ఇవి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు… ఎజెండా ఏమిటో ఒక్క చిన్న అంశమూ బయటికి పొక్కడం లేదు… టాప్ సీక్రెసీ మెయింటెయిన్ చేస్తోంది మోడీ ప్రభుత్వం… సొంత పార్టీ వాళ్లకే ఏ సమాచారం లేదు… లీక్ కావద్దనే భావనతో కొందరు ముఖ్యులకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వడం లేదు… మొత్తం పీఎంఓ ఆర్గనైజ్ చేస్తోంది… దీంతో విపక్షాలు గింజుకుంటున్నాయి…
నోట్ల రద్దు సమయంలో ఏం జరిగిందో తెలుసు కదా… నరమానవుడికీ తెలియనివ్వలేదు… మోడీ ప్రెస్‌మీట్ చూశాకే ప్రజలందరితోపాటు ఆ పార్టీ ఎంపీలు, మంత్రులు తెలుసుకున్నారు… నోట్ల మార్పిడిలో అక్రమాలను, ఆ నిర్ణయాన్ని, అవకతవకల ఆచరణను తప్పుపడదాం, అదొక డిజాస్టర్ స్టోరీ… కానీ గోప్యతను మెయింటెయిన్ చేసిన తీరు మాత్రం సూపర్…
నిజమే… దేశరక్షణకు సంబంధించి, విదేశాంగ విధానాల గురించి… కీలకాంశాల్లో ప్రభుత్వం ఆలోచిస్తున్న తీరు గురించి ముందుగా బయటికి సమాచారం రావడం మంచిది కాదు… కానీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను రహస్యంగా ఉంచుతున్న తీరును తప్పుపట్టాల్సిన పనేమీ లేదు… బీఆర్ఎస్ సహా పలు పార్టీలు గింజుకుంటున్న తీరు వాళ్ల వ్యాఖ్యల్లో, పత్రిక ప్రకటనల్లో కనిపిస్తోంది…
Ads
తను ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాని కఠోర మేధావి, అత్యంత నిజాయితీపరుడు, కటిక పేద నాయకుడు కేకే కూడా మోడీ ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్యానికే మంచిది కాదు అంటున్నాడు… ఢిల్లీలోని కాకలు తీరిన పాత్రికేయులు సైతం జుత్తు పీక్కుంటున్నారు… అన్ని సోర్సులనూ వేధిస్తున్నారు… కానీ ఫలితం లేదు… అసలు పార్టీ వర్గాలకు సమాచారం ఉంటే కదా… లీక్ చేయడానికి…
దీంతో ఏం జరిగింది..? ఎవరికితోచిన ఊహాగానాల్ని వాళ్లు చేసేస్తున్నారు… కామన్ సివిల్ కోడ్ బిల్లు కావచ్చునని కొందరు, మహిళా బిల్లు అని మరికొందరు, జమిలి ఎన్నికలపై బిల్లు అని ఇంకొందరు రాసేస్తున్నారు… కొందరైతే ఏకంగా ముందస్తు ఎన్నికల దాకా వెళ్లిపోయారు… జస్ట్, తమ ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ మొదటిరోజు పార్లమెంటు ప్రస్థానంపై చర్చ అని మాత్రమే చెప్పింది…
మహిళా బిల్లు అయ్యే పక్షంలో ముందుగానే అందరికీ చెప్పి, ముందస్తు ప్రచారం కూడా చేసుకుని, పూర్తిగా తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కదా… బహుశా అది కాదేమో… జమిలి ఎన్నికల బిల్లు పెట్టే పక్షంలో కేవలం ఒక బిల్లు సరిపోదు… పైగా తనకు రాజ్యసభ వోట్లు సరిపోవు కాబట్టి సంయుక్త సమావేశం పెట్టాలి… అవీ ఆర్థిక సంబంధ బిల్లులైతేనే, విశేష సందర్భాలైతేనే ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఉంటాయి…
కామన్ సివిల్ కోడ్ బిల్లు పెట్టే పక్షంలో… దేశమంతా ఎన్నికల సందర్భంగా చర్చ జరగాలని బీజేపీ కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్లు జోలికి పోకపోవచ్చు… ఇలా ప్రతి బిల్లుకూ సాధ్యాసాధ్యాల పరిమితులు కనిపిస్తున్నాయి… పోనీ, పాక్ ఆక్రమిక కశ్మీర్‌ను దాని కబంధ హస్తాల నుంచి విముక్తం చేసే బిల్లా..? దానికి పార్లమెంటు ముందస్తు ఆమోదం పొందాల్సిన పనిలేదు… పైగా మన విపక్షాల తీరు తెలుసు కదా… పాకిస్థాన్ తలూపుతుందేమో గానీ మన విపక్షాలు సై అనవు… సరిహద్దుల్లో ఆ సన్నద్ధత కూడా ఏమీలేదు…
పోనీ, కులగణనకు సై అంటుందా..? దానికి ప్రత్యేక తీర్మానాలు, ఆమోదాలు అక్కర్లేదు… మరి ఏమై ఉండొచ్చు… అదే మరి… రామయణమంతా విన్నాక రావణుడికి మండోదరి ఏమవుతుందని అడిగినట్లుంది… మనం చెప్పుకుంటున్నది కేవలం గోప్యత గురించి మాత్రమే… ఢిల్లీ పాదుషాల కోటలు సమాచారాన్ని ఏమాత్రం బయటికి రానివ్వడం లేదు అని…!! చివరగా… అయ్యా కేకే… మోడీ ఏ బిల్లు పెట్టినా పార్లమెంటులోనే కదా… అన్ని పార్టీల ఎంపీలు చర్చిస్తారు కదా, అవసరమైతే వోటింగు ఉంటుంది కదా… అందరికీ కాపీలు ఇస్తారు కదా… మరి ఇందులో అప్రజాస్వామికం ఏముందబ్బా…!! అవునూ… కొంపదీసి హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబై, బెంగుళూరు నగరాల్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించరు కదా…!!!
Share this Article