బోయపాటి దర్శకత్వం అంటేనే… లాజిక్కులు వెతక్కూడదు… దంచుడే దంచుడు… నరుకుడే నరుకుడు… బీభత్సమైన హింస… గాల్లోకి తేలిపోతూ రౌడీలు… సూపర్ మ్యాన్‌లా హీరో ఫైటింగులు… కథా కాకరకాయా చూడొద్దు… భీకరమైన బీజీఎంతో హీరో నెత్తురు పారిస్తూ ఉంటాడు… థియేటర్ దడదడలాడిపోతూ ఉంటుంది… సీఎం లను సైతం తుక్కుతుక్కు కొట్టేసాడు హీరో… స్కంద కాదు, బోయపాటి బొంద… మొన్నమొన్నటి బాలయ్య అఖండ అయినా… రాపో, అనగా రామ్ పోతినేని నటించిన తాజా స్కంద అయినా అంతే…
బోయపాటి మారడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే… ఊర మాస్ మసాలా రొటీన్ దంచి కొట్టుడు మూవీ… హీరో ఇమేజీని ఆకాశం ఎత్తులో నిలబెడుతున్నాను అనుకుంటాడు తను… కానీ ఇప్పుడు ఇలాంటి సినిమాల్ని ఎవడూ ఇష్టపడటం లేదు అనే నిజాన్ని గుర్తించడం లేదు… అఖండ సక్సెస్‌కు కారణాలు వేరు… థమన్ బీజీఎం ఓ రేంజులో ఉంటుంది… బాలయ్యకు రాసిన డైలాగులు రేంజ్ కూడా టోటల్లీ డిఫరెంట్… తన లుక్కు వేరు… రొటీన్ బాలయ్య మార్క్ దంచుడులోనూ ఓ కొత్తదనం ఉంది…
కానీ స్కందలో ఏముంది..? అదే బోయపాటి మార్క్ బీభత్సం ఉంది… మరీ ఓచోట 20- 30 నిమిషాల యాక్షన్ సీన్ పెట్టేశాడు… రామ్ దంచుతూనే ఉంటాడు… దాన్ని ఎనర్జీ అనాలట… అఖండ మార్క్ బీజీఎంతో పోలిస్తే స్కంద బీజీఎం ఏమూలకూ ఆనలేదు… థమన్ చల్లబడిపోయాడు… అరె, ఇలాంటి ఊర మాస్ సినిమాలకు బీజీఎం మస్తు దంచాలిర భయ్… పోనీ, పాటలైనా ఇరగదీసినవా అంటే అదీ లేదాయె… ప్చ్, ఫాఫం థమన్… ఓ నాలుగు కాపీ ట్యూన్లు అలవాటైన రీతిలో పట్టుకుంటే సరిపోయేది కదా థమన్…
Ads
అప్పుడెప్పుడో డెబ్యూ దేవదాసు… తరువాత రెడీ… అంతేనా రామ్..? ఇక నువ్వు మారవా..? అదే మాస్… అదే ఇమేజీ బిల్డప్పులు… అదే రొటీన్ తెలుగు సినిమా మార్క్ లాజిక్ లేని కథలