కలల సీతాకోకచిలకల వెంట…
Mohan’s preface to Cartoon Kaburlu
———————————————————-
“నేను చాలా స్పెషల్. వ్వెరీ వ్వెరీ డిఫరెంట్. నా దారే వేరు. నా లైనే కొత్త. నేనెప్పుడూ అంతే. నే చెప్పేదే గొప్ప” అని మీ గురించి మీరెలా అనుకుంటున్నారో, నా గురించి నేనూ అలాగే చెప్దామనుకున్నా. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలాగో ఈ గొప్పతనం నిరూపిద్దామంటే ఒక్కగానొక్క ఎలిబీ అయినా దొరికిచావదే. మరి నేను రాశాను.. మీరు చదవండి అని సిగ్గులేకుండా చెప్పడమెలా? ఎవడన్నా ఏదన్నా రాశాడంటే వాడికేదో ఎక్స్ట్రా తెలుసుననే గదా. ఎవడన్నా దాన్ని చదువుతున్నాడంటే వాడికెంతోకొంత తెలీనట్టేగదా. కానీ ఇక్కడ కేసు రివర్స్. నాకు తెలీక రాశాను. ఆ సంగతి తెలుసుకుని చదవండి. నేను అనేక విషయాలు తెలుసుకోలేదు. ఎన్నో అర్థం కాలేదు. మీకూ నాలాగే చాలా తెలీలేదనీ, అర్థం గాలేదనీ అనుమానం గానూ, ప్రగాఢ విశ్వాసం గానూ ఉంది. అందుకని మనం జోగీజోగీ రాసుకుందామంటున్నా. అందని ఆ పంచరంగుల సీతాకోకచిలకల వెంట దశాబ్దాల పరుగులు.
ఆ రూపం, రంగూ, గీత, వెలుగూ ఇంకా అలా పరిగెత్తిస్తూనే ఉన్నాయి. దారి పొడుగునా డిజప్పాయింట్మెంట్లే. ఒక్కోసారి ఏడుపు. ఎప్పుడూ ఆయాసమే. సుఖం లేని పరుగు. బాధ. ఎందుకదంతా అంటే నాకేం తెల్సు!
అందుకే తెలీక రాయడం (ఇది మోడెస్టీ సంబంధిత బడాయి కాదు. ఇది వ్యక్తిగత మనోవైకల్యం కాదు. ఆర్టిస్టులందరికీ వున్న చిక్కే)
ఫలానాది కళ, ఫలాని కళ కాదు అని తెలీకముందే అందులో దూకి ఈత కొడతాం. ఇదిగో ఈ సిద్ధాంతం మంచిది, ఈ పార్టీ ప్రజలకి మేలు చేస్తుంది అనుకోడానికి ఏ సిద్ధాంతాలూ, గ్రంథాలూ చదవకముందే కాసిని పాటలు వినీ, నాలుగు కరపత్రాలు చదివీ ఉద్రేకపడిపోడం లేదూ. ఆ పార్టీ జెండాలు అతికించేసీ, ఊరేగింపుల కెళ్ళిపోయీ వాడు జిందాబాద్, వీడు డౌన్ డౌన్ అనీ నినాదాలిచ్చేడం లేదూ. ఇదీ అంతే.
ఆర్టు పార్టీలో చేరాం. ఈ పార్టీలోనే చావాలి. పైగా మరో పనేదీ చాతగాదు. ఆర్ట్ ఒక్కటే చేయగలం. అలాగని ఆర్ట్ అంతా చేతికి రాదు. ఇది నరకం. యమ యాతన. పగవాడిక్కూడా వద్దనుకునే ఈ హింసలు పడ్డవాళ్ళ లిస్టు చాల పెద్దది. ఒక్కో యుగంలో, ఒక్కో శతాబ్దంలో ఈ మనుషులకి డావిన్సీ అనీ, హోకుసాయ్ అనీ, గాగిన్ అని గానీ, చిత్తప్రసాద్ అని గానీ పేర్లు మారుతుంటాయి. పెద్దచిన్నా, పొట్టి పొడుగూ తేడాలుంటాయిగానీ బాధలు మామూలు. గింజుకోవటం కామన్. ఎవ్వడికీ ఎన్నడూ సుఖం లేదనేది స్స్టాంపేసీసి రాసివ్వొచ్చు. ఈ కలల సీతాకోకచిలకల వెంట పరుగూ, ఈ మనుషుల వెంట పరుగూ ఒకలాగే ఉంటుంది.
