ఎల్ ఐ సి ప్రకటనలు చదివేవారికి లేదా ఒక పాలసీ?
———————-
జీవితం మనదే అయినా బీమా తెలుగు పదమేనా? కాదా? అన్న చర్చ ఇక్కడ అనవసరం. తెలుగు ప్రామాణిక నిఘంటువు శబ్దరత్నాకరం ప్రకారం బీమా హిందీ పదం. ధీమా బలంగా ఉండాలనుకుని బీమాకు ఒత్తు కూడా పెట్టి
“జీవిత భీమా” అని కూడా కొందరు తమకు తాము గట్టిగా ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు.
“యోగక్షేమం వహామ్యహం” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అభయ వాక్కును ఎల్ ఐ సి ట్యాగ్ లైన్ గా పెట్టుకుంది. దీపం ఆరిపోకుండా రెండు చేతులు అడ్డు పెట్టడం ఎల్ ఐ సి లోగో. ట్యాగ్ లైన్ , లోగోలో చాలా అర్థముంది.
Ads
అయితే ఎల్ ఐ సి లో నెమ్మదిగా వాటాలను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు తన దీపం ఆరిపోకుండా అడ్డుపెట్టే చేతులకోసం బీమా జీవితం వెతుకుతోంది. తన యోగక్షేమాన్ని వహించే భగవానుడి కోసం ఎల్ ఐ సి ప్రార్థిస్తోంది. అయినా మన గొడవ ఎల్ ఐ సి ప్రకటనల్లో తెలుగు చిత్ర వధ గురించి. ఎల్ ఐ సి మనుగడ గురించి కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని భాషల దిన పత్రికల్లో ఎల్ ఐ సి కొత్త పాలసీల ప్రచారం కోసం ఫస్ట్ పేజి, సెకండ్ పేజి ప్రకటనలు భారీ ఎత్తున ఇచ్చారు. మిగతా భాషలు మనకనవసరం. బహుశా హిందీ/ఇంగ్లీషులో ప్రకటనలు చక్కగానే ఉండి ఉండవచ్చు.
తెలుగులో-
సంస్కృతం మాట స్తంభం. అంటే స్థిరంగా నిలబడేది అని అర్థం. ప్రత్యేకించి మగవారికి రూపొందించిన ఎల్ ఐ సి పాలసీ-
“ఆధార్ స్థంభ్” అట. కుటుంబానికి స్తంభంలా బలంగా ఉండాలనుకుని స్తంభంలో లేని ఒత్తు పెట్టి స్థంభ్ అని పేరులోనే దారి తప్పారు.
ప్రత్యేకించి ఆడవారి కోసం రూపొందించిన పాలసీ-
“ఆధార్ షిలా” అట. బహుశా ఇది “ఆధార్ శిల” అయి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో శ- ష- స పలకడంలో తేడాలుంటాయి. ఒరియా వారికి కాంపన్సేసన్ వస్తుంది కానీ- కాంపన్షేషన్ రాదు. దృశ్య, శ్రవణ మాధ్యమంలో చాలా మందికి పెల్లి జరిగి పిల్లలు పుడతారు కానీ- పెళ్లి జరగదు.
ఆధార్ శిల కాస్తా “ఆధార్ షిలా” అయ్యింది. మై నేమ్ ఈజ్ షీలా… షీలాకి ఎల్ ఐ సి…పాట గుర్తొచ్చిందేమో పాపం. ఎల్ ఐ సి ఆధార షిలా శిలల్లో ఇంకేదయినా అర్థం దాగి ఉంటే- భాషా ప్రేమికులు ఎవరికి వారు గునపాలతో తవ్వి అర్థం బయటికి తీసి శిలాక్షరాలతో లిఖించవచ్చు.
“ఆటో భద్రత” అంటే ప్రాణానికి జీవిత బీమా చేస్తే మనం వాడే వెహికిల్ కు కూడా ఆటోమేటిగ్గా ఆటోమొబైల్ వెహికిల్ ఇన్సూరెన్స్ అనుకునేరు. అనువాదంలో జరిగిన ఆటో ప్రమాదమది. వారే చెప్పారు- ఆటో భద్రతలో రిస్క్ కొనసాగుతుంది!
ఎల్ ఐ సీ! ఎల్ ఐ సీ!
నీ ప్రటకన చదవడానికి ముందు మేము చేసుకోవాల్సిన షిలా స్థంభాధార ఫాలసీ ఒఖఠి లేదా? రాదా?
ఎల్ ఐ సి వారికి ఒక విన్నపం
———————
ఎన్నో విలువయిన జీవితాలు ఆరిపోకుండా మీ చేతులు అడ్డుపెట్టి కాపాడారు కదా? అలాగే ఎలాన్ మస్క్ అంతరిక్షంలోకి ప్రయివేటు రాకెట్లు పంపే ఈ రోజుల్లో- మీరు శిలలు, స్తంభాలు, ఇటుకలు, పునాదులు తవ్వుతూ పాతరాతి యుగం పొరల్లో మా బీమా భద్రతను ఆవిష్కరిస్తున్నారు. అలాంటి మీ కఠోర శిలలకు, అవి చదివి తట్టుకుని శేషజీవితాన్ని భద్రంగా గడపడానికి తెలుగు- తెలంగాణా తల్లులకు పెద్ద మనసుతో ఒక ప్రత్యేక బీమా పాలసీ ఇవ్వగలరు. ప్రీమియం ఎంతయినా పరవాలేదు. భాషాభిమానులు తలా పావలా చందాలు సేకరించి కట్టగలరు……….. By….. -పమిడికాల్వ మధుసూదన్
Share this Article