నిజంగా ఆది కాస్త ఆలోచనలో పడేసే వార్త… ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా మాట్లాడితే ద్రోహిలా లెక్కేసే రోజులు ఇవి… ఇక పార్టీలు, నాయకులైతే వాళ్ల మెప్పు కోసం నానా పాట్లూ పడుతుంటారు… ప్రభుత్వ ఉద్యోగులకు కోపం వస్తే మన ప్రభుత్వం ఉంటుందా..? మన పార్టీకి పుట్టగతులుంటాయా టైపు మథనం ఉంటుంది నాయకుల్లో…
నిజం చెప్పాలంటే… పనిలేని ప్రభుత్వ విభాగాలు ఎన్నో, ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియదు, ఎందుకు ప్రజాధనాన్ని జీతాలుగా చెల్లించాలో తెలియదు… ప్రజా సంక్షేమానికి నిధులున్నా లేకపోయినా ఉద్యోగుల జీతభత్యాలకు మాత్రం కొరత రానివ్వొద్దు… సొసైటీ ఎంతటి ఆర్థిక సంక్షోభంలో పడినా సరే ఈ ఖాతాకు మాత్రం నిధులు గ్రీన్ చానెల్‌లో అందాలి… ఇది ఏ తెలంగాణో, ఏపీయో, మరే ఇతర రాష్ట్రం సిట్యుయేషనో కాదు… దాదాపు అన్ని దేశాల్లోనూ ఇంతే…
దాదాపు ప్రతి విపక్షమూ ఓ ఆరోపణ చేస్తుంటుంది… సీబీఐని, ఈడీని మామీద రాజకీయ కారణాలతో ప్రయోగిస్తున్నది కేంద్ర ప్రభుత్వం అంటూ..! వేధింపులు అని ఆరోపిస్తుంటారు… (ఏ కారణాలతో ప్రయోగిస్తేనేం, కొందరి అక్రమాలైనా బయటికొస్తున్నాయి కదా అనేది ప్రజల భావన)… ఐతే మేం అధికారంలోకి వస్తే సీబీఐని మూసేస్తాం, ఈడీని మూసేస్తాం అని ఏ పార్టీ కూడా చెప్పదు… అసలు తమ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అవీ తమ ఆధీనంలోని దర్యాప్తు సంస్థల్ని తమకు పడని నాయకులపై ప్రయోగించడం చూస్తున్నాం కదా… సో, ఎవరూ శుద్ధపూసలు కాదు…
Ads
ఈ సిట్యుయేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల జోలికి గానీ… దర్యాప్తు సంస్థల జోలికి గానీ ఎవరూ పోరు… పోతామని కూడా చెప్పరు… భయం… భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులందరితోనూ గొడవ పెట్టుకుని, నిలిచి, గెలిచిన చరిత్ర కేవలం జయలలితకే ఉంది… ఇంకెవరికీ ఆ మొండితనం లేదు, తెగింపు లేదు… ఈ నేపథ్యంలో ఓ వార్త… అదీ మన ఇండియన్ రూట్స్ ఉన్న వివేక్ రామస్వామి అమెరికా ఎన్నికల ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యల వార్త…
75 శాతం ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసేస్తానంటున్నాడు… అంతేకాదు, ఎఫ్‌బీఐని పూర్తిగా మూసేస్తాను అంటున్నాడు… విద్య, మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల బ్యూరో, అణు నియంత్రణ వంటి అంశాలపై కొన్ని తెగింపు వ్యాఖ్యలు చేస్తున్నాడు… అలాగని అమెరికన్ సొసైటీ ఆ వ్యాఖ్యల్ని నెగెటివ్‌గా ఏమీ తీసుకోవడం లేదు… అంటే అమెరికన్ సొసైటీలో కూడా ఈ అంశాల్లో ఇప్పటి పార్టీలు, నాయకుల వైఖరిపై అసంతృప్తి ఉందన్నమాటే…
ఈయన రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి కావాలని ప్రయత్నిస్తున్నాడు… ఈ వ్యాఖ్యలు చేశాక తన పాపులారిటీ పెరిగింది… అంటే జనామోదం పొందుతున్నట్టు లెక్కించాలి… జనామోదం వస్తుందని సర్వేల ద్వారా తెలుసుకున్నాకే తను అధికారికంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు… ఏకంగా 16 లక్షల మంది ఉద్యోగులను తీసేస్తాను అంటున్నాడు, ఐనా ఆ సొసైటీ వ్యతిరేకంగా ఏమీ స్పందించడం లేదు… సరే, ఆయన నిజంగానే ఆ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి అవుతాడా లేదానేది వేరే సంగతి… మన దేశంలో ఏ పార్టీ నాయకుడైనా సరే, పనిలేని ఉద్యోగుల్ని తీసేస్తాననీ, సీబీఐని మూసేస్తామని చెప్పగలడా..? ఒక్కసారి ఊహించండి…
Share this Article