ఎంతో ఆసక్తి, మరెంతో ఆయాసం. రండి. వాళ్ల వెంట పడండి. మీ సుదీర్ఘమైన డిజప్పాయింట్మెంట్ కి ద్వారాలు తెరుస్తున్నా. ఈ ట్రాజడీ అనంతమని మీకు ఖాయంగా తెలిసేచోటికి తీసుకెళ్తున్నా. మీకు ఎన్నటికీ ఏదీ తెలీదని గ్యారంటీగా అర్థమయ్యే చోటు… ఇదిగో చాల దగ్గరికొచ్చేసింది. కమాన్. హర్రిఅప్!
కళ కాలమ్ రాయమని పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారు అడిగినపుడు ‘నేను రాయడవేటి నా బొంద’ అనుకున్నా. కానీ ఏదో ఒకటి రాస్తే దానిపైన పంచరంగుల పెయింటింగులు అచ్చు వేయడానికి వీక్లీ కలర్ పేజీలు పరుచుకుని ఉన్నాయి. నా ఆల్బమ్ నుంచి మైఖేల్ రూబెల్ బొమ్మ తీసిస్తే ఫుల్ పేజీ అచ్చయిపోతుంది. పక్కన నాలుగు వాక్యాలు గిలికితే చాలు, అతి ఖరీదైన స్కాన్న్డ్ పాజిటివ్ లలో క్లాసికల్ పెయింటింగ్‌లు రికార్డుగా మిగులుతాయి. సొంతగా ఈ పని చేయాలంటే నేను జమీందారునై ఉండాలి. కనక ఆ కలెక్షన్ కోసం ముందు అభిమాన చిత్రాల్లాటివి తీసి వాటి గురించి దాదాపు కేప్షన్ల లాగా ఏదో రాయడం మొదలెట్టా. అందుకే ఈ రాతల్లో ఒక వరసా, వాయీ ఉండవు. వో పథకం ప్రకారం రాసినవీ కావు. ప్రముఖ విదేశీ, స్వదేశీ చిత్రకారులను పాఠకులకు పరిచయం చేయుట – అనే ఉద్దేశం ఇందులో ఉండదు. ఇది చిత్రకళా విమర్శ కూడా కాదు. బొమ్మలు గీయడం ఎలా అనే పాఠాలూ కావివి. సాహితీ, కళా విలువలున్న రచనా వ్యాసంగమా అంటే అదీకాదు. ఆర్ట్ అనీ, ఆర్టిస్టులనీ రొజూ మా గుంపు మాట్లాడుకొనేవీ, పుస్తకాలు తిరగేసేవీ, పోట్లాడుకునేవీ చాలా ఉన్నాయి.
వొన్ బై టూ చాయ్ ల దగ్గర మా కబుర్ల
తతంగంలో చిన్నచిన్న సంగతులివి.
