(ప్రభాకర్ జైనీ)……. ఇయ్యాల నాకు చాన సంతోషంగ ఉన్నది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫస్ట్ క్లాసుల పాసయిన. ఇంటర్నెట్ సెంటరుల ఇచ్చిన కాగితాన్ని తీసుకోని బయటకొచ్చి ఇంటి ముఖం పట్టిన. కనీ, దూరం పంటి కూలిపోయేటట్టున్న మా ఇల్లు చూసెటాలకు, నాకు నా భవిష్యత్తు ఎట్లుంటదో అర్థమయింది. పై చదువులు చదివించే స్థోమత మా ఇంట్లోల్లకు లేదని నాకర్థమైంది. మనసు చంపుకున్న. పై చదువులు చదువాలనే ఆశను మొగ్గల్నే తుంచేసుకున్న.
మా ఊరు, పట్నం గదే, హైద్రాబాదుకు నలభై రెండు కిలోమీటర్ల దూరంల ఉండే – బోన్గిరి. గందుకె అభివృద్ధికి నోచుకోనేలే. మా ఊర్లె ప్రజలకు ఏ వస్తువు కావాల్సినా గూడ పట్నం బోయి కొనుక్కొచ్చుకుంటరు కాబట్టే, మా ఊర్లె, ఏ వ్యాపారమూ పెద్దగ జరగదు. చిన్న చిన్న కిరానా దుకాన్లు, చిన్న మల్గీలల్ల చీరెలు, లోపటి లంగాలు అమ్మే బట్టల దుకాన్లు, భోన్గిరి నుండి చుట్టుపక్కల పల్లెటూర్లకు పోయేటోల్ల కోసం ఛాయ్ బండ్లు, టిక్కీ హోటల్లు తప్ప ఇంకో పెద్ద వ్యాపారమే లేదు, పోరగాండ్లకు ఏ నౌకరీ దొరికే చాన్సే లేదు.
మా ఊర్లె పనిచేసే సర్కార్ నౌకరోల్లు, బ్యాంకు సార్లు, పంతుల్లు కూడా మా ఊర్లె ఉండరు. పట్నం నుండే ప్రతీ రోజూ అప్ అండ్ డౌన్ చేస్తుంటరు.
Ads
మా ఊర్లె ఉన్న సగం కంటె ఎక్కువ మంది పడుచు పోరగాండ్లు, ఆడోల్లు, మగోల్లు నౌకరీల కోసం పట్నం మీదనే ఆధారపడి జీవిస్తున్నరు. చాన మంది రకరకాల దుకాన్లల్ల హెల్పర్ల లెక్క, సేల్స్ బాయిల లెక్క, డెలివరీ బాయిల లెక్క , కొరియర్ సెంటర్లలల్ల పనిచేస్తుంటరు. అమ్మాయిలు చాలా మంది బట్టల దుకాన్లల్ల, షాపింగ్ మాల్స్ లల్ల అరకొర జీతాలకు పనిచేసేందుకు, ప్రతీ రోజూ పొద్దున్నే పట్నానికి బయల్దేరుతరు.
ప్రతీ రోజు పొద్దుగాల, అందరి ఇండ్లల్ల నుండి, పొట్ట చేతబట్టుకుని, వలస పోయే పక్షుల్లెక్క, చిన్నచిన్న పిల్లలంత, మా ఊర్లె సందులల్ల ఉరుక్కుంట పోయి రైల్వే స్టేషనుకు చేరుకుంటరు. గా పోరగాండ్లంత పోయినంక, మా ఊరు – బోన్గిరి, బిక్కుబిక్కుమంటున్న వృద్ధాశ్రమం లెక్క, నిర్మానుష్యమైతది. గా జనమే లేని సందులల్ల నేను దయ్యం లెక్క తిరుగుతుంట.
