ముందుగా ఓ కథ చదువుదాం… ఐఏఎస్ అంటే అయ్యా ఎస్ అంటూ మంత్రులకి ఊడిగం చేసే స్థాయికి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఓ ఐఏఎస్ అధికారి కోర్టు తనకి అప్పగించిన పని పూర్తిచేయడం కోసం రాత్రంతా స్మశానంలో గడిపిన ఘటన తమిళనాడులో జరిగింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 1999 లో ఓ గ్రానైట్ కంపెనీ యజమాని తన వ్యాపారం ఎదగడం కోసం నలుగురు మనుషులని బలి ఇచ్చాడనే ఆరోపణలు వచ్చాయి.
మధురైకి చెందిన ఆ గ్రానైట్ వ్యాపారి ఓ బాలిక సహా ముగ్గురు వ్యక్తుల్ని నరబలి ఇచ్చాడనే కేసును తమిళనాడు హైకోర్టు విచారిస్తోంది. ఈ కేసుపై లీగల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి సగాయంని కోర్టు నియమించింది. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాల కోసం సగాయం మధురై వెళ్ళారు. బలి అయిన వారి శవాలను పూడ్చి పెట్టిన స్మశానానికి చేరుకున్న ఆయన అక్కడ తవ్వకాలు పూర్తయ్యేవరకు రాత్రంతా స్మశానంలోనే పడుకున్నారు.
రెవెన్యూ పోలీసులు ఎంత బ్రతిమిలాడినా వినకుండా, సాక్ష్యాలు కాపాడటం కోసం శనివారం రాత్రంతా స్మశానంలోనే గడిపారు. అస్తిపంజరాలను బయటకు తీసి ఫోరెన్సిక్ లాబ్ కు తరలించిన తర్వాత కానీ ఆయన స్మశానం నుండి కదల్లేదట. ఈ ఐఏఎస్ అధికారి స్మశానంలో పడుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపించాయి.
Ads
చాలామంది యువత సగాయం లాంటి వ్యక్తి తమిళనాడుకు ముఖ్యమంత్రి అయి అవినీతిని అరికట్టాలని ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సగాయం (తెలుగులో సహాయం)… తమిళనాడులో పెద్ద సెలెబ్రిటి అయిపోయారు. వృత్తిపట్ల అంతులేని నిబద్దత చూపిన సగాయంను మనమూ అభినందిద్దాం… గతంలో కూడా ఓసారి చదివినట్టు గుర్తుంది… ఓ మిత్రుడి ఫేస్‌బుక్ వాల్ మీద కనిపించింది మళ్లీ… గుడ్… అయితే తరువాత ఏమిటి..? సగాయం ఏమయ్యాడు..? ఈ వివరాల కోసం ట్రై చేస్తే…
తను 27 ఏళ్లలో 25 బదిలీలను పొందాడు… ఏ పోస్టులో ఉన్నాసరే అవినీతిపరులు, అక్రమార్కుల తాటతీసేవాడు… నిజాయితీకి మరోపేరుగా నిలిచాడు… అక్రమార్కులకు టెర్రర్… తనేమీ స్ట్రెయిట్ ఐఏఎస్ కాదు, కన్‌ఫర్‌డ్ ఐఏఎస్… తరువాత కొన్నేళ్లకు ఈ అధికార హోదాలతో వ్యవస్థలో మార్పు రాదని తేల్చేసుకున్నాడు… తెలుసుకున్నాడు… స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నాడు…
పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యాడు… మన దేశంలో అల్టిమేట్ అధికారం రాజకీయ నాయకులదే… పార్టీలదే… ఓ రెండు చిన్న పార్టీలతో కూటమి కట్టాడు… తిరిగాడు, ప్రచారం చేశాడు… తన నినాదం ఏమిటంటే… మనం కులాల్ని, మతాల్ని నిర్మూలించడమే కాదు, అవినీతిని కూడా నిర్మూలించాలి… కానీ ఏం జరిగింది..? భలేవారే… ఏళ్ల తరబడీ దీక్ష చేసిన ఇరోం షర్మిలకు ఎన్ని వోట్లు వచ్చాయో తెలుసు కదా…
వ్యక్తిగత నిజాయితీలు వేరు, ఎన్నికల పాలిటిక్స్ వేరు… రెండూ ఒకటి కావు… కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాడు, పంజాబ్‌కు ప్రాక్సీ ముఖ్యమంత్రి అయ్యాడు… కానీ అన్నాహజారే అక్కడే ఉండిపోయాడు… జేడీ లక్ష్మినారాయణ, జయప్రకాష్ నారాయణ వంటి బాగా ప్రచారం పొందిన వ్యక్తులు చివరకు ఎలా మిగిలారు..? సగాయం విషయంలోనూ అదే జరిగింది… ప్రస్తుతం సగాయం గురించి తలుచుకున్నవారే లేరు… సహజం… ఉండరు…!!
Share this Article