నేను రాసేది వివాదాస్పదం అవుతుండవచ్చు, కొందరి మనసులను గాయపరుస్తుండవచ్చు… కానీ రాజకీయమనేది యదార్థం. ఆ యధార్థాన్ని బలహీనమైన పునాదులపై నిలబెట్టరాదు. దానికి దృఢమైన పటుత్వం ఉన్నప్పుడే రాజకీయం రసకందాయం అవుతుంది. అవును రాజకీయం చాలా విచిత్రమైనది. నీ కళ్ళతో చూసేది నిజం కాదు, నీ చెవులతో వినేది వాస్తవం కాదు, రాజకీయాల్లో ఏది శాశ్వతం కానే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో చూసి, మరెన్నో అద్భుతాలు చేసి తనదైన ముద్రవేసిన ’45 ఏళ్ళ రాజకీయం’ అత్యంత హీనమైనస్థితిని అనుభవిస్తుంది.
నాకింకా గుర్తున్నాయి, ఒక మూడు సంవత్సరాల క్రితం నాతో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన మాటలు..స్వరాష్ట్రం వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వ్యవసాయక్షేత్రంలో తనకు అత్యంత సన్నిహితవర్గంలోని ఒక వ్యక్తితో కలిసి నడుస్తూ మనం ఇంకేదైనా సాధించేది మిగిలి ఉందా అని అడిగితే ఇంకేముంది ఒక రాష్ట్రం సాధించారు, ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు ఇంతకన్నా సాధించేది ఏముంది మీ రాజకీయజీవితంలో అన్నాడట కెసిఆర్ తో ఆ వ్యక్తి. నిజంగానే కెసిఆర్ రాజకీయచరిత్రలో ఎన్నో చెప్పుకోదగ్గ ఉద్వేగపూరితమైన ఘట్టాలుంటాయి, ఊహించని మలుపులుంటాయి. అవి చంద్రబాబు లేక ఎన్టీఆర్ (అనుకుందాం) నేర్పించిన అడుగులు అయినప్పటికీ పెద్దగా తప్పటడుగులు వేయలేదు. ఒక పరిపూర్ణమైన రాజకీయనాయకునికి రాజకీయవిరమణ దశలో వేసే అడుగులు అత్యంత కీలకంగా ఉంటాయి… ఆ వ్యూహాత్మక అడుగులు సరిగా వేయలేనప్పుడు సగౌరవంగా రాజకీయం నుండి తప్పుకోవటం అక్కడివరకు చేసిన రాజకీయప్రయాణానికి ఎంతో హుందాతనమైన ముగింపు ఇచ్చినట్టవుతుంది.
Ads
చంద్రబాబునాయుడి రాజకీయంలో గత దశాబ్దపు అడుగులు వ్యూహాత్మక తప్పటడుగులుగా మారాయి. తన అరెస్ట్ తదనంతర పరిణామాల్లో దేశంలో, రాష్ట్రంలో ఎవరైనా వ్యక్తులు ఖండిస్తారేమోనని ఎదురుచూడాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. ఒక్క నిప్పురవ్వ ఎగసిపడలేదు, ఒక్క లాఠీ విరగలేదు, ఒక్క నిజమైన కన్నీటిచుక్క రాలలేదు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల అంచెంచల, విస్తృత రాజకీయ శ్రమతో ప్రజల నుండి పుట్టాల్సిన పోరాటం డబ్బులిచ్చి ధర్నాలు చేయించే స్థాయికి వచ్చింది. చివరకు ఒక సామాజికవర్గం నుండే గొంతెత్తి అరవటాలు, ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికి చేసేనిరసనలు కనబడుతున్నాయి. దీనికి కారణం ఖచ్చితంగా చంద్రబాబు స్వయంకృతాపరాధమే. దశాబ్దాల తరబడి ఒక సామాజికవర్గపు పెద్దల మాయాఉచ్చులో పడటమే బాబు చేసిన పెద్దతప్పు… ఆ సామాజికవర్గం పట్ల బహిరంగ ప్రీతి ప్రదర్శించటమే ఆయన చేసిన అతి పెద్ద అపరాధం. ఈరోజు అదే సామాజికవర్గం ఆయన రాజకీయాన్ని కార్చిచ్చుగా మారి తగలబెడుతుంది.