తెలుగులో వో కవికో, రచయితకో సరదా పుడితే, కోపం వస్తే, అసూయ అనిపిస్తే అర్జెంట్ గా ఆరు కాలాలు రాసే వీలుంది. అదంతా అచ్చేయడానికి దినపత్రికలు సాహిత్య పేజీల్ని వారం వారం పరుస్తాయి. కవులకి నోరూ ఎక్కువ. వాళ్ల వేదికా పెద్దది. చిత్రకళకి వేదికా లేదు, మా ఆర్టిస్టులకు నోరూ లేదు. తెలుగులో అరసం అనీ, విరసం అనీ నవల, కథ, కవిత, వచన, మాత్రా, మినీ, మెగా మెథడాలజీల గురించి యుద్ధాలు సాగిన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈరకంగా మేం చరిత్రహీనులం. చిత్రకళా విమర్శ అనేది సాహితీ విమర్శతో పాటు కలిసి ఎదగలేదు. తెలుగు సాహిత్య పత్రికల్లో ఇరకడానికి దీనికి సందే లేదు. మేం మరింత మూగవాళ్ళమై గిడసబారిపోయాం. తెలుగు సాహిత్యామతల్లి (ఇలా అనొచ్చా) కి నోరూ చెవులే తప్ప కళ్ళు లేకుండాపోయాయి. స్వతంత్రం కోసం పోరాటం జరిగినపుడు, ప్రబంధ కాలం నుండి అభ్యుదయ సాహిత్య వుద్యమంలోకీ, విప్లవ సాహిత్య వుద్యమంలోకీ తెలుగు సాహిత్యం పరుగులు పెట్టిన డ్రామాలోనూ మేం లేం. ఉంటే పళ్లెమో, బల్లెమో పట్టుకున్న ఎక్స్‌ట్రాల మాదిరి స్టేజీకి వో మూల నక్కి ఉన్నాం. అంతే. మాకు హీరో రోల్ ఇవ్వలేదని అలగటం కాదు. మూగవాళ్ళకి ముప్ఫై శాతం రిజర్వేషన్ రావాలని డిమాండూ కాదు. ఇది తెలుగు సాహితీ రంగానికే అంధత్వాన్ని తెచ్చి పెట్టిందని బెంగ. యూరప్, చైనా, జపాన్ లలో ఇలా జరగలేదు. అక్కడ కవితా, పెయింటింగ్ ఎక్కడ ఏది మొదలవుతుందో, ఎక్కడ ఏది ముగుస్తుందో తెలీనంతగా అల్లుకు పెరిగిపోయాయి. ఇక్కడ దేనికదే. అనన్య సామాన్యమైన వల్గర్ సర్క్యులేషన్ గల డాలీ, పికాసో లాంటి పేర్లు తెలుగు కవితల్లో అడపాదడపా దొర్లటం తప్ప (అదికూడా నల్ల బానిసలు తెల్ల పేర్లను ఫ్యాన్సీగా చెప్పడం మాదిరే) మన సాహిత్యం అవిటిదానిలాగే మిగిలిపోయింది.
ఇలాంటి లోపం పూరించడానికే ఈ మహద్గ్రంథ రచన చేసింది – అని కారణజన్ముడి లాగా చెప్పడం లేదు. కళకీ, సాహిత్యానికీ ఎట్లాంటి సంబంధమూ లేని, పైగా ఆమడదూరంలో గల మురికి జర్నలిజంలో ఉంటూ కడుపు చింపుకుంటే కాళ్ల మీద పడే కార్టూన్లు గీస్తూపోయే కొందరి మూగబాలుర బాధల్లో కొన్ని ముక్కలు పేర్చే ప్రయత్నమిది. మాలో శిల్పులూ, ఈజిల్ పెయింటర్స్, వుడ్ కటర్స్, ఎచ్చింగ్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. వాళ్ల గురించీ ఇందులో ఏమీ ఉండదు. దశాబ్దాలుగా న్యూస్‌ప్రింట్ కి అతుక్కున్న మూగబల్లుల రొదలో కొంత మీకు వినిపిస్తుంది అంతే. ఇది చాలావరకూ జర్నలిస్టిక్ రిపోర్టింగ్. మధ్యమధ్యలో అజ్ఞానానికి సంబంధించిన ప్రెజుడిస్, బడాయి స్పష్టంగా ఉంటాయి. పరమ చిలిపీ మరియు వెకిలితనానికీ లోటే లేదు. ఇందులో అభిప్రాయాలేవీ నిశ్చితమైనవనీ, అనుల్లంఘనీయాలనీ అనుకోడం లేదు. ఇది పార్టీ మేనిఫెస్టో కాదు గనుక, ఫలానాది అలా రాశావేంటి, ఇలా రాయాలి గదా అని పెద్దలెవరన్నా అంటే ఇమ్మీడియట్ గా ఒపీనియన్ చేంజ్ చేసేసి ఇదే కరెక్టు అని ఏకీభవించేసెయ్యడానికి సిద్ధం. ఇంతకీ విషయం ఇదే రైటు, ఇది రాంగు అనేది కాదు. ఆర్టు విషయం అర్థం చేసుకోడానికి కాదు… ఫీలవడానికి.
మేం ఫీలవడానికీ, ఎక్సైట్ అయిపోడానికీ, బెంగపడిపోడానికీ కనిపించిన వాటిగురించి రాయడానికి అనుకోకుండానే ప్రయత్నించాను. ఇదంతా బోధించుటకూ, మేల్కొల్పుటకూ కానేకాదు. వివరాలూ, సమాచారం చెప్పడానికే కాదు. చిత్రకారుల వ్యక్తిగత జీవితాలను మిస్టరీలుగా మార్చి, వాళ్ల ప్రవర్తనను విడ్డూరం చేసి మామూలు మిడిల్ క్లాస్ మనుషుల్ని షాక్ చేసే జానపద గాధావళి చాలా వుంది. వాంగో చేయి కాల్చుకోటం, చెవి కోసుకోడం, పికాసో పెళ్లాల లిస్టూ ఈ కోవకి చెందినవే. బతకాలనుకోవడానికీ, బొమ్మలేయాలనుకోడానికీ మధ్య గొడవ వచ్చినపుడు మహామహా మాస్టర్ ఆర్టిస్టులకీ, మాలాటి చిన్నాచితకా వాళ్లకీ ఒకటే రకం చిక్కులొచ్చాయి. వాళ్ళెలా వాటినుంచి బైటపడ్డారో, వోడిపోయారో, గెలిచారో అన్నది ఆర్టిస్టులుగా మాకు చాలా ప్రధానమయింది. వాళ్ల బొమ్మలూ, బతుకులే మాకు గైడ్. వాటిని వెతకటమే పని అయింది. పనిలోపనిగా కొన్ని కొంచెం కొంచెమే రాసి పరిచయం చేయడమయింది. దీని ఉద్దేశం ఆయా ఆర్టిస్టుల బొమ్మలు మరిన్ని పుస్తకాల్లో మీరు చూడడం అలవాటు చేసుకుంటారనీ, వాళ్ల గురించి మరిన్ని పుస్తకాలు చదవాలనీ, వాళ్ల ‘ఆర్ట్ టెంపర్’ను మీరు అందుకోవాలనీ. కథలూ, కార్టూన్లూ అచ్చయ్యే వీక్లీ పేజీల్లో చిత్రకళా విమర్శ, చరిత్ర లాటి బరువైన పదార్థం ఇమడదు గనక మీకీ ఆర్ట్ టెంపర్ పరిచయం చేయడం నాన్ సీరియస్ తరహాలో ఉంటుంది
గనుక క్షమించాలి. అయినా విషయం విషయమే.
ఉదయం పేపర్లో యూనియన్ గొడవల మధ్య, రోజువారీ హడావుడిలో ఎన్నో రాద్దామనుకున్నవి రాయలేకపోయా. రాంభట్ల, ఆర్ ఎస్ నాయుడు గారి కార్టూన్లని పరిచయం చేయలేదు. నా ముందు దశాబ్దాలను పరిపాలించిన చంద్ర, గోపీల గురించి రాస్తానని ఏళ్ల తరబడి దండోరా వేసి కూడా రాయలేదు. అభిమాన కేరికేచరిస్టు జార్జి గ్రాజ్ ఆత్మకథ – ది బిగ్ నో అండ్ ది స్మాల్ ఎస్ – ఆయనపై వచ్చిన జీవిత కథ. గుస్తావ్ క్లిమ్ట్, యుగాన్ షీల్, ఇతర ఆస్ట్రియన్ ఆర్టిస్టుల గురించీ, చిన్నప్పట్నుంచి వొళ్లంతా పట్టి పీడిస్తున్న చైనీస్ కాలిగ్రఫీ గురించీ ఇందులో లేదు. అమృతా షేర్గిల్, జామిని రాయ్ – ఇలా ఎన్నని చెప్పాలి. ఇందులో ఏదీ లేదు –
మళ్లీ ఏ వెర్రి సంపాదకుడో, ఇలాటి అమాయక పబ్లిషరో దొరికినపుడు రాయకుండా ఉంటానా?
అయ్యో! రంగుల సీతాకోకచిలకలెగిరి పోతున్నాయి. రండి పరిగెడదాం. పదండి ఫీలవుదాం.
– మోహన్
*** *** ***
కార్టూన్ కబుర్లు పుస్తకానికి ఆర్టిస్ట్ మోహన్ 25 ఏళ్ల క్రితం రాసిన ముందు మాట ఇది……….. – Taadi Prakash 9704541559
Share this Article