ఒక ఫోటో ఆలోచనల్లో పడేసింది… జీ20 సదస్సు కోసం ఇండియా వచ్చిన రిషి సునాక్, ఆయన భార్య అక్షత మూర్తి అక్షరధామ్ గుడికి వెళ్లారు… ఆ ఫోటో కాదు… మంత్రాలయం నుంచి వచ్చిన చిన్న వార్త… మరీ రెండుమూడు వాక్యాలు కూడా లేదు… దాంతోపాటు ఓ ఫోటో… అదేమిటీ అంటే… సునాక్ తల్లిదండ్రులు 16 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి పూజలు చేశారనేది వార్త…
మంగళవారం బెంగుళూరు నుంచి కారులో తుంగభద్ర రైల్వే స్టేషన్ (మంత్రాలయం రోడ్డు)కు వెళ్లి, అక్కడి నుంచి బసాపురం, రాంపురం, మాధవరం, చెట్నహళ్లి మీదుగా 16 కిలోమీటర్లు నడిచి మంత్రాలయం చేరుకున్నారు సునాక్ తల్లి ఉషా, తండ్రి యశ్‌వీర్… వారి వెంట సుధా నారాయణమూర్తి కూడా ఉంది… ఇదే వారి ఫోటో…
Ads
వాళ్లేదో అపరిమిత భక్తిని ప్రదర్శించడం కాదు వార్త… పంజాబ్ హిందూ రూట్స్ ఆ కుటుంబానివి… తండ్రి కెన్యాలో పుట్టాడు… తల్లి టాంజానియాలో పుట్టింది… అప్పుడెప్పుడో బ్రిటన్ వలస వెళ్లిన కుటుంబం… ఒకరకంగా విశ్వమానవులు వాళ్లు… ఐనాసరే, వాళ్లు తమ రూట్స్‌ను గౌరవిస్తున్నారు… వాళ్లకు అందులో ఆనందం ఉంది… అదీ బాగనిపించింది… కిలోమీటర్ల నడక అనేది విశేషం కాకపోవచ్చు, లేదా ఓ అగ్రదేశపు ప్రధాని తల్లీదండ్రులు అంత దూరం నడిచివెళ్లి తమ భక్తిభావనను మరింత బలోపేతం చేసుకోవడం విశేషమే కావచ్చు… కానీ వేరే దేశం వెళ్తే మన కులాల తాలూకు పంకిలాన్ని వదిలేసుకోకుండా బతికే చాలామందిని చూస్తే ఇది బాగున్నట్టనిపించింది…
కొందరు తాము ఆస్తికులమని చెప్పుకోవడానికి ఎందుకో బాగా చిన్నతనం ఫీలవుతుంటారు… ఎందుకు..? ఎవరి విశ్వాసం వాళ్లది… మన మతాన్ని ఆచరించడం వేరు, ఇతర మతాలపై విద్వేషం వేరు… తేడా చాలా ఉంది… వీళ్లు ఆస్తికులు, తమ రూట్స్‌ను ప్రేమించేవాళ్లు… అదీ ఈ వార్తలోని అసలు విశేషం… అఫ్‌కోర్స్, మన మెయిన్ స్ట్రీమ్‌కు ఇది మరీ కనీకనిపించని చోట్ల అచ్చేయదగిన చిన్న సింగిల్ కాలమ్‌లా కనిపించవచ్చుగాక… మన సోది టీవీ చానెళ్లకు అసలు వార్తే కాకపోవచ్చుగాక… కానీ ఇది కనెక్టింగ్ వార్తే… ఇది చదివాక ‘ముచ్చట’ ఏడాది క్రితం రాసిన మరో కథనం గుర్తొచ్చింది… ఓసారి చదవండి…
మనం కొన్ని విషయాల్ని చదవం, తెలుసుకోం… మనకు ఎంతసేపూ కులం ముఖ్యం… ప్రాంతం ముఖ్యం… మనం ఏ దేశంలో బతుకుతున్నా సరే, మనలోకం మనది… కులం పేరిట మన హీరోలు, వాళ్లపై మూర్ఖభక్తి, దరిద్రమైన అభిమాన ప్రదర్శన.. సిగ్గూశరం లేని ప్రవర్తన… అంతకుమించి ఆలోచించలేని దరిద్రం… కానీ కొందరి గురించి చదవాలి… విశ్వమానవులుగా మారుతున్న, మారిన మనుషులు గురించీ తెలుసుకోవాలి…
బోరిక్ జాన్సన్ అనేవాడు బ్రిటన్ ప్రధానిగా కుర్చీ దిగిపోయాడు… దానికి కారణాలు బోలెడు… స్వయంకృతాలు… ఆ కుర్చీ కోసం ఇప్పుడు రేసులో ఏకంగా ముగ్గురు భారతీయ సంతతి వ్యక్తులు పోటీపడుతున్నారు… కేవలం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్ మాత్రమే కాదు… ప్రీతి పటేల్, సువెల్లా బ్రేవర్ మ్యాన్ కూడా ఉన్నారు… ఎవరు వాళ్లు..?
రిషి సునాక్… పంజాబ్ హిందూ రూట్స్… తండ్రి కెన్యాలో, తల్లి టాంజానియాలో పుట్టారు… అప్పుడెప్పుడో బ్రిటన్ వలస వెళ్లిన కుటుంబం… భార్య ఇన్ఫోసిస్ నారాయణమూర్తి బిడ్డ అక్షత… ఇప్పటికీ హిందూ మతాన్ని పాటిస్తాడు… విశ్వమానవుడే కానీ మూలాల మీద గౌరవం ఉంది…
ప్రీతి పటేల్ :: ఈమెవి గుజరాతీ మూలాలు… తాతలు ఉగాండా నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లారు… ఈమె అలెక్స్ సాయర్‌ను పెళ్లిచేసుకుంది… హిందూ మతాన్నే ఆచరిస్తుంది ఇప్పటికీ… ఎక్కడో పెరిగారు, ఎక్కడి నుంచో వలస వచ్చారు… ఐనా మూలాలు మరవని కుటుంబం అది…
సుయెల్లా బ్రేవర్‌మ్యాన్ :: తండ్రి క్రిస్టీ, తల్లి ఉషా ఫెర్నాండెజ్… అప్పుడెప్పుడో కెన్యా, మారిషస్‌ల నుంచి బ్రిటన్ వలస వెళ్లిన కుటుంబం… తల్లి నర్స్… తండ్రివి గోవా రూట్స్… బౌద్ధమతాన్ని పాటిస్తుంది ఈ కుటుంబం… ఈమె ప్రమాణస్వీకారం కూడా ధమ్మపథం మీద చేసింది…
వీళ్ల కుటుంబాలు ఎక్కడెక్కడికో, ఏ దేశాలకో వలసవెళ్లి, తరువాత బ్రిటన్ వెళ్లి స్థిరపడ్డ భారతీయ మూలాలున్న కుటుంబాలు… ఎవ్వరూ తమ రూట్స్ మరిచిపోలేదు… తాము పుట్టిన మతాల్ని విడిచిపెట్టలేదు… బ్రిటన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు… ప్రూవ్ చేసుకున్నారు… ఎదిగారు… ఇప్పుడు ఏకంగా ప్రధాని పదవికే పోటీపడుతున్నారు…
అలాగని సంకుచితంగా ఉండే వ్యక్తులేమీ కాదు… తమ మూలాలను అభిమానిస్తూ, గౌరవిస్తూ, ఆచరిస్తూ, పాటిస్తూనే… బ్రిటన్ సమాజంలో ఒదిగిపోయారు… ఆ దేశ సంక్షేమం గురించే ఆలోచిస్తారు… మనం ఎక్కడ బతుకుతున్నామో, మనకు ఏ గడ్డ ఆశ్రయమిచ్చిందో దాన్ని ప్రేమించడం… గొప్ప గుణం…
ఎక్కడెక్కడికో వెళ్లినా సరే… మన పిచ్చి హీరోలు, మన వెర్రి రాజకీయ నాయకులు, మన తిక్క పార్టీల మీద మూర్ఖపు ప్రేమలతో తన్నుకునే అర్ధ మెదళ్లు వీళ్ల గురించి చదవాలి… వీళ్లే కాదు, పలు దేశాల్లో మనవాళ్లు ‘‘విశ్వమానవులుగా’’ వ్యవహరిస్తూ, సంపూర్ణ పరిపక్వతతో వ్యవహరిస్తున్నవాళ్లు బోలెడు మంది… వీళ్లు నిజమైన గ్లోబల్ హ్యూమన్స్..!!
Share this Article