మా ఊరి మీది నుండి పొద్దున్నె పట్నానికి పోయెటందుకు చానా రైళ్ళుంటయి. పట్నం నుండి నూటా యాభై కిలోమీటర్ల దూరంల ఉన్న మరో పెద్ద నగరం – వరంగల్. అక్కడి నుండి పట్నం పోవటానికి కాకతీయ ఫాస్ట్ ప్యాసెంజర్, పుష్ పుల్ రైళ్ళుంటయి. ఇంక చానా ఎక్స్ ప్రెస్ రైళ్ళు గూడ మా బోన్గిరిల ఆగుతయి కనీ కాలే కడుపు నింపుకునేటందుకు వందల కిలోమీటర్ల దూరం నుండి వరంగల్లు నుండి పట్నానికి, ఈ మహా కార్మిక లోకం, ప్రతీరోజూ తరలి వస్తుంటరు కాబట్టి రైళ్ళన్నీ కిటకిటలాడుతుంటయి. బోన్గిరికి రైలొచ్చే టయానికి, రైల్ల సరిగ్గా నిల్చోవడానికి కూడా స్థలం దొరకదు. కానీ, ఎట్లనో గట్ల వేలాడుకుంటనో, నిలబడో, కూర్చున్న ప్యాసెంజర్లను
బతిమిలాడి సీటు సంపాయించుకుని కూర్సోనో పట్నానికి పరుగు పెట్టాలే. సీటు దొరికి కూర్చున్న రోజు మాత్రం పానం హాయిగుంటది. ఏదో సింహాసనం దొరికినట్టనిపిస్తది.
గీ రైళ్ళు సికింద్రాబాద్ స్టేషనుల ఆగంగనే, నేల ఈనిందా అన్నట్టుగ, వర్షాకాలంల పుట్టలల్ల నుండి మూకమ్మడిగా చీమలు బయటకు వొచ్చినట్టు వేలాది మంది పిల్లలు రైళ్ళు దిగి పరుగులు తీస్తుంటరు. చానా వరకు జల్దీజల్దీ నడిచి, రెండు మూడు మైళ్ళ దూరంల ఉన్న తమ గమ్యస్థానాలకు చేరుకుంటరు. ఇంకా, ఎక్కువ దూరం ఉంటే ఆర్టీసీ బస్సుల్లోనో, మెట్రోలనో ప్రయాణం సాగిస్తరు.
గిదే మా బోన్గిరిల యువత జీవనపోరాటం.
ఈ హైద్రాబాదు పట్నపు మహా వాణిజ్య యంత్రాన్ని నిరంతరం నడిపే చోదకశక్తే మా కార్మికలోకం. కనీ, వాల్లకు ఏ హక్కులూ, గౌరవాలూ, చట్టాలూ వర్తించవు.
ఇంటర్మీడియట్ పాసయిన తర్వాత కొన్ని దినాలు బేకారుగ గడిపిన నేను సోమరిగ ఉండలేక, మా అన్నా, అక్కా లెక్క నేనూ పట్నానికి పొయ్యే దినం నాడు, మా అమ్మ నన్ను పోవొద్దని ఏడ్చుకుంట,
“మీరంత ప్రతీ రోజు పొద్దున్నే ఇల్లొదిలి పోతే ఇల్లంత చిన్నబోతాందే! ఇగ గిప్పుడు నువ్వు గూడ పోతనంటున్నవు. మీ అక్క చూడు! ఏం సంపాయిస్తాంది? అందులో ఎంత మిగుల్తాంది? రక్తమాంసాలు ఆ పట్నానికి ధారపోసి నా బిడ్డ, అందాల రాశి ఎట్ల తయారయిందో చూసినవ! ఎముకల గూడులెక్క అయింది.” అని శోకాండాలు పెట్టుకున్నది.
గది గూడ నిజమే! మా అక్క ప్రణీత, మూడేళ్ళ క్రితం వరకు, చక్కని చుక్క లెక్క ఉండేటిది! చాన అందంగ ఉండే. ఏ రాజకుమారుడో వచ్చి ఎగరేసుకుపోతాడనుకున్నం గనీ, గిట్ల గీ మహానగరం హైద్రాబాదు పట్నపు పదఘట్టనల కిందబడి, వసివాడిపోతదని అనుకోలే.
పాపం, రోజు పొద్దున్నే ఉరుకుతున్నట్టె పోయి రైలు, బస్సులెక్కి ప్రయాణం; దుకాణాలల్ల పెట్టే అనేక ఆంక్షల మధ్యన ఉద్యోగం; మల్ల రాత్రికి బస్సు, రైలు ప్రయాణం; కన్ను మూస్కోని పంటదో లేదో, భళ్ళున తెల్లార్తది. సరిగ్గా తినీ తినకపోవడంతోటి, మల్ల ప్రయాణం మొదలు కావడంతోటి నవయవ్వన యువతైన మా అక్కకు జవసత్వాలుడిగినయి. మూడేండ్లల్ల బక్కచిక్కిపోయింది, మా అక్క – సక్కదనాల సుక్క.
