Jagannadh Goud…… వివేకం కలిగిన రామస్వామి, వివేక్ రామస్వామి……. వివేక్ తండ్రి గణపతి, తల్లి గీత. తల్లితండ్రులు పుట్టి పెరిగింది కేరళ లోని పాలక్కాడ్ జిల్లా. తండ్రి కేరళ ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు, ఆ తర్వాత NIT లో చదివి ఇంజనీర్ గా పనిచేస్తూ ఆ తర్వాత అమెరికాకి వీసా మీద వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు. వివేక్ తల్లి గీత డాక్టర్.
వివేక్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బయాలజీ లో డిగ్రీ చేసి ఆ తర్వాత యేల్ యూనివర్శీటీలో “లా” చేశాడు. బయోటెక్ కంపనీ పెట్టి ఆ తర్వాత ఫైనాన్సియల్ సంస్థలో పనిచేస్తూ బానే సంపాదించాడు. అతని ప్రస్తుత సంపద 8 వేల కోట్లు పైనే. వివేక్ భార్య అపూర్వ డాక్టర్. వివేక్ తమ్ముడు శంకర్ రామస్వామి కూడా ఒక బయోఫార్మస్యూటికల్ కంపనీ పెట్టాడు.
చిన్నప్పటి నుంచి లీడర్ షిప్ క్వాలిటీస్ అలవర్చుకున్న వివేక్ ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రెసిడెన్సియల్ అభ్యర్ధిగా గెలవటానికి ప్రయత్నిస్తున్నాడు. సొంత పార్టీలో గెలిస్తే, అప్పుడు వచ్చే నవంబర్ 2024 లో జరిగే ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా పోటీ చేయటానికి కుదురుతుంది. డోనాల్డ్ ట్రంప్ కూడా రిపబ్లికన్ పార్టీనే కాబట్టి ట్రంప్ జైల్ కి వెళ్తేనే వివేక్ కి మార్గం ఏర్పడుతుంది. సొంత పార్టీలో ట్రంప్ మీద రామస్వామి గెలవటానికి అవకాశం లేదు. కారణం, వివేక్ ఒక రకంగా చిన్న ట్రంప్ మరియూ ట్రంప్ భావజాలమే. వివేక్ భావజాలం, ఇంకా చాలా విషయాల్లో ట్రంప్ అభిమాని & ఫాలోవర్ వివేక్.
అయితే తన తల్లితండ్రులు అమెరికాకి H1B వీసా మీదనే వచ్చారు. కానీ తాను రిపబ్లికన్ పార్టీలో గెలిచి ఆ తర్వాత వచ్చే నవంబర్ లో డెమొక్రాటిక్ అభ్యర్ధి మీద గెలిచి ప్రెసిడెంట్ గా అయితే H1B వీసా రద్దు చేస్తా అని అనటంలో ఆశ్చర్యం లేదు. అతను తల్లితండ్రులది ఇండియా కానీ అతనిది అమెరికన్ పౌరసత్వం. అతను అమెరికా ప్రయోజనాలనే కాపాడతాడు, కాపాడాలి కూడా.
ఇంకా నేను ప్రెసిడెంట్ అవ్వగానే ప్రభుత్వ ఉద్యోగాలని 75% వరకు తీసి పడేస్తా అని చెప్పటంలో నిజంగా అతని గట్స్ కి మెచ్చుకోవాలి.
రిజర్వేషన్స్ కూడా తీసి పడేస్తా అని చెప్పటం అమెరికా చరిత్రలో కాదు, ఆధునిక ప్రపంచ చరిత్రలోనే ఒక కలికితురాయి. ఒక డిస్కషన్ లో నల్ల వాళ్ళకి రిజర్వేషన్స్ లేకపోతే ఎలా అని అడిగితే, గాయం అయ్యాక బాండ్ ఎయిడ్ వేసే బదులు అసలు గాయమే లేకుండా చూస్తా. అందరికీ అన్ని చోట్ల సమానంగా విద్య అందుబాటులోకి తెస్తా, ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేసి నల్లవాళ్ళకి కూడా మెరుగైన విద్య అందిస్తే ఆటోమాటిక్ గా వాళ్ళకి ఇంకా మెరుగైన అవకాశాలు వస్తాయి అని చెప్పటం నిజంగా గ్రేట్.
ప్రపంచం అంతా ఉక్రెయిన్ కి సపోర్ట్ చేస్తుంటే తను మాత్రం రష్యాతో విరోధం మంచిది కాదు. చైనాని దూరం చేసుకొని, రష్యాని కూడా దూరం చేసుకుంటే వాళ్ళిద్దరు కలిసి అమెరికాకి మేకులా తయారవుతారు కాబట్టి నేను అమెరికా ప్రెసిడెంట్ అయితే ఉక్రెయిన్ కి సపోర్ట్ ఆపి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపించి రష్యాతో మంచి సంబంధాలు ఏర్పరుచుకొని, చైనా తైవాన్ ని ఆక్రమించకుండా చూస్తా అని చెప్పటం అతని ముందుచూపుని చూసిస్తుంది. అమెరికాలో ఉన్న సమస్యలని వినూత్న రీతిలో పరిష్కరించి అమెరికాని నిజంగా నంబర్ వన్ పొజీషన్ లో పెడతా అనేది అతని మాటల సారాంశం.
అమెరికాలో గన్ కల్చర్ గురించి అడిగితే సమస్య గన్స్ కాదు. మానసిక సమస్యలు అని చెప్పాడు. నిజంగా హాట్సాఫ్ రా రామస్వామి. WHO కూడా ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరికి మానసిక సమస్య ఉంది అని చెప్పింది. సమస్యని కూకటి వేళ్ళతో పెకిలించాలి కాని పైపైన మాట్లాడకూడదు. 2022 లో నేను అమెరికా ఫార్మా స్యూటికల్ సదస్సులో ఇదే అంశంపై మాట్లాడాను.
ఏది ఏమైనా కేరళలో తమిళ బ్రాహ్మణ కుటుంభానికి చెందిన పూర్తి వెజిటేరియన్ రామస్వామి అమెరికాలో ఒక మార్క్ సృష్టించాడు. నేను హిందువునే అని గర్వంగా చెప్తూ క్రిస్టియానిటీని నేను గౌరవిస్తాను, దేవుడు ఒక్కడే అని చెప్పి క్రిస్టీయన్స్ మనస్సులని కూడా గెలుస్తున్నాడు. సొంత పార్టీలో డోనాల్డ్ ట్రంప్ మీద గెలిస్తే ప్రధాన ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్ధి మీద ఈ పిలగాడు ఈజీగా గెలుస్తాడు, ఏమవుతుందో చూడాలి. అమెరికాలో టాలెంట్ కి పెద్ద పీట వేస్తారు అనటానికి వివేక్ రామస్వామి ఒక ఉదాహరణ. గాడ్ బ్లెస్ అమెరికా, గాడ్ బ్లెస్ రామ స్వామి ..! – జగన్
Share this Article