లో అత్యంత బాధాకరం అనిపించిన ఘటన మాత్రం ఇదే..కన్నతల్లి చేతుల్లో అత్యంత దారుణంగా చనిపోతున్నపుడు ఆ ఇద్దరు ఆడపిల్లల ముఖాలను ఊహించుకుంటూ రాసిందే ఈ కథనం… ఇంకెపుడూ ఇలాంటి వార్తలు కవర్ చేసే అవకాశం రాకూడదని అనుకుంటూ…….. అశోక్ వేములపల్లి)
Share this Article