గందుకే కంటికి మంటికి ఏడుస్తున్న మా అమ్మను ఊరడించి,
“అమ్మా! మరి నన్నేం చేయమంటవే? నువ్వే చెప్పు. వాల్లు సంపాదించి తెచ్చింది తక్కువనే అయిన గా పైసలతోనే కాదే మనం కడుపులు నింపుకుంటున్నది. అన్న, అక్కా గా పట్నంల రెక్కలు ముక్కలు జేసుకుంటాంటె నేను తిండిపోతు లెక్క ఇంట్ల కూర్చోని తింటె బాగుంటదా? నువ్వు మా అందరికి గూడ అమ్మవే గద? నీ మనసు అందుకు అంగీకరిస్తదా? చెప్పు?” అని అడిగితే, మా అమ్మ కండ్ల నీల్లు తుడుచుకుంట,
“నేనేం సమాధానం చెప్పగలనే? నువ్వంటె సదువుకున్నదానివి! నీకు చెప్పేటంత తెలివి నాకే ఉంటే, మీ అయ్యను ఒక దారిల పెట్టుకునేటి దాన్ని కాదా? నిన్ను పైకి చదివించేటి దాన్ని కాదా?” అని అడిగింది.
నేను మా అమ్మను ఓదార్చిన, ఒప్పించిన, మహానగరం వైపు నా మహా ప్రస్థానాన్ని ప్రారంభించిన.
కనీ, ఆరోజున, భవిష్యత్తుల నేనొక చరిత్ర సృష్టించబోతున్ననని నేనప్పుడు అనుకోలే, మా అమ్మైతే అస్సలు ఊహించలే!
+++
రెండు మూడు రోజులు ప్రయత్నించంగ, ఒక మంచి షాపింగ్ మాల్ల, పెద్ద బట్టల దుక్నంల నౌకరీ దొరికింది. నెలకు ఎనిమిది వేల జీతం. గా నౌకరీ దొరకంగనే నేను ఊహల లోకంల తేలిపోయిన. రంగురంగుల లైట్ల వెలుతుర్ల, ఏసీల నౌకరీ అనంగనె మురిసిపోయింది నా మనసు.
కానీ, నెల రోజులు గడిచేటప్పటికె నాకు నీరసం వొచ్చింది. దుకాణం పది గంటలకే తెరిచినా, మా సేల్స్ గర్ల్సుమి మాత్రం అంత తొమ్మిది కొట్టేసరికి అక్కడ ఉండాలె. గంట సేపట్ల షో రూమంత ఊడ్చి శుభ్రం చేయాలె. ఏసీ షో రూం కాబట్టి కొత్త బట్టల్లో నుండి రాలే సన్నటి దుమ్మూ, ధూళితోటి షోరూం అంతా నిండి ఉంటది. దాన్నంతా తడి, పొడి గుడ్డలతోటి తుడ్వాలె. అద్దాలను రుద్దిరుద్ది తళతళా మెరిసేటట్టు చేయాలె. మానెక్వీన్స్, రబ్బరు బొమ్మలకు, ప్రతీ రోజూ కొత్త చీరెలు కట్టి ముస్తాబు చేయాలె. బొమ్మలను ముస్తాబు చేయడం అయ్యేటి సరికి, మా సేల్ గర్ల్స్ అందాల ముఖాలన్నీ చెమటలు కక్కుకుంట జిడ్డు కారుతుంటయి. అది అంతా సిద్ధం చేసి, పది గంట గొట్టేసరికి, మేం దుకాణం తలుపులు తెరవాలె.
