Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మైనార్టీ వోట్లతో వయనాడ్‌లో గెలిచిన రాహుల్… హైదరాబాద్‌లో నిలబడతాడా..?

September 26, 2023 by M S R

Nancharaiah Merugumala….  రాహుల్‌ గాంధీని వాయనాడ్‌ కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే… కాంగ్రెస్‌ ‘ప్రిన్స్‌’ హైదరాబాద్ లో పోటీకి దిగాలని మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ సవాల్‌!

……………………………………………………………………………………………………….

భారత్‌ జోడో యాత్ర తర్వాత, ఇటీవల పార్లమెంటులో, వెలుపలా పదునైన ప్రసంగాలతో తన ‘నేషనల్‌ స్టేచర్‌’ పెంచుకున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. కాంగ్రెసన్నా, నెహ్రూ–గాంధీ కుటుంబమన్నా ఎమర్జెన్సీ పెట్టిన 1975 జూన్‌ 25 నుంచీ ఘోరంగా వ్యతిరేకించే నాలాంటి ‘అవిశ్రాంత’ పాత్రికేయులు సైతం రాహుల్‌ భయ్యా ముఖంలో పొంగిపొర్లుతున్న శక్తిని గుర్తిస్తున్నారు.

Ads

మరి ‘ఇండియా’ కూటమి నాయకత్వాన్నా సునాయాసంగా దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ‘అప్రకటిత’ ప్రధాని అభ్యర్థి రాహుల్‌ పై ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో కూడా కొన్ని అననుకూల, వ్యతిరేక వ్యాఖ్యలు వచ్చి పడుతున్నాయి. 2018 పార్లమెంటు ఎన్నికల సమయంలో యూపీలోని కుటుంబ సీటు అమేఠీలో తనకు బీజేపీ కేంద్ర మంత్రి, గుజరాతీ పార్సీ జుబిన్‌ ఇరానీ భార్య స్మృతీ మల్హోత్రా ఇరానీ చేతిలో ఓటమి ఖాయమనే భయం రాహుల్‌కు పట్టుకుంది.

పరాజయం అనుమానం రాగానే కాంగ్రెస్‌ నిత్య యువరాజుకు మంచి సలహా ఇచ్చారెవరో. కేరళలో తరతరాలుగా కాంగ్రెస్‌కు కంచుకోట అయిన వాయనాడ్‌ నుంచి ఆయన పోటీచేస్తే గెలుపు 200 శాతం ఖాయమని చెప్పారు మలయాళీ కాంగ్రెస్‌ నేతలు. వారి వాదనకు సరైన కారణాలే ఉన్నాయి. వయనాడ్‌ లోక్‌ సభ నియోజకవర్గంలో హిందువులు 49.48%, కేరళలో కాంగ్రెస్‌ కు ఓటు బ్యాంకులుగా మారిన ముస్లింలు 28.65%, క్రైస్తవులు 21.34% ఓటర్లుగా ఉన్నారు.

ఈ ముస్లిం–క్రైస్తవ కాంబినేషన్‌ మద్దతుతో రాహుల్‌ తన సమీప కమ్యూనిస్టు (ఎల్డీఎఫ్‌–సీపీఐ) అభ్యర్థి పీపీ సునీర్‌ ను 4 లక్షల 31 వేల ఓట్లకు పైగా మెజారిటీతో ఓడించారు. పోలైన ఓట్లలో ఆయనకు 64% పడ్డాయి. ఇక్కడ అప్పటి ఎన్నికల్లో బీజేపీ తాను పోటీచేయకుండా సీటును తన మిత్రపక్షం బీడీజేఎస్‌ కు వదిలేసింది. ఓబీసీ ఈళవ (తెలుగు గౌడ లేదా ఈడిగలతో సమానం) పార్టీ బీడీజేఎస్‌ కు అప్పుడు కేవలం 7.25% ఓట్లే పోలయ్యాయి.

మరి కాంగ్రెసుకు ఇంతటి సురక్షిత నియోజవర్గం నుంచి రెండోసారి పోటీచేయడానికి రాహుల్‌ భయ్యా సమాయత్తమౌతుండగా కొత్తగా ‘ఇండియా’ కూటమిలో చేరిన వామపక్షం సీపీఐ తాజాగా రాహుల్‌ గాంధీకి మంచి సూచన చేసింది. బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించే పార్టీ నేతగా రాహుల్‌ మిత్రపక్షం సీపీఐ పోటీచేసే స్థానం, బీజేపీ పోటీకి దిగని స్థానం వాయనాడ్‌లో 2024 ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఇటీవల దిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో కామ్రేడ్లు గట్టిగా మాట్లాడారు.

దేశంలో బీజేపీ హిందుత్వ మతతత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న లౌకిక శక్తుల పోరాటానికి నాయకత్వం వహిస్తున్న రాహుల్‌ కేరళ వదిలి, ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చే నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సత్తా నిరూపించుకోవాలని కేరళ సీపీఐ నేత, రాజ్యసభ ఎంపీ పీ.సందోష్‌ కుమార్‌ బహిరంగంగానే ప్రకటన చేశారు. అయితే, వాయనాడ్‌ నుంచి రాహుల్‌ తప్పక పోటీచేస్తారని కేరళ కాంగ్రెస్‌ నేతలు ధైర్యం కూడదీసుకుని మరీ చెబుతున్నారు.

కేరళ కామ్రేడ్లు పొమ్మంటుంటే. దమ్ముంటే హైదరాబాద్‌ రావాలని మజ్లిస్‌ నేత సవాల్‌

……………………………………………………………………………………….

‘దేవుడి సొంత రాజ్యం’గా ముద్రపడిన కేరళ కమ్యూనిస్టులు వాయనాడ్‌ లో తమతో తలపడవద్దని, ఉత్తరాది బీజేపీతో పోరాడాలని ఒక పక్క రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. మరోపక్క మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ముస్లిమీన్‌ (ఏఐఎంఐఎం) నేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ‘రాహుల్‌ భాయ్, నీకు దమ్మూ ధైర్యముంటే హైదరాబాద్‌ సీటు నుంచి పార్లమెంటుకు పోటీచేయ్‌. మనలో ఎవరికి ముస్లింల మద్దతు ఉటుందో తేల్చుకుందాం. అయోధ్యలోని బాబరీ మసీదును, హైదరాబాద్‌ సెక్రెటేరియట్‌లోని మసీదునూ కాంగ్రెస్‌ పాలనలోనే కూల్చేశారు. హైదరాబాద్‌ లో నామీద పోటీకి దిగండి, చూసుకుందాం,’ అనే రీతిలో ఆదివారం పాత నగరం బహిరంగ సభలో బారిస్టర్‌ అసద్‌ భాయ్‌ సవాలు చేశారు.

నిన్ననే కాదు, కొన్ని నెలల క్రితం కూడా రాహుల్‌ హైదరాబాద్‌ నుంచి లోక్‌ సభకు పోటీచేయాలని సవాలుతో కూడిన ఆహ్వానాన్ని అసదుద్దీన్‌ ఒవైసీ కాంగ్రెస్‌ అగ్రనాయకత్వానికి పంపించారు. బీజేపీ మతతత్వ పోకడలు, ఇస్లాం వ్యతిరేక పోకడల వల్ల కొద్దిగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారుతున్న ముస్లింలు 28.65 శాతం ఉన్న వాయనాడ్‌ ను వదిలేసి, 60 నుంచి 65 శాతం వరకూ మహ్మదీయ ఓటర్లున్న హైదరాబాద్‌ నుంచి రాహుల్‌ భాయ్‌ పోటీ చేస్తారా? లేదా? అనేది ఆరు నెలల్లో తేలిపోతుంది.

అసద్‌ భాయ్‌ సవాలును సీరియస్‌ గా తీసుకుని వాయనాడ్‌ ఎంపీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాదు నుంచి పోటీ చేస్తేనే కాంగ్రెస్‌ లౌకిక, రాజకీయ సామర్ధ్యం చక్కగా రుజువవుతుందని భావించే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు లేకపోలేదు. ఒకవేళ రేపొచ్చే డిసెంబర్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆరెస్‌ చేతిలో ఓడిపోయినా రాహుల్‌ భయపడకుండా హైదరాబాద్‌ నుంచి పార్లమెంటుకు పోటీచేయాలని వారు కోరుతున్నారు.

ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పీసీసీ నేత ఏ.రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2019 పార్లమెంటు ఎన్నికల్లో వరుసగా మల్కాజిగిరి, భువనగిరి నుంచి గెలిచిన విషయం వారు గుర్తుచేస్తున్నారు. మజ్లిస్‌ వంటి మతతత్వ పార్టీ నేత సవాలును రాహుల్‌ స్వీకరించి హైదరాబాద్‌ బరిలో దిగితే 1980లో ఆఖరిసారిగా గెలుచుకున్న ఈ పాత నగరం సీటును మరోసారి కైవసం చేసుకోవచ్చని వారు ఆశపడుతున్నారు.

హైదరాబాద్‌ స్థానంలో చివరిసారి విజయం సాధించిన ఓబీసీ (ముదిరాజ్‌) కాంగ్రెస్‌ నేత కే.నారాయణ అనే విషయం వారు గుర్తుచేస్తున్నారు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984 డిసెంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాటి కాంగ్రెస్‌ అభ్యర్థి వి.హనుమంతరావుపై మజ్లిస్‌ అధ్యక్షుడు ‘సాలార్‌’ సుల్తాన్‌ సలాహుద్దీన్‌ ఒవైసీ గెలిచి, తొలిసారి పార్లమెంటులో అడుగుబెట్టారు. ఇలా దాదాపు 40 ఏళ్ల నుంచీ హైదరాబాద్‌ పార్లమెంటు సీటు ఒవైసీ తండ్రీకొడుకుల చేతుల్లోనే ఉంటోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions