మన విశ్వనగరంలోనే… ఏరియా పేరు ఎందుకు లెండి… ఇద్దరు మిత్రులు ఓ అపార్ట్‌మెంట్ పార్కింగులో నిలబడి మాట్లాడుకుంటున్నారు… ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చాడు అక్కడికి… సార్, మీకేమైనా ఈ డిటెయిల్స్ తెలుసా అనడిగారు… ఆ బిల్లుపై కనిపించే వివరాలు చూస్తే… ఓ పేరుంది… ఫస్ట్ ఫ్లోర్ అని ఉంది… అపార్ట్‌మెంట్ పేరు లేదు…
ఫోన్ నంబర్ ఉంది గానీ… ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు… అసలు స్విగ్గీ ఆర్డర్ మరిచిపోయారో, కావాలనే లిఫ్ట్ చేయడం లేదో తెలియదు… కనీసం అపార్ట్‌మెంట్ పేరు రాయాలనే సోయి లేదా ఆర్డర్ దారులు ఎవరో గానీ… ఆ చుట్టుపక్కల అన్నీ అపార్ట్‌మెంట్లే… మరి ఏ ఫస్ట్ ఫ్లోరో తెలిసేది ఎలా..? చాలాసేపటి నుంచి సదరు స్విగ్గీ బాయ్ చాలామందిని అడిగీ అడిగీ ఓ చివరి ప్రయత్నంగా ఈ ఇద్దరు మిత్రుల్ని అడిగాడు…
‘సార్, నేను డెలివరీ చేయాల్సినవి చాలా ఉన్నయ్, ఇది ఇవ్వలేకపోతే మైనస్ మార్క్… నాకు రావల్సిన డబ్బూ రాదు… టైమ్ వేస్ట్’… ఇదీ తన బాధ… మరీ కొందరికి ఫుడ్ ఆర్డర్లు అంటే తమాషా అయిపోయింది… ఇక్కడ చెప్పుకోదగిన మరో ముఖ్యమైన సంగతి ఉంది… ఈ ఆర్డర్ ఏమిటో తెలుసా..? ఓ మిల్క్ బార్… దాని ధర 60 రూపాయలు… కానీ ఇది చూడండి ఓసారి…
Ads
ఆఠానా కోడికి బారాణా మసాలా అన్నట్టు… దాని ధరే 60 రూపాయలు… దానికి 4 రూపాయలు హ్యాండ్లింగ్ ఫీ… డెలివరీ ఫీ 30 రూపాయలు… చిన్న పార్శిల్ కాబట్టి మరొక పది రూపాయలు అదనం… వెరసి 104 రూపాయలు… అంటే 60 రూపాయల సరుక్కి 44 రూపాయల వాయింపు… సరే, ఇదీ వోకే, ఎవరిష్టం వాళ్లు అనుకుందాం…
మరి ఆ అడ్రెసైనా సరిగ్గా ఇచ్చి ఏడవొచ్చు కదా… ఆ స్విగ్గీ డెలివరీ బాయ్స్ జీవితాలో ఆటలు దేనికి..? నిజానికి సదరు ఫస్ట్ ఫ్లోరర్ ఎవరో గానీ, జస్ట్ ఒక్కసారి తమ కిటికీ తెరిచి చూస్తే ఆ వీథిలో ఇలాంటి మిల్క్ బార్లు దొరికే నాలుగైదు షాపులు కనిపిస్తాయ్… చిన్న చిన్న కిరాణా షాపుల్లోనూ తక్కువ ధరకే దొరుకుతున్నయ్… ఫస్ట్ ఫ్లోరే కదా, కాస్త నాలుగు మెట్లు దిగి, వీథిలో నాలుగు అడుగులు వేస్తే ఈ బార్లు బోలెడు దొరుకుతయ్… ఆ చిన్న షాపుల వాళ్లూ బతుకుతారు కదా… ఆ సోయి కూడా లేకుండా పోయింది సదరు ఫస్ట్ ఫ్లోరడికి… లేదా ఆ ఫస్ట్ ఫ్లోరికి…!! మరీ నగరవాసులు ఇంత బద్ధకిస్టులు అయిపోయారేమిట్రా బాబూ..!!
Share this Article