పొద్దున్నే ఓచోట… ఎక్కడ దొరికిందో గానీ ఒకాయన ఆంధ్రప్రభ పట్టుకున్నాడు… పక్కవాడిని అడుగుతున్నాడు… ‘‘కేసీయార్ ఒక్కో సిలిండర్ మీద 1000 రూపాయల సబ్సిడీ ఇస్తాడట… ఈ పేపరోడు రాసిండు… ఇప్పుడు సిలిండర్ రేటే 955… అంటే సిలిండర్ బుక్ చేస్తే 45 రూపాయలు ఉల్టా మనకే ఇస్తారా..? భలే ఉంది కదా స్కీమ్..?’’
ఆ పక్కన కూర్చున్నాయన తెల్లమొహం వేశాడు… ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు… వెయ్యి రూపాయల సబ్సిడీ అని వార్త రాసిన విలేఖరి, పబ్లిష్ చేసిన ఓనర్, ఇలాంటి వార్తలను ఫస్ట్ బ్యానర్లు వేసే సంపాదకుడు ఏమైనా ఆలోచించారో లేదో తెలియదు… కానీ ఓ సగటు మనిషి వేసిన కామన్ సెన్స్ ప్రశ్న ఇది… చంద్రబాబుకు టీవీ5 సాంబశివరావు, మహాన్యూస్ వంశీ ఎలాగో… కేసీయార్‌కు ఆంధ్రప్రభ అలా తయారైంది…
సరే, ఏడాదికి ఐదారు సిలిండర్లకు ప్రభుత్వం 1000 రూపాయల సబ్సిడీ ఇచ్చే చాన్సుందని అనుకుందాం… ఒకవేళ కేంద్రం ధర పెంచితే, ఆ ధరలో 1000 పోను మిగతావి చెల్లిస్తే సరిపోతుంది అనుకుందాం… కానీ ఇప్పటి ధర ప్రకారం ప్రభుత్వం ఉల్టా చెల్లించకపోయినా సరే, ఫ్రీ సిలిండర్ ఇచ్చినట్టు కదా… కేసీయార్ రైతులకు డబ్బులిస్తాడు, కానీ కౌలు రైతులను అస్సలు గుర్తించడు, సేద్యం చేయకపోయినా సరే, ఎవరి పేరిట భూమి ఉంటే వాళ్లకు డబ్బులిస్తాడు… నిజంగా ప్రాణాలను పణంగా పెట్టి సాగుచేసే కౌలుదార్లను మాత్రం పట్టించుకోడు…
Ads
సో, ఆయన తన నిజతత్వం మేరకు కేవలం పేద వర్గాలకు, అదీ అగ్రవర్ణేతరులకు మాత్రమే ‘‘సిలిండర్ సాయం’’ చేయాలని భావిస్తే… ఆ వర్గీకరణ సాధ్యమేనా..? కాంగ్రెస్ తన సిక్స్ గ్యారంటీల్లో 500 రూపాయలకు సిలిండర్ అంటోంది కాబట్టి దానికి ఇది కౌంటరా..? ఆమధ్య ఎక్కడో అన్నట్టు గుర్తు… వాళ్లు సోషల్ పెన్షన్ పెంచే హామీ ఇస్తే, నేను 3 వేలు చేయలేనా అని కేసీయార్ చెప్పినట్టు చదివిన గుర్తుంది… ఇదే దిశలో 3116 రూపాయల సోషల్ పెన్షన్ కేసీయార్ ప్రకటించబోతున్నాడని రాశారు… వోకే…
రాసిందాన్ని ఎవరూ ఖండించరు కదా… అబ్బే, మేం అలాంటివేమీ చేయబోవడం లేదని ప్రకటించరు కదా… సో, 12 అబ్బురపరిచే పథకాలు అట… అంటే, కాంగ్రెస్ సిక్సర్ కొడితే కేసీయార్ రెండు వరుస సిక్సర్లు కొడతాడని ఆంధ్రప్రభ ఘంటాపథంగా చెప్పేస్తోంది… కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలపై జనంలో చర్చ జరుగుతోంది… ప్రత్యేకించి ఆడవాళ్లకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు, 500 రూపాయలకే సిలిండర్ వంటివి చర్చనీయాంశాలవుతున్నాయి…
కర్నాటకలో కాంగ్రెస్‌ను గెలిపించినవి ఇలాంటి స్కీములే అని కాంగ్రెస్, కొందరు విశ్లేషకులు నమ్ముతున్నారు… దాన్ని పక్కన పెట్టినా… ఇన్నేళ్ల తన పాలనను మెచ్చి వోటర్లు మళ్లీ తనను గెలిపిస్తారనే ధీమా కేసీయార్‌లో లేదా..? తను కూడా కాంగ్రెస్‌లాగే ఈ ఎన్నికల వరాల బాట పట్టాల్సిందేనా..? పోనీ, ప్రజల్లో కేసీయార్ ప్రకటించబోయే వరాల మీద చర్చ జరగటానికి ఆంధ్రప్రభ వంటి పత్రికల వార్తలు ఉపయోగపడ్డాయే అనుకుందాం… తీరా, వాటిల్లో ఏం జరగకపోయినా కేసీయార్ మీద నెగెటివ్ ఒపీనియన్‌కు దారి తీయదా..? అంటే ఈ భజన పత్రికల వల్ల కేసీయార్‌కు లాభమా..? నష్టమా..? కేసీయార్ సార్… కొంపదీసి మీ మేనిఫెస్టో రచన బృందంలో ఇలాంటి జర్నలిస్టులను కూడా పెట్టడం లేదు కదా…!!
Share this Article