మీకు యయాతి కథ తెలుసు కదా… ఏదో శాపానికి గురై వృద్ధాప్యం మీదపడితే… తన కొడుకుల్ని తమ యవ్వనాల్ని ఇవ్వమని ప్రాధేయపడతాడు… ఎవడూ ఇవ్వడు… చిన్న కొడుకు సరేనని ఇస్తాడు… యయాతి నవ యవ్వనుడు అవుతాడు… మిగతా కథ జోలికి పోవడం లేదు గానీ ఈ యవ్వనంలోకి రావడం వరకే పరిమితం అవుదాం ఇక్కడ…
పొద్దున్నే ఓ మిత్రుడి పోస్టు చూడగానే ఈ కథే గుర్తొచ్చింది ఎందుకో గానీ… రేఖ పారిస్ వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని వచ్చింది, యవ్వనవతిగా కనిపిస్తోందని పోస్టు… ఆమె వయస్సు 68 ఏళ్లు… హేమమాలిన వయస్సు 74 ఏళ్లు… ఇద్దరూ ఏ అమృతం తాగారో గానీ వాళ్ల వయస్సు అప్పుడెప్పుడో ఆగిపోయింది… సగటు మహిళలు ఈర్ష్యపడే అందమైన మొహాలు అవి…
Ads
కావచ్చు, రేఖ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే ఉండొచ్చు… ఈరోజుకూ ఆమె తన మొహం మీదకు ముడతల్ని రానివ్వడం లేదు… ఏం వాడుతుందో ఏమిటో మరి… ప్లాస్టిక్ సర్జరీ మొత్తం మొహానికి చేయించుకుందా..? అలాంటి సర్జరీలు ఉన్నాయా..? అనే చర్చ ఇక్కడ వద్దు గానీ… హేమమాలిని తన మొహానికి ఏం పూస్తుందో తెలుసుకోవాలని ప్రతి ఇండియన్ లేడీ మనసులో ఉంటుందనేది నిజం… నిజానికి అది ఆమె జెనెటిక్ క్వాలిటీ… అందరికీ ఆ వరం దక్కదు… (మెయింటెనెన్స్ అదనం… భారీ ఎక్స్‌పెన్సివ్ కూడా…)
ఈ ఆలోచనల నడుమ మరో స్టోరీ కనిపించింది… అది ఇంకా ఆసక్తికరం… ఓ మనిషి అమెరికాలో ఏటా 17 కోట్లు ఖర్చు చేస్తున్నాడట… అంటే నెలకు దాదాపు కోటిన్నర… దేనికి..? తన వయస్సును వెనక్కి మళ్లించడం కోసం… ఐతే అది సాధ్యమేనా..? వయస్సు రివర్సబులేనా..? వేల తరాలుగా ఎవడికీ అంతుచిక్కని, మర్మం తెలియని ప్రశ్న… అప్పట్లో చక్రవర్తులు తమ రాజ వైద్యుల్ని ఈ మందుల కోసం వేధించేవారట… ఇదేమైనా కాలయంత్రమా..? అలా వెనుకటి కాలంలోకి తీసుకెళ్లి దింపేయడానికి..?
ఈ అమెరికా కుబేరుడు యవ్వనాన్ని తిరిగి పొందడం కోసం రోజుకు 111 మాత్రలు మింగుతున్నాడట… సరే, అంతకు డబుల్ మాత్రలు వేసుకోవాలని చెప్పినా వేసుకుంటాడు… అన్నేసి సూదులు పొడిపించుకొమ్మన్నా రెడీ… కానీ..?
ఆయన పేరు బ్రయాన్ జాన్సన్… పేమెంట్ కంపెనీ బ్రెయిన్ ట్రీ ఫౌండర్… దాన్నే ఈ-బేకు అమ్మేశాడు… 80 కోట్ల డాలర్లు వచ్చిపడ్డాయి… ఇక ఇప్పుడు 18 ఏళ్ల కుర్రాడిలా మారిపోదామని ప్రయత్నం… ఈయనకు తగినట్టు 30 మంది డాక్టర్ల టీం ఒకటి ‘ప్రాజెక్టు బ్లూప్రింట్’ పేరిట ఓ ‘ఆపరేషన్’ స్టార్ట్ చేసింది… వారిలో రకరకాల వైద్యనిపుణులున్నారు… ఏం తినాలి, ఏం వ్యాయామం చేయాలి వంటివన్నీ వాళ్లే పర్యవేక్షిస్తున్నారు…
చిత్రం ఏమిటంటే… ఆ టీం ప్రయోగాలు ఫలిస్తున్నాయట… సదరు జాన్సనే చెబుతున్నాడు… అసలు వయస్సు తగ్గిపోవడం కాదు, అసలు చావు లేకుండా ఇలాగే సజీవంగా, యవ్వనంతో ఉంటాను అంటున్నాడు ఆయన… సాధ్యమేనా..? ఏమో… గుర్రమెగురావచ్చు… ఒకరికి ఈ ప్రాజెక్టు సక్సెసయితే ఇంకేముంది..? కుబేరులందరూ ఆ ప్రాజెక్టు కోసం క్యూ కడతారు… మనిషికి మళ్లీ నవ యవ్వనంలోకి తీసుకెళ్తామంటే ఎవరికి మాత్రం చేదు..!! 46 ఏళ్ల జాన్సన్ 18 ఏళ్ల యువకుడిగా మారిపోయే ఫలితాలు చూశాక చాలామందిలో ఆ ఆశపుడుతుంది… కొంపదీసి రేఖకూ, హేమమాలినికీ ఆ ప్రాజెక్టు బ్లూప్రింట్ల గురించి తెలుసా ఏమిటి..?
Share this Article