నిన్ను ఆనాడు ఏమన్నా అంటినా తిరుపతీ… కాపోళ్ల ఇంటికాడ… తిన్నాతిరం పడతలే… బాధయితుందే నీ యాదిల మనసంతా… జిల్లేటమ్మా జిట్టా… ఫోటువ తీస్తున్నడే సీమదసరా సిన్నోడు… రెండేళ్లుగా ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ దుమ్మురేపుతున్నయ్…! నిజానికి ఇవన్నీ ఏనాటి నుంచో పాడబడుతున్న జానపదాలేమీ కావు… రీసెంటుగా తెలంగాణ రచయితలు రాస్తున్నవే, తెలంగాణ గాయకులు పాడుతున్నవే… తెలంగాణ క్రియేటివ్ గ్రూప్స్ డాన్సులు కంపోజ్ చేసి, షూట్ చేయించి, అప్ లోడ్ చేయిస్తున్నవే…
మొన్న చిరంజీవి సినిమా భోళాశంకర్ కావచ్చు… ‘దరువు మార్చండిరా’ అంటూ నర్సపెల్లే అనే ఓ తెలంగాణ బీట్‌లోకి వెళ్లిపోతాడు… ఇదేకాదు, ఇంకొన్ని సినిమాల్లోనూ తెలంగాణ స్లాంగ్ సాంగ్స్ పాపులరయ్యాయి… ఎందుకింత హఠాత్తుగా తెలంగాణ యాసను అందరూ ప్రేమిస్తున్నారనే చర్చలోకి ఇక్కడ వెళ్లడం లేదు… కానీ అచ్చమైన ప్రజల భాషలో అద్భుతమైన భావ వ్యక్తీకరణలు ఉంటున్నయ్…
తెర మీద ఓ నాగదుర్గ డాన్సాడుతూ కనిపించవచ్చు… (నిజం చెప్పాలంటే శ్రీలీలలు, సాయిపల్లవిలు కూడా ఈమె స్టెప్పుల ఎదుట వెలవెలా…) కానీ ఒక రచయిత, ఒక గాయని, ఒక డాన్సర్ల గ్రూపు, ఒక కొరియోగ్రాఫర్, ఒక కెమెరామ్యాన్… ఎందరి శ్రమో ఉంటుంది ఆ పాటల వెనుక… ఇంతకుముందు క్లబ్బులో, బార్లలో, హోటళ్లలో, షేరింగ్ ఆటోల్లో ఏవేవో పాటలు వినిపించేవి… ఇప్పుడు ఈ పాటలు మోగిపోతున్నాయి… డీజేల్లో మరీనూ…
Ads
రీల్స్, షార్ట్స్ మాత్రమే కాదు… చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా లేడీస్, పిల్లలు ఈ పాటలకు అభినయిస్తూ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు… గ్రూపులుగా, విడిగా… ఇప్పుడింత చెప్పుకోవడానికి ఓ కారణం ఉంది… నాగదుర్గ పాటల్లో బాగా ఫేమస్ జిల్లేలమ్మా జిట్టా పాట కూడా ఒకటి… ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ తీశారు… సీక్వెల్ అనేది సినిమాలకే కాదు, ఫోక్ సాంగ్స్‌కు కూడా ట్రెండే ఇప్పుడు… వీటికి ప్రమోషన్ ఫంక్షన్లు, పార్టీలు, ‘కవరే’జీ బాధలు గట్రా ఏమీ ఉండవు… సైలెంటుగా యూట్యూబ్‌కు ఎక్కించడమే…
ఈ రెండో పార్ట్‌లో రచయిత ఓ అమ్మాయి (ప్రేమికురాలు) భావనను భలే వ్యక్తీకరిస్తాడు… తన వెంట పడుతున్న పోరడిని తనూ ప్రేమిస్తుంది… వాడు నా పుట్ల పంట, నా చెలిమె ఊట అని మురిసిపోతూనే… ఒకవేళ వాడు సై అంటే తనేమ్ చేస్తుందో ధైర్యంగా చెప్పేస్తుంది… జస్ట్, ఏమే, ఏందే అని తన వెంట తిరిగితే చాలునట… ఏమయ్యో, ఏందయ్యో అని పిలుచుకుంటూ కట్టేసుకుంటుందట… తనే సాదుతుందట… (పోషించడం)… ‘‘ఎట్టాగైనా వాణ్ని ఏలుకుంట, నేనే వాణ్ని సాదుకుంట’’ అని తలెగరేసి చెబుతుంది…
బాగుంది… నాకు నచ్చినోడు నాకు దొరకాలే గానీ, వాడు నన్ను పోషించేదేముంది..? ఎలాగోలా తిప్పలుపడి నేను సాదుతా అనేది కొత్తగా, లైవ్‌లీగా ఉండి… వినగానే మన పెదాల మీదకు ఓ చిరునవ్వును తీసుకొస్తుంది… తెలంగాణ యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ ఎందుకు హిట్టవుతున్నాయి అనే ప్రశ్నకు… ఇదుగో ఇదీ ఓ కారణమే… రాసినవారెవ్వరో, పాడినవారెవ్వరో అభినందనీయులు…
Share this Article