ఈమధ్య మనం ఓ ‘ముచ్చట’ చెప్పుకున్నాం… ఓ తండ్రి ఇక్కడ మరణిస్తే విదేశాల్లో ఉన్న కూతురికి పోలీసులు ఫోన్ చేస్తే… ‘‘తండ్రి శవాన్ని ఎక్కడో ఓచోట పడేయమంది ఆ మహాతల్లి… లేదా మీరే తగలేయండి అని బదులిచ్చింది…’’ ఆ వార్త అందరినీ కలిచివేసింది… శాస్త్రోక్తంగా జరిగే అంత్యక్రియల మీద నమ్మకం కలిగి ఉన్నవాళ్లు… అవి సరిగ్గా జరిగితేనే ఊర్ధ్వలోకాలకు ఆత్మ తృప్తిగా వెళ్లిపోతుందని భావించేవాళ్లు… లేకపోతే ఇక్కడే ఆత్మ అశాంతితో తిరుగాడుతుందనీ విశ్వసించేవాళ్లు… అందరికీ ఈ వార్త బాధాకరమే…
ఈ నమ్మకాలున్న పెద్దలకు తమ పిల్లలు తమను గౌరవంగా ఈ ఇహలోకం నుంచి సాగనంపుతారనే భరోసా అవసరం… కొంతమంది ఈ శాస్త్రోక్త అంత్యక్రియల కోసం కొంత డబ్బును లేదా కాస్త బంగారాన్ని తమతోపాటు దాచుకుంటారు… తమను సాగనంపే ‘కర్మకాండల’ కోసమే వాడాలని పిల్లలకు ముందుగానే కఠినంగా చెప్పి పెడతారు… అంటేనే అర్థమవుతుంది కదా… తమ ‘వీడ్కోలు’ అమర్యాదకరంగా, అవమానకరంగా ఉండకూడదని వాళ్లు ఎంత బలంగా కోరుకుంటున్నారో…
వోకే… లోక నిందకు భయపడో, లేక తమ విద్యుక్త ధర్మమనే భావనే కదిలిస్తుందో గానీ… పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా దగ్గరి బంధువులు, పిల్లలు మరణిస్తే దగ్గరలోని ఏ స్మశాన వాటికకో వెళ్లి వాళ్ల వాళ్ల కుల రీతులను బట్టి ఖననమో దహనమో చేస్తారు… ఇవ్వాళ్రేపు ఈ అంత్యక్రియలకూ ప్యాకేజీలు… భారీ రేట్లు… శవాన్ని అలంకరించడం దగ్గర నుంచి బూడిదగా మార్చే వరకూ వాళ్లే చూసుకుంటారు… ఫోన్ కరో, డెడ్ బాడీకి లిఫ్ట్ కరో… సాయంత్రానికి ఇంట్లో ఒక కుటుంబసభ్యుడి నంబర్ డిలిట్… అంతే… తెల్లారితే యథాతథ స్థితి…
Ads
కాస్త ఈ కర్మలపై విశ్వాసం ఉన్నవాళ్లు గరుడ పురాణంలో చెప్పిన క్రియలన్నీ ఆచరిస్తారు… కర్మకాండను పద్ధతిగా నిర్వర్తిస్తారు… చితి దగ్గర నీళ్ల కుండకు చిల్లు కొట్టే రాతికీ అభిషేకం చేస్తారు… పెద్ద కర్మ సరేసరి… ఈలోపు అస్థికలు ఏరడం, దగ్గరలోని ఏ నదీప్రవాహంలోనే కలిపేయడం వంటివన్నీ ఉంటాయి… కొందరు ఏడాదిదాకా నెలనెలా మాసికం పెడతారు… సరే, ఇవన్నీ రకరకాలు… ముఖ్యమైంది మాత్రం అస్థికల్ని ఏదైనా ప్రవాహంలో కలిపేయడం…
ఆమధ్య కరోనా ప్రబలినప్పుడు… ఎవరైనా మరణిస్తే శవాన్ని అప్పగించేవారు కాదు… కనీసం తాకనిచ్చేవారు కూడా కాదు… ప్రభుత్వ సిబ్బందే అన్నిరకాల అంటు జాగ్రత్తలతో స్మశానానికి తీసుకెళ్లి చితులకు వాళ్లే నిప్పంటించేవాళ్లు… వాళ్లే కొడుకులు, వాళ్లే బిడ్డలు, వాళ్లే బంధువులు, వాళ్లే స్నేహితులు… పలు స్మశానాల్లో వేల అస్థికల పాత్రల్ని, గురిగులను (చిన్న మట్టి కుండలు) దగ్గరివాళ్లు తీసుకుపోలేదు… ఆ అస్థికలకు జలయోగం పట్టలేదు… తరువాత అవన్నీ ఏమయ్యాయో తెలియదు…
ఇప్పుడు ఓ వార్త… జుబ్లీ హిల్స్‌లోని వైకుంఠ మహాప్రస్థానం తెలుసు కదా… వీఐపీలు, సెలబ్రిటీలు ఏ స్టేటస్ వారైనా సరే అంతిమంగా అక్కడికే చేరేది… ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ పెద్దలు… అంత్యక్రియలు జరుపుతున్నారు గానీ ఇక అస్థికల్ని తీసుకుపోవడం లేదట… అవి అలా అక్కడే ఉండిపోతున్నాయి… మరి వాళ్ల పిల్లలు ఎందుకు వదిలేస్తున్నారు..? జస్ట్, అంత్యక్రియల తరువాత ఆ వైపే వెళ్లడం లేదు… అంటే శాస్త్రోక్త అంత్యక్రియల పర్వానికి మధ్యలో బ్రేకులు… మరిక వాళ్ల తాలూకు మృతులను గౌరవంగా ఇహలోకం నుంచి ఎలా సాగనంపుతున్నట్టు..? పైగా తెల్లారిలేస్తే మస్తు నీతులతో సినిమాలు తీస్తారు… లోకానికి నీతి కథలు బోధిస్తారు…
చూసీ చూసీ ఆ మహాప్రస్థానం నిర్వాహకులకే చిర్రెత్తింది… ఇదుగో అందరికీ తెలియజేయునది ఏమనగా అంటూ ఓ జనరల్ నోటీస్ జారీ చేశారు… ఈనెల 30 వరకు ఎవరైనా అస్థికల్ని తీసుకువెళ్లరో అలాంటి ‘‘అనాథ అస్థికల్ని’’ అనామక అస్థికలుగా పరిగణించి 14వ తేదీన మేమే నిమజ్జనం చేస్తామని ప్రకటించేశారు… తరువాత ఈ విషయంలో తమను నిందించి ప్రయోజనం లేదని కూడా తేల్చిచెప్పారు… పేరుకే అది జుబ్లీహిల్స్, వెరీ రిచ్… ఫుల్లీ పాలిష్డ్, నాగరికం… కానీ ఈ బలిసినోళ్లే తమ ‘పెద్దలను’ ఇలా గాలికి వదిలేయడాన్ని ఏమనాలి..?! బహుపరాక్… మీ పిల్లలూ మీ అస్థికల పట్ల మీలాగే వ్యవహరిస్తారు…!!
Share this Article