రాజకీయంలో ఎప్పుడు కూడా ‘నా’ అనే కీర్తికాంక్షతో, ‘నీది నాది’ అన్న కుటిలనీతితో ఉంటూ ‘నువ్వు నేను మనమందరమనే’ వ్యూహాత్మకనీతి ప్రదర్శిస్తూ ముందుకుసాగాలి. రాజకీయం ఆకాశమంత విశాలమైనది, అనంతమైనది. అపారమనే మహాసముద్రం లోతుల వలే అంతుచిక్కనిది. అంతరిక్షమంత ఎత్తుకుఎదిగినా అర్ధంకానిది. రాజకీయమనేది నిత్యం ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ, అనుభవిస్తూ, అభ్యసిస్తూ అవగతం చేసుకునేది.
రాజకీయం-రంకు వేర్వేరు పార్శ్వాలు కావచ్చు కానీ ఇష్టమైన ఒక అందమైన మగువను కామంతో ఎంత కసిగా చూస్తావో, సున్నితంగా స్పృశిస్తావో అంతే కసిగా, అంతే సున్నితంగా రాజకీయాన్ని చూడాలి. అంతేకానీ ఒక సామాజికవర్గపు పెద్దలు చెప్పే మాటలకు తలూపి, చేయించే చేతలకు కట్టుబడి ఉంటూ ఆ వర్గం కనుసన్నల్లో మెలగటం వల్ల తన సుదీర్ఘ రాజకీయజీవితం ఇప్పుడు ప్రమాదంలో పడేలా చేసింది. ఆ వర్గపు పెద్దల వ్యాపారాత్మక ఆలోచనల మాయలో పడి రాజకీయం ఇలానే ఉంటుందేమోనని భ్రమపడ్డాడు,వాళ్ళు లేకపోతే తాను రాజకీయం చేయలేనేమోనని భయపడ్డాడు, అసలు వాళ్లనే రక్షణకవచం ఉండకపోతే తనరాజకీయజీవితం ముగిసిపోతుందేమోనని బాధపడ్డాడు. చివరకు ఆ సామాజికవర్గపు పెద్దగా, ఆ వర్గానికి మాత్రమే చెందిన నాయకుడిగా రాజకీయచరిత్ర పుటల్లో చిట్టచివరి చేదు అంకంగా మిగిలిపోయాడు.
బహుశా తానువేసిన రాజకీయపు చివరితప్పటడుగులు తన అంతరాత్మ చేసే హాహాకారాలకు జైలు నాలుగు గోడలు సాక్ష్యాలుగా నిలుస్తుండవచ్చు. ఎవరేమనుకున్నా కానీ ఒక ములాయం సింగ్, ఒక శరత్ పవార్, ఒక లాలూ ప్రసాద్ యాదవ్ లు ఇదే కోవలో ఎటువంటి ఆనవాళ్లు మిగల్చకుండా చేర్చబడి భారతదేశ రాజకీయ చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. ఇలా ఏపీ సీఎం జగన్ రెడ్డి చేసినా, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు చేసినా, ఎవరు చేసినా కానీ రాజకీయ జీవితపు చరిత్ర పుస్తకంలో చివరిపుట చీకట్లనే చివరి అధ్యాయంతో ముగించకతప్పదు. చంద్రబాబు ప్రస్తుత రాజకీయఘట్టం కెసిఆర్ లాంటి రాజకీయ వ్యూహాత్మక ఉద్దండులకు గుణపాఠం. ఖచ్చితంగా గుణపాఠం!! …. హరికాంత్ (HK) (guest writer)
Share this Article