మనం ఇప్పటివరకూ అద్భుతమైన వాస్తు నిర్మాణ కౌశలానికి అంగకార్ వాట్ దేవాలయాన్ని చెప్పుకుంటాం… అది భారత దేశం బయట, కంబోడియాలో ఉన్న అతి పెద్ద హిందూ దేవాలయం.,. కానీ శిథిలమైంది… దాని గురించి చెప్పటానికి వేరే స్పేస్ అవసరం… దేశం లోపల, బయట అన్నీ కలిపి లెక్కేసినా సరే, వచ్చే 8వ తేదీన ప్రారంభించబోయే న్యూజెర్సీ గుడి అన్నింటినీ తలదన్నేంత వైభవంగా ఉంటుంది…
రాబిన్స్‌విల్లేలో ఎనిమిది ఏళ్లపాటు శ్రమించి 150 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ ఆలయం స్వామినారాయణ ఆలయ పరంపరలోనే విశిష్టమైంది… టాప్ వన్ అనుకోవచ్చు… ఆ ఫోటోల్ని చూస్తుంటే అద్దాల్నే శిలలుగా మార్చి, శిల్పాలుగా స్థంభాలుగా మలిచారేమో అనిపిస్తుంది… దాదాపు 12 వేల మంది వాలంటీర్లు కష్టపడ్డారు… మొత్తం విస్తీర్ణం 185 ఎకరాలు… (అంగకార్ వాట్ ఆలయం 400 ఎకరాలు)…
Ads
న్యూజెర్సీ ఆలయం న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌కు 90 కిలోమీటర్ల దూరం… ఇప్పటికి ఇంకా ప్రారంభించనేలేదు… కానీ రోజూ వేలాది మంది భక్తులు వచ్చిపోతూనే ఉన్నారు… పైన ఫోటో చూశారు కదా… గుడి లోపలి భాగం… ఒక్కసారి గుడిలోకి అడుగు పెడితే ఇలా కళ్లప్పగించి అబ్బురంగా చూడాల్సిన దృశ్యాలు అనేకం… దీన్ని నిర్మించింది బీఏపీఎస్ స్వామి నారాయణ సంస్థ… అంటే Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha…
ఈ గుడిలో హిందూ సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే అనేక నృత్య భంగిమల విగ్రహాలు… ఒక ప్రధాన మందిరం, పన్నెండు ఉపమందిరాలు ఉన్నాయి… 9 పిరమిడ్ తరహా శిఖరాలు… ఈ గుడి నిర్మాణానికి అవసరమైన పలు రకాల శిలల్ని (ఇరవై లక్షల క్యూబిన్ అడుగుల రాళ్లు) ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి, ముఖ్యంగా బల్గేరియా, టర్కీ, ఇటలీ, గ్రీస్‌ల నుంచి తెప్పించారు… చాలా భాగం ఇండియాకు తీసుకెళ్లి, శిల్పాలుగా మలిచి, వాటిని అమెరికా తీసుకెళ్లి, అసెంబ్లింగ్ చేస్తూ… కొన్ని అమెరికాలోనే, స్పాట్‌లోనే చెక్కుతూ 2015 నుంచీ కష్టపడ్డారు… ఇండియా, చైనాల నుంచి గ్రానైట్, యూరప్, లాటిన్ అమెరికా నుంచి డెకరేటివ్ స్టోన్స్ తెప్పించారు…
ఎందుకో అనిపించేది… అనేక దేశాల్లో గుళ్ల నిర్మాణం జరిపింది ఈ సంస్థ… అన్నీ భవ్యమైన వాస్తు కౌశలం కనబరిచేవే… కేవలం ఆధ్యాత్మిక ధోరణులే తప్ప ఎక్కడా రాజకీయాల మకిలిని దగ్గరకు రానివ్వరు వీళ్లు… అంతెందుకు, న్యూజెర్సీలో మనం ఇప్పుడు ఘనంగా చెప్పుకునే గుడిని కూడా మహంత్ స్వామి మహారాజ్ ప్రారంభిస్తాడు… మొత్తం గుడి విశేషాల్లో… కాదు, వీళ్లు నిర్మించే గుళ్లు, నిర్వహించే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో బాగా ఆకర్షించేది ఇదే… నో వీవీఐపీ కల్చర్… నో పొలిటికల్ స్మెల్…
కొన్నిసార్లు అనిపించేది… అయోధ్య రామజన్మస్థలి గుడిని యావత్ హిందూ సమాజం గర్వకారణంగా, తమ ఆధ్యాత్మిక మతచిహ్నంగా భావిస్తోంది కదా… ఆ గుడి నిర్మాణాన్ని కూడా ఈ స్వామినారాయణ సంస్థకే అప్పగిస్తే బాగుండేదేమోనని…! చివరగా… ఈ బీఏపీఎస్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన గుళ్లు వందలు… (1400 అని ఓ అంచనా…) బ్రిటన్, అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తదితరాలు… హిందూ సమాజం గర్వంగా, భక్తిగా ప్రణమిల్లే గుడి ఈ న్యూజెర్సీ ఆలయం…
Share this Article