గప్పుడు, గా పది గంటలకు కౌంటరుల నిలబడుడు షురువు చేస్తే, మధ్యాహ్నం రెండింటి దాక మాకు నిలువు కాళ్ళ జీతమే. కూర్చోనీకి పర్మిషన్ లేదు. అసలు కూర్చునేటందుకు స్టూల్స్ కుర్చీలు గిన మాకు అందుబాటుల ఉండయి. పై అరల్లోని చీరెలు సర్దేటప్పుడు గిన, కస్టమర్లకు పై అరలల్ల ఉన్న కాస్ట్లీ చీరెలు చూపించడానికి గిన తెచ్చిన స్టూల్సును, బల్లలను ఆ పని కాగానే, యాజమాన్యం వెంటనే తీసేయిస్తుంది.
ఇటువంటి దుకాండ్లల్ల సేల్స్ గర్ల్స్ పని గంటల సమయంలో కూర్చోగూడదని ఒక అన్ రిటెన్ రూల్ ఉంది. అన్ని షాపుల్ల గూడ గంతే! షాపుల కస్టమర్లు లేనప్పుడు కూడ సేల్స్ గర్ల్స్ కూర్చోనీకి పర్మిషన్ లేదు. కూర్చుంటే బద్ధకం పెరుగుతదని యాజమాన్యం భావిస్తది. కౌంటరు ముందు అందంగ, ముద్దుగ, లేత కుందేలు పిల్లల లెక్కున్న సోఫాలను చూస్తుంటే నాకు కాళ్ళ నొప్పులు మరింత ఎక్కువయ్యేటివి. అప్పుడప్పుడు కాళ్ళు పట్టుదప్పి కూలబడిపోయేటిదాన్ని.
ఒక రోజు గట్ల కౌంటరు పక్కన కూలబడిపోయిన నన్ను సూపర్ వైజర్ చూసి మందలించిండు. నేను జల్దీ లేచి నిలబడి ‘సారీ‘ చెప్పి, లేచి నిలబడిన.
ఓ పదిహేను రోజుల తర్వాత నాకు మంత్లీ పీరియడ్ రావడం తోటి, ఋతుస్రావం ఎక్కువయితాంటె, మర్నాటికి సెలవు పెడ్తనని చెప్తె యజమాని కొట్టినంత పని చేసిండు. ‘పండగ రోజులల్ల సెలవూ గిలవూ జాన్తా నై‘ అనడంతో, తప్పనిసరై డ్యూటీకి వచ్చిన. కనీ, మధ్యలనే బాత్రూంకి పోయి కౌంటర్ దిక్కు నడుస్తాంటె శోషొచ్చినట్టయి గోదాముల గట్టాలపై పడిపోయిన.
అప్పుడే, అక్కడికి వచ్చిన సూపర్వైజర్ యజమానిని పిల్చుకోని వచ్చి నన్ను చూపించాడు. యజమాని కోపంతో దుర్భాషలాడుతూ తిట్టడంతో, నేను లేచి నీరసంగనే కౌంటర్లకు వచ్చి నిలబడ్డ.
సేటు, ఆ నెల జీతం, ఏడు వేలే ఇచ్చిండు. నేను కోపంగ, ‘ఎందుకు?’ అని ప్రశ్నించిన.
“నువ్వు గా రోజునాడు గోదాంలకు పోయి పండుకున్నవు. గందుకే, పెనాల్టీ కింద వేయి రూపాయలు కట్ చేసిన.” అని యజమాని చెప్పడంతో నేను ఖిన్నురాలనయిన.
‘గింత అన్యాయమా?’ అని నా మనసు ఆక్రోశించింది.
అసలైతే, గా మూడు నెలల ఉద్యోగంలనే, నేను బాగ డస్సిపోయిన. ఒక పెద్ద కారాగారంలో బందీగ ఇరుక్కపోయినట్టు ఫీలింగ్. ఊపిరాడనట్టనిపించేది. ఒక పెద్ద రాక్షసి నన్ను నిరంతరం గమనిస్తుందాన్న భయంతోటి బ్రతకాలంటే నాకు అస్సలే నచ్చటం లేదు.
చచ్చీ చెడీ రోజుకు పది గంటలు నిలబడీ, నిలబడీ, ఒక్క పది నిముషాలు కూర్చుంటనే వెయ్యి రూపాయల పెనాల్టీ అంటే నాకు దారుణం అనిపించింది. నా తోటి సేల్స్ గర్ల్స్ కష్టాలు చూసి నేను కన్నీరు మున్నీరయ్యేటిదాన్ని. ఏ వయసుల ఉన్న వాండ్లైనా సరే, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వచ్చిన సరే, ఆడోల్లకొచ్చే మరే ఆరోగ్య సమస్య అయినా సరే, నిలబడి ఉండాల్సిందే! గా సమస్యనే ఇప్పుడు నేనూ స్వయంగ అనుభవిస్తాన్న.
