Nàgaràju Munnuru…… మా ప్రాజెక్ట్ Aspire లో శిక్షణ పొంది, ఉద్యోగం చేస్తున్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది.
గుడ్ మార్నింగ్ సర్
గుడ్ మార్నింగ్ _________,
Ads
సార్, మీరు చాలామందికి హెల్ప్ చేస్తారు కదా! నాకు ఒక హెల్ప్ కావాలి సర్.
ఇంతకు నీకు ఏ సహాయం కావాలో చెప్పు, నేను చేయగలిగేది అయితే తప్పకుండా చేస్తాను.
సర్, నాకు ఒక 5500 కావాలి సర్.
ఎందుకు ఈ డబ్బులు?
అమెజాన్ వర్క్ ఫ్రం హోం అని నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది సర్. అందులో ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ డబ్బులు కడితే రెండు రోజుల్లో డబల్ అమౌంట్ వస్తుంది.
చూడు _______, నీకు ఏదైతే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఆఫర్ అని వచ్చిందో అది ఫేక్. అందులో డబ్బులు కడితే కట్టిన డబ్బులు పోతాయి. అమెజాన్ లాంటి కార్పొరేట్ సంస్థలు ఉద్యోగం ఇవ్వడం కోసం అభ్యర్థుల నుండి ఏటువంటి డబ్బులు తీసుకోవు.
అది కాదు సర్ నేను ఆల్రెడీ 3000 కడితే మళ్ళీ నాకు 3000 వాపస్ వచ్చాయి. ఇప్పుడు 5500 కడితే రెండు మూడు రోజుల్లో వస్తాయి. ఆ డబ్బులు రాగానే మీకు ఇస్తాను సర్.
చూడు ________, నీ ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటే నేను ఇప్పుడు చెప్పేది రికార్డ్ చేసుకో. నీకు వచ్చింది జాబ్ ఆఫర్ కాదు, సైబర్ నేరగాళ్లు పంపిన మెయిల్. మొదట చిన్న చిన్న అమౌంట్ కట్టించుకుని, వాటిని వాపస్ ఇచ్చి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత ఇంకా పెద్ద అమౌంట్ కడితే రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతారు. పెద్ద అమౌంట్ కడితే ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందని, ఇంకా పెద్ద అమౌంట్ కడితే ఇంతకు మునుపు కట్టినవి, ఇవి కూడా కలిపి ఇస్తామని మాయమాటలు చెబుతారు. అలా మెల్ల మెల్లగా మీ దగ్గర వీలైనంత డబ్బులు తీసుకుని తర్వాత మాయం అవుతారు.
మా సంగారెడ్డిలో ఇలాగే ఒక సాఫ్టువేర్ ఉద్యోగి డబ్బులు కట్టి రెండు మూడు రోజుల్లో రెట్టింపు డబ్బులు వస్తున్నాయనే ఆశతో ఇంకా కట్టుకుంటూ వెళ్ళాడు. కట్టిన డబ్బులు రాకపోగా సైబర్ నేరగాళ్లు చెప్పినట్టు ఇంకా ఎక్కువ డబ్బులు కడుతూ పోయాడు. చివరికి ఇంట్లో చెల్లెలి పెళ్ళి కోసం నాన్న దాచి పెట్టిన 20 లక్షలు కూడా ఇంట్లో వాళ్లకు తెలియకుండా కట్టాడు. చివరికి మోసపోయాను అని తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటు చెల్లి పెళ్లి ఆగిపోయింది, ఇటు ఇతని ప్రాణం పోయింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో తెలుసు నాకు నువ్వు ఇప్పటికైనా ఇలాంటి వాటికి దూరంగా ఉండు.
సర్, నా మీద నమ్మకం లేదా? ఒక రెండు మూడు రోజుల్లో మీకు డబ్బులు వాపస్ ఇస్తాను. ఒకవేళ డబ్బులు పోతే నాకు సాలరీ వచ్చాక మీ డబ్బులు మీకు ఇస్తాను.
నేను ఇంకోసారి చెబుతున్న, నేను నీకు డబ్బులు ఇవ్వను. నువ్వు నా దగ్గర డబ్బులు దొరకలేదు అని ఇంకొకరి దగ్గర డబ్బులు తీసుకుని దీనికి కట్టకు. ఒకవేళ నా మాట వినకుండా, నాకు తెలియకుండా డబ్బులు కడితే తర్వాత పశ్చాత్తాప పడతావు. కొన్నిసార్లు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కితే జీవితమే పోతుంది. నీ మంచికొరి చెబుతున్న ఇది ఇక్కడే ఆపెయ్.
టక్ మని ఫోన్ కట్ అయ్యింది… – నాగరాజు మున్నూరు
Share this Article