Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ సమైక్య ఎడిటర్ ఇంట్లో పెళ్లా..? పిచ్చ లైట్ తీసుకున్న సీఎం కేసీయార్…

September 19, 2023 by M S R

ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూస్తుంటే బీడీ కట్ట కోసం , ప్లేట్ ఇడ్లీ కోసం ఎవరో ఒక్కరిపై ఆధారపడే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కెసిఆర్ కాదు మేమే … మేం లేకపోతే కెసిఆర్ ఎక్కడ అంటూ బోలెడు మాట్లాడుతున్నారు . ఆ వీడియోలు చూస్తుంటే అలాంటి దృశ్యాన్ని మరికొందరు జర్నలిస్ట్ మిత్రులతో కలిసి నేరుగా చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది .

*************

2014 లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాత సచివాలయానికి రోజూ వచ్చే వారు . భూమి ఎడిటర్ శాస్త్రి ఇంట్లో పెళ్లికి పిలవడానికి ఎడిటర్ , జర్నలిస్ట్ మిత్రుడు వెల్జాల చంద్రశేఖర్ , మరో ఇద్దరితో కలిసి వెళ్లాం . దాదాపు మూడు గంటలు వేచి చూసినా పిలుపు రాలేదు .

Ads

గతంలో ఛానల్స్ నాయకుడితో ఒకరోజు , నటులతో ఒకరోజు అని ఎన్నికల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చూపేవారు . యూట్యూబ్ ఛానల్స్ పెరిగాక వీధి రౌడీతో ఒకరోజు అని డబ్బులిస్తే చేసే కార్యక్రమాలు కూడా వస్తున్నాయి అవి వేరు . ఓనర్ తో , ఎడిటర్ తో ఒకరోజు అనే కార్యక్రమం రిపోర్టర్లకు అగ్ని పరీక్ష లాంటిదే . తేడా వస్తే ఉద్యోగాలకే ప్రమాదం .

old secretriat

టంకశాల అశోక్ ఎడిటర్ గా జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన అంశాలు , వేటిపైన వార్తలు రాయవచ్చునో రిపోర్టర్లతో మాట్లాడేవారు . అలానే ఆంధ్రప్రభలో గతంలో ఓ ఎడిటర్ ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి రిపోర్టర్ ని ఓ గుడి పూజారి పేరు అడిగితే చెప్పలేదు , ఎడిటర్ గుడికి వెళితే పూర్ణకుంభ స్వాగతం పలకక పోవడంతో నువ్వేం రిపోర్టరువు అని చెడామడా తిట్టాడు . ఆ మీడియా ఈ మీడియా అని కాదు అన్ని చోట్ల బాస్ తో ఒకరోజు అంటే అది గండమే .

ఎడిటర్ ఇంట్లో పెళ్లి , తెలంగాణ సీఎంను పిలవడానికి కాబట్టి ఎడిటర్ తొలిసారిగా నన్ను వెంట తీసుకువెళ్లాడు . మూడు గంటలైనా లోనికి పిలుపు లేకపోవడంతో ఒకవైపు నేనూ , జర్నలిస్ట్ మిత్రుడు వెల్జాల చంద్రశేఖర్ బాధపడుతున్నట్టు నటిస్తూ , మరోవైపు సంతోష పడుతున్నాం . సంతోషానికి కారణం మా ఇద్దరికే తెలుసు . అక్కడి సిబ్బంది పరిచయం ఉండడం వల్ల కలిస్తే, ప్రపంచ బ్యాంకు అధికారులు బయటకు రాగానే మీరు లోనికి దూసుకు వెళ్ళండి అని సలహా . అలానే చేశాం . సీఎం పెళ్లి కార్డు తీసుకోని నాకేమీ పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా మాములుగా అందరితో మాట్లాడి పంపించారు . ఎడిటర్ సమైక్య రాతలు, తెలంగాణ వ్యతిరేక రాతలు , తెలబాన్లు అని రాసిన చిల్లర మాటలు అన్నీ కెసిఆర్ చదివారు , గుర్తుంది . ఎడిటర్ మాత్రం అవి గుర్తు లేవేమో అనుకున్నారు .

**********

హమ్మయ్య గండం గడిచింది . ఎడిటర్ తో ఒకరోజు ఎలాంటి ప్రమాదం లేకుండా గడిచింది అని బయటకు వచ్చాక … రమణాచారి ఇక్కడే ఉన్నారు కదా ఫోన్ చెయ్ వెళదాం అని ఎడిటర్ అన్నారు… ఫోన్ చేసి, బుద్దా మురళి అని చెప్పాను. అప్పుడు ఆంధ్రభూమి ఆదివారంలో వారం వారం రాస్తున్న ధనం – మూలంలో ఎక్కెడెక్కడి వారి గురించో భలే రాస్తున్నావు అని మాట్లాడుతున్నారు ఆయన .. ఇక నా పని ఐపోయింది అనుకున్నాను . ఎడిటర్ తో పాటు వెళ్లి రమణాచారి ఛాంబర్ లో కూర్చున్నాక ధనం – మూలం కాలం గురించే అలానే మాట్లాడారు . ప్రమాదం తప్పదు అని నిర్ణయించుకున్నాను .

********

ఉదయం నుంచి సాయంత్రం వరకు తినక పోవడం ఒకటి . సంతోషాన్ని పంచుకోవడం ఒకటి. దారిలో సికింద్రాబద్ తాజ్ మహల్ హోటల్ లో తిన్నాం . సంతోషానికి కారణం ఏమంటే ఎడిటర్ తో సీఎంను కలిసినప్పుడు నాకూ , మిత్రుడు చంద్రశేఖర్ కు ఎక్కువ గౌరవం ఇచ్చి ఉంటే, తెల్లారి నుంచి ఎడిటర్ పైరవీ పనులు , అయన రాసిన పుస్తకాలు అమ్మించే పనులు అప్పగిస్తారని భయపడ్డాం .. సీఎం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం , మూడు గంటలు వేచి ఉండాల్సి రావడంతో ఎడిటర్ మాపై ఆశలు వదులుకొని ఆంధ్రపై దృష్టి సారించాడు .

****

సికింద్రాబాద్ తాజ్ మహల్ హోటల్ కు మరో ఇద్దరు జర్నలిస్టులతో కలిసి వచ్చేసరికి, హోటల్ కౌంటర్ దగ్గర ఓ వ్యక్తి హోటల్ యజమానితో కెసిఆర్ ను నడిపించేది నేను , ఇప్పుడు ఇక్కడికి పిలిపించమంటావా ?అని ఏదో మాట్లాడుతున్నాడు . ఇప్పుడు రెన్నొవేషన్ చేశారు . అంతకు ముందు సికింద్రాబాద్ పాత తరానికి చెందిన వారు అక్కడ కబుర్లు చెప్పుకొంటూ ఉండేవారు .

బీడీ కట్టలకు కూడా ఇతరులపై ఆధారపడే వ్యక్తిలా ఉన్నాడు . మహా ఐతే హోటల్ యజమాని అతనికి ఓ ప్లేట్ ఇడ్లీ ఉచితంగా ఇస్తాడేమో , తెలంగాణ ఉద్యమాన్ని తానే నడిపినట్టు , కెసిఆర్ ను తానే నడుపుతున్నట్టు తెగ కబుర్లు చెబుతున్నాడు . ఎడిటర్ తో కలిసి వెళ్లి మూడు గంటలు నిలబడి, కష్టంగా కలిసిన మేం ఆ మాటలు వింటూ నవ్వుకున్నాం . అప్పుడు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉంటే అతన్ని ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళు . ఇప్పుడు ఇలాంటి వారి ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో చాలా కనిపిస్తున్నాయి .

*****

ఆ రోజు ప్రమాదం ఏమీ ముంచుకు రాలేదు . మూడు నాలుగు రోజులు గడిచిన తరువాత ఎడిటర్ పిలిచి ధనం – మూలం కాలం చాలా రోజుల నుంచి రాస్తున్నావు కదా ? ఇక చాలు ఆపేయ్ అన్నారు . ఈ సంగతి నేను ఆ రోజే అనుకున్నాను అని మనసులోనే చెప్పుకున్నాను . అబ్దుల్ అని సినిమా రిపోర్టర్ సినిమా సమీక్షకు నంది అవార్డు వచ్చింది . జాగ్రత్త అని ముందే చెప్పాను . ఉత్సాహంగా ఎడిటర్ కు యెగిరి గంతేసి చెప్పాడు . ఆ మరుసటి రోజు నుంచి సినిమా రిపోర్టింగ్ నుంచి తొలగించి ఆదిలాబాద్ మఫిసిల్ డెస్క్ లో చేయమని చెప్పారు అట్లుంటుంది ఎడిటర్స్ తో … – బుద్దామురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions