జయా బచ్చన్… అమితాబ్ బచ్చన్ భార్య… వయస్సు 75 ఏళ్లు… ఆమె పార్లమెంటులో వృద్ధులు, అనగా సీనియర్ సిటిజెన్స్ సమస్యలను ప్రస్తావించి, కొన్ని మంచి పాయింట్లను లేవనెత్తిందనీ, ప్రభుత్వాన్ని ఏకిపారేసిందనీ ఓ పోస్టు వాట్సపులో చక్కర్లు కొడుతోంది… బహుశా ఆమె ప్రసంగ సారాంశం కాకపోవచ్చు… ఏమో కావచ్చు కూడా… కానీ ఏ మీడియాలోనూ కవరైనట్టు కనిపించలేదు… పోనీ, ఆమె చాలా సీనియర్ సిటిజెన్ కదా, సెలబ్రిటీ కదా, హైప్రొఫైల్ లేడీ కదా… మాట్లాడిందనే అనుకుందాం కాసేపు… అవి చెప్పుకుందాం… బికాజ్, కొన్ని మంచి పాయింట్లున్నయ్…
‘‘చంపేయండి సార్… సీనియర్ సిటిజెన్లందరినీ చంపేయండి… 65 ఏళ్లు దాటిన వృద్ధుల గురించి ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవడం లేదు… సీనియర్ సిటిజెన్స్ అంటే నేషన్ బిల్డర్స్… సీనియర్ సిటిజెన్‌గా బతకడం నేరమా సర్…
70 ఏళ్లు దాటితే వృద్ధులకు మెడికల్ ఇన్స్యూరెన్స ఉండదు… వాయిదాల పద్ధతిలో లోన్లు దొరకవు, ఇవ్వరు… డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు… అంతెందుకు, ఓ వయస్సు దాటితే ఎవరూ పని కూడా ఇవ్వడం లేదు… దాంతో తప్పనిసరిగా ఇతర సంపాదనపరుల మీద ఆధారపడాల్సి వస్తోంది… కానీ మేం అన్ని రకాల పన్నులూ కట్టాలి…
Ads
60-65 ఏళ్ల దాకా ఇన్స్యూరెన్స్ ప్రీమియాలు కూడా కట్టాలి… ఒక్కటి… కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ పథకం మమ్మల్ని ఆదుకునే దిశలో ఉందా చెప్పండి… రైళ్లలో 50 శాతం డిస్కౌంట్ అమలయ్యేది మొన్నటిదాకా… ఇప్పుడు అదీ ఎత్తిపారేశారు… కానీ రాజకీయాల్లో మాత్రం ఎంచక్కా ఎంత వయస్సొచ్చినా సరే కొనసాగొచ్చు, అన్నిరకాల ప్రభుత్వ సాయాలు పొందవచ్చు… ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు… పెన్షన్లతో సహా అన్నీ స్వీకరించవచ్చు… కానీ సగటు వృద్ధులకు మాత్రం ఏమీ ఇవ్వరు…
కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగతా వృద్ధులకు ప్రభుత్వ సౌకర్యాలు, పథకాలు, రాయితీలు ఎందుకు దక్కడం లేదో, ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదో నాకు అర్థం కావడం లేదు… వృద్ధుల పిల్లలు వాళ్లను పట్టించుకోవడం మానేస్తే వాళ్లు ఎక్కడికి పోవాలి..? ఒకవేళ వయస్సులో పెద్దలందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి ఎంత నష్టమో ఒక్కసారి ఊహించండి… అలాంటి పరిణామాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా..?
సీనియర్ సిటిజెన్స్‌ను తక్కువగా అంచనా వేయడం దేనికి..? వాళ్లు సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటే, తలుచుకుంటే ప్రభుత్వాల్ని మార్చేయగలరు… నిర్లక్ష్యంగా తీసిపారేయకండి… వాళ్లను బలహీనులుగా అంచనా వేయొద్దు… చాలా ఏళ్లుగా వాళ్లు ఈ సొసైటీని, ఈ ప్రభుత్వాల్ని గమనిస్తూనే ఉన్నారు… వృద్ధుల సంక్షేమానికి నిజానికి చాలా పథకాలు అవసరం… వేల కోట్లతో బోలెడు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటారు కదా… అందులో వృద్ధులకు భరోసాగా నిలిచేవి ఎన్ని..?
బ్యాంకులు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి… అదీ రిటైర్డ్ వాళ్లకు, సీనియర్ సిటిజెన్లకు నష్టం కలిగిస్తోంది… కొందరికి కొంతమేరకు పెన్షన్స్ వస్తూ ఉండవచ్చుగాక, కానీ అందరికీ కాదుగా… పైగా అవీ ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తాయి… సో, ప్రభుత్వం ఈ సౌకర్యాల్ని సీరియస్‌గా ఆలోచించాలి…
- 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వాలి… ఆ పెన్షన్లను వాళ్ల స్థాయిని బట్టి ఖరారు చేయాలి…
- రైళ్లు, బస్సులు, ఎయిర్ ట్రావెల్స్ రాయితీల్ని వెంటనే పునరుద్ధరించాలి…
- మరణం వరకూ అమలయ్యే బీమా పథకాలు ప్రవేశపెట్టి, ప్రీమియం ప్రభుత్వం భరించాలి…
- కోర్టుల్లో సీనియర్ సిటిజెన్ల కేసులకు ప్రయారిటీ ఇవ్వాలి… వేగంగా తీర్పులు ఇవ్వాలి…
- సీనియర్ సిటిజెన్ల ఆశ్రమాల్ని (హోమ్స్) అన్ని సౌకర్యాలతో విరివిగా ఏర్పాటు చేయాలి…
- 10-15 ఏళ్ల కార్లను నిషేధించే నిర్ణయాన్ని ప్రభుత్వం వాపస్ తీసుకోవాలి… వాణిజ్య వాహనాలకు వర్తింపచేసుకొండి…
- మా కార్లను రుణాలు తీసుకుని, పొదుపు డబ్బులు ఖర్చుపెట్టి కొన్నాం… పదేళ్లలో 40, 50 వేలు కూడా తిరగనివి ఎన్నో… అంటే దాదాపు కొత్తవే… వాటిని నిషేధిస్తే, అవి తీసుకుని కొత్తవి ఇవ్వండి మాకు…
- చివరగా… సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటున్నారు కదా… ఆ సబ్‌లో మేం ఎందుకు లేం..? ఎందుకు ఉండం..? ఎందుకు..?
Share this Article