అటు సోనియా గాంధీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను జారీ చేయడం పూర్తి కూడా కాలేదు… అప్పుడే యాంటీ కాంగ్రెస్ సెక్షన్లు సోషల్ మీడియాలో వెక్కిరింపులు, ఆక్షేపణలు స్టార్ట్ చేశాయి… బీఆర్ఎస్ సహజంగానే ఈ కౌంటర్లలో ముందుంది… తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాకు ఎప్పటిలాగే చేతకాలేదు… ‘కేవలం ఓట్ల కోసమే ఈ హామీలు.., ఏం, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఇస్తున్నారా..? ఐనా మిమ్మల్ని నమ్మేదెవరు..?’ వంటి వ్యాఖ్యలు జోరుగా సాగాయి, గుతున్నాయి, తాయి…
మేధావులుగా చెప్పబడే కొందరి రాతల సారాంశం ఏమిటంటే… ‘‘ప్రజాధనాన్ని అప్పనంగా పంచిపెట్టడం తప్ప నిర్మాణాత్మక హామీలు ఏమీ ఇవ్వలేరా..? ఇలాగైతే ఖజానా వట్టిపోవడం ఖాయం… ఉద్యోగుల జీతాలకూ దిక్కుండదు…’’ ఓసారి తటస్థ కోణంలో పరిశీలించాలి… 1) ఏ పార్టీ అయినా వోట్ల కోసమే ప్రయత్నిస్తుంది… ఏ పార్టీకైనా కావాల్సింది అధికారమే… ఏ పార్టీకైనా ఓ వ్యూహం ఉంటుంది… కాంగ్రెస్ కూడా అంతే… సో, వోట్ల కోసమే హామీలు అనే విమర్శలో అర్థం లేదు… అధికారంలో ఉన్న కేసీయార్ చేస్తున్నదేమిటి..? అధికారంలోకి రావాలని కలలుకంటున్న బీజేపీ చేస్తున్నదేమిటి..? వోట్ల రాజకీయాలు కాదా..?
ప్రజాధనాన్ని పంచిపెట్టడం, ఖజానా వట్టిపోవడం విమర్శల జోలికొస్తే… ఉచిత వరాల మీద చాలా లోతైన చర్చ జరగాలి… కేవలం కాంగ్రెస్ హామీల మీద కాదు… ఏ పార్టీ ఈ ఉచిత ప్రకటనలకు అతీతంగా ఉంది…? (నవీన్ పట్నాయక్ వంటి ఒకరిద్దరు నేతలు మినహా…) మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీయార్ ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా చేయలేదా..? ఖజానా ఆల్‌రెడీ వట్టిపోలేదా..? కొత్త అప్పులు తెస్తే, భూములు అమ్మితే తప్ప బండి నడవడం లేదు…అదేమంటే అప్పుల సద్వినియోగం అనే ఓ శుష్కవాదన మొదలెడతారు… చూస్తూ ఉండండి, ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి కేసీయార్ కొన్ని వరాలు ప్రకటిస్తాడు, ప్రకటించక తప్పదు, అది రాజకీయాల్లో ‘అత్యవసరంగా’ మారింది…
Ads
ఆరు గ్యారంటీలు… తప్పకుండా కాంగ్రెస్‌కు ఓ చివరి ఎన్నికల ఎత్తుగడ… కేసీయార్ దెబ్బకు, ఆయన కోవర్టుల కుట్రలతో కకావికలమైపోయిన కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే కూడదీసుకుంటోంది… నియంతృత్వం మరింత ముదరకుండా బీఆర్ఎస్‌కు కొంత గ్యాప్ అవసరమనీ, ఎలాగూ బీజేపీ జోష్ చట్టున చల్లారిపోయింది కాబట్టి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓసారి అవకాశమిస్తే తప్పేమిటనే వాదనల్లో బలం పెరిగింది ఈమధ్య… సరే, కాకపోతే ఆ పార్టీలోని అంతర్గత దుర్లక్షణాలే దానికి బలమైన బలహీనత కాబట్టి… అది దెబ్బతీయాల్సిందే తప్ప ఈ హామీల ప్రకటనలో తప్పులేదు… రాజకీయంగా కాంగ్రెస్‌కు మిగిలిన మార్గం కూడా…
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవి అమలు చేయడం లేదెందుకు అనే బీఆర్ఎస్ ముఖ్యులు లాజిక్ మరిచిపోతున్నట్టున్నారు… కర్నాటకలో ఇలాంటి హామీలే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చాయి… కష్టమైనా సరే, వాటిని అమలు చేయడానికి సిద్ధరామయ్య ప్రభుత్వం కష్టపడుతూనే ఉంది… ఐనా రాష్ట్రాన్ని బట్టి హామీలు ఉంటాయి… మరి ఫలానా రాష్ట్రంలో అమలు చేయడం లేదెందుకు అనేది డొల్ల వాదన అవుతుంది… తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిని బట్టి ఇవన్నీ అమలు చేయడం అసాధ్యం అనేవాళ్లూ ఉన్నారు… ఎలా చేస్తారో చూస్తే తప్పేమిటి..? ఏపీ ఆర్థిక దివాలా, ఆర్థిక ఎమర్జెన్సీ అనే తిట్లు, శాపనార్థాల నడుమ ఆ బండి నడుస్తూనే ఉంది కదా నిక్షేపంగా…
ఈ హామీల్లో కొన్ని కేసీయార్ అమలు చేస్తున్నవాటికే కాస్త పొడిగింపు, హెచ్చింపు… కానీ కొన్ని వోటర్లకు కనెక్టింగ్… పేదలకు 10 లక్షల ఆరోగ్య బీమా హామీ బాగుంది… పలు బాధిత సెక్షన్లకు ప్రతి నెలా 4 వేలు మంచి హామీయే గానీ అమలు తీరును పరిశీలించాల్సి ఉంటుంది… ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు అనేది ఆచరణలో సక్సెస్ కాకపోవచ్చు, అధికారం వచ్చినా ఆ దిశలో అడుగులూ పడకపోవచ్చు… విద్యా భరోసా హామీ కూడా అంతే…
మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు… కేసీయార్ నిజంగానే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఫ్లాప్… చివరకు తనే పథకాన్ని ఎత్తిపారేసి (అధికారికంగా చెప్పడు) సొంత జాగా ఉన్నోళ్లకు 5 లక్షలు అన్నాడు, అది 3 లక్షలకు కుదించాడు… ఇప్పుడు కాంగ్రెస్ 5 లక్షలు అంటోంది… పేదలకు ఇళ్లు అనేది తప్పులతడక పథకం… లోపరహిత పథకాన్ని కాంగ్రెస్ కూడా ఆలోచించలేకపోయింది… ఇక ప్రధానమైంది 200 యూనిట్ల వరకూ ఫ్రీ కరెంటు… నిజంగానే దీన్ని అమలు చేస్తే జనం ఇక కాంగ్రెస్‌ను మరిచిపోరు… దాదాపు 80 శాతానికి పైగా కుటుంబాలు లబ్దిపొందుతాయి… డిస్కమ్స్ దివాలా తీస్తాయనేది శుష్కవాదన… ఇప్పుడు అవేమైనా బాగున్నాయా..? ప్రభుత్వం తగిన నిధులిస్తే ఈ పథకం ఆచరణ సాధ్యమే…
వరి రైతులు ఎక్కువ కాబట్టి… వాళ్లకు 500 బోనస్ అంటున్నారు… రైతుకా..? ఎకరానికా..? క్వింటాల్‌కా..? క్లారిటీ లేదు… ఇప్పటికే ధాన్యం ఎక్కువై అమ్మకం కష్టాలు ఎదురవుతున్నయ్… కేంద్రం కొంటుందనే ఆశ ఓ భ్రమ… అపరాలు, నూనెగింజలకు ఈ హామీ వర్తింపజేస్తే బాగుండేది… అది అవసరం కూడా… రైతులకు ఇచ్చే పంటసాయాన్ని 15 వేలు చేయడం వోకే గానీ కౌలు రైతులకు వర్తింపజేస్తాననే హామీ విస్తరణ బాగుంది… భూమి లేని కూలీలకు, భూమిలేని నిరుపేదలకు 12 వేల సాయం ఆచరణలో క్లిష్టం…
అన్నింటికీ మించి 500కు సిలిండర్ అనేది అన్ని కుటుంబాలనూ ఆకర్షించేదే… ఇది మహిళల పథకమేమీ కాదు, సిలిండర్ మహిళలకు మాత్రమే ఉపయోగపడేది కాదు… దానికన్నా బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనేది వాళ్లను ఆకర్షించేది… కర్నాటకలో అమలవుతోంది కూడా… జీరో టికెట్లు ఇస్తారు… అసలు సమస్య ఏమిటంటే..? వీటిని జనం దాకా తీసుకుపోవడం… పత్రికల్లో ప్రకటనలు, ప్రెస్‌మీట్లలో వాగాడంబరంతో ఇవి జనానికి చేరవు… వార్డు స్థాయికీ సమావేశాల్ని పెట్టి కార్యకర్తలు ప్రచారానికి పూనుకుంటే తప్ప ఇవి జనంలోకి పోవు… నిజంగానే ఇవి కాంగ్రెస్‌ను గెలుపు తీరానికి చేరుస్తాయా..? ఒక పార్టీ ఓడటానికి, గెలవడానికి చాలా అంశాలు ఉంటయ్… అఫ్ కోర్స్, ఈ గ్యారంటీ కార్డులు మాత్రం ఆ దారిలో వెళ్లడానికి మంచి జోష్… ఈ దెబ్బకు బీజేపీ మరింత కుదేలవడం, బీఆర్ఎస్ తలపట్టుకోవడం కూడా గ్యారంటీ అన్నట్టే కనిపిస్తున్నయ్…
Share this Article