అసలు మాకు ఇస్తున్న జీతమే, రోజుకింత అని లెక్కగడితే, మూడు వందలు కూడ గిట్టడం లేదు. గీ మహానగరంల, అడ్డా మీద కూలీకే రోజుకు ఐదారు వందలు లభిస్తున్నయి. మేము అంతకంటె నాలుగు గంటలు ఎక్కువ పని చేసిన గూడ, వారికి ఇచ్చే కూలీల సగం గూడ మాకు గిట్టుత లేదు. మేము, గింత సదువుకోని గా మోటు కూలీ పని చేయలేక, గింత తక్కువ జీతానికి కూడా సిద్ధపడి పని చేస్తాంటే గూడ, మమ్మల్ని పశువుల్లెక్క, మల్ల ఇంకా మాట్లాడితే పశువుల కంటే హీనంగా – పశువులకన్న విరామం, విశ్రాంతి ఉంటయి. లేకపోతే అవి తిరగబడి కొమ్ములతో పొడుస్తాయి. తమ నిరసనను తెలియచేస్తాయి – ఒక్క నిముషం కూడా కూర్చోనియ్యకుండ పని చేయించే గీ దాష్టీకానికి చరమగీతం పాడాలని, నేను నిర్ణయించుకున్న!
నేను చదువుకున్న గా కొద్దిపాటి చదువే నాకా ధైర్యాన్నిచ్చింది.
+++
మరుసటి దినం నేను ఒక దృఢ సంకల్పంతోటి బోన్గిరికి నుండి మహానగరంకు బయల్దేరిన. కనీ, నేను పనిచేసే దుకాణంకు పోలేదు. నా బాధనంతా వెళ్ళగక్కుకుంట, క్రితం రాత్రంత కూసోని రాసిన కరపత్రాన్ని పదివేల కాపీలు ప్రింటు తీయించిన. మహిళాసంఘాలను, కార్మిక నాయకులను, వాళ్ళ సహాయం తోటి కార్మిక సంక్షేమ శాఖ అధికారులను కలిసిన. నా గోడును వెళ్ళబోసుకున్న.
తెల్లారి, ఆ పై రోజు, ప్రతి రోజూ మహానగరంల ప్రతీ షాపుకు పోయి అక్కడ పని చేసే మహిళా ఉద్యోగులను కలిసి వారి సమస్యలను పరిష్కరించేటందుకు నడుం బిగించాల్నని చెప్పిన.
చిన్నచిన్నగనే అయిన, ఉద్యోగులల్ల అసంతృప్తి రాజుకుంటున్న టైముకు, మా ఊర్లె నుంచి రోజూ మా తోటి సిటీకి వచ్చే ఒక టీవీ ఛానెల్ల పనిచేసే చిన్నపాటి ఉద్యోగి సహాయంతోటి, ఒక టీవీల ఇంటర్వ్యూ ఇచ్చిన.
నాలుగైదు నెలల హైద్రాబాద్ నగర జీవితం నాకు ఎన్నో నేర్పించింది. అందుల, కస్టమర్లతోటి అద్భుతంగ మాట్లాడే విద్య కూడ అబ్బడంతోటి, టీవీ షోలో, కన్నీళ్ళతోటి, హావభావాలతోటి, నా మనసులోని భావాలను స్పష్టంగ చెప్పి అదరగొట్టిన.
‘మేడమ్! నేను కూర్చోకూడదా?’ అని, ఇంటర్వ్యూ ప్రారంభం కాంగనే యాంకరును ప్రశ్నించిన. ఆ మేడమ్ ముందుగాల బిత్తరపోయి, తరువాత నా మాటల్లోని, శ్లేష అర్థమయి ఫక్కున నవ్వింది. ఆ కార్యక్రమానికి గా పేరే పెట్టి ప్రసారం చేసిన్రు. ఆ కార్యక్రమం బాగ పాపులర్ అయింది.
హైద్రాబాద్ మహానగరంల పనిచేసే లక్షల మంది సేల్స్ గర్ల్స్ గొంతుకను నేనై, నేను ‘రైట్ టూ సిట్‘ అనే ఉద్యమానికి నాంది పలికిన.
ఒక టీవీ నుండి మరో టీవీకి ఈ న్యూస్ పాకడంతోటి, ‘రైట్ టూ సిట్‘ అనే సమస్యపై నా పోరాటం మస్తు వైరల్ అయింది.
సేల్స్ గర్ల్సును పది గంటల పాటు కూర్చోనివ్వక పోవడమన్న, యాజమాన్యపు అమానవీయ ప్రవర్తనను ప్రజలు ఈసడించుకున్నరు. ఒక సామాజిక సమస్యల మానవీయ కోణం ఉంటే అది అందరి దృష్టిని ఆకర్షిస్తదని నాకర్థమైంది. సమాజం సానుభూతి చూపిస్తది. ప్రస్తుత సమాజంల సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇటువంటి కొన్ని సమస్యలకు ప్రాధాన్యత బాగ లభించి, వైరల్ అయిపోయి ప్రభుత్వాలను సైతం గడగడలాడిస్తున్నయి.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి సున్నితమైన సమస్యను, నేను వాల్ల దృష్టికి తీసుకు వచ్చినందుకు మెచ్చుకోని వెంటనే స్పందించింది. ఇది రాజకీయంగా కూడా వారికి లాభదాయకంగ ఉంటది కాబట్టి ప్రభుత్వం కూడ వెంటనే రంగంలోకి దిగింది.
కార్మిక సంక్షేమ శాఖ అధికారులతోటి నన్ను కూడా సభ్యురాలిగా చేర్చి ఒక కమిటీని ఏర్పాటు చేసి, మూడు నెలలల్ల, మా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఒక బిల్లును తయారు చేసి అసెంబ్లీల ప్రవేశపెట్టింది. గా ఆ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదించబడింది.
అందరి హర్షధ్వానాలు మధ్య ఆ బిల్లుకు నా పేరు మీదనే ‘సునీత బిల్ ఆఫ్ రైట్ టూ సిట్‘ అని నామకరణం చేసిన్రు. గా రోజు నుంచి సేల్స్ గర్ల్స్, పని లేనప్పుడు, కూర్చునేటందుకు హక్కుతో పాటుగ పనిచేసే చోట మహిళా ఉద్యోగులకు అనేక వసతులు కల్పించాల్నన్న ప్రభుత్వ చట్టం అమలులకు వొచ్చింది.
నా ఆరు నెలల కృషి ఫలితంగనే, నా పేరు మీదనే ఒక చట్టం అమలులకు వచ్చింది.
+++
ఆ రోజు సాయంత్రం, నేను గా బిల్లు కాపీ పట్టుకోని సికింద్రాబాద్, గదే, లష్కర్ నుండి, మా ఊరు, బోన్గిరికి పోయేటందుకు, “కాకతీయ” ప్యాసెంజర్ రైలెక్కినప్పుడు నాకు ఘనస్వాగతం లభించింది.
అందరు ‘కూర్చోమని‘ చెప్పి తమ సీట్లల్ల నుండి లేచి నిలబడి నన్ను ఆహ్వానించిన్రు.
గంతే, ఇగోనుల్ల, నేను, ‘సునీత బిల్ ఆఫ్ రైట్ టూ సిట్‘, జీవో కాపీని పట్టుకుని, గర్వంగ కూర్చున్న!
+++
(యథార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ. ఇటువంటి చట్టాన్ని సెప్టెంబర్ 13, 2021న, తమిళనాడు శాసనసభ ఆమోదించింది. అంతకు ముందే కేరళ ప్రభుత్వం చట్టం చేసింది.) (ఈ కథ నమస్తే తెలంగాణ సౌజన్యంతో… మరియు రచయిత అనుమతితో… ) (ఈ మధ్య చాలా మంది సేల్స్ గర్ల్స్ యొక్క ‘నిలబడి పనిచేయడం’ సమస్య మీద పోస్టులు పెడుతున్నారు. ఇదే సమస్య మీద కథ ఇది. ‘బోన్గిరి టూ లష్కర్’ కు పదివేల రూపాయల బహుమతి కూడా వచ్చింది..)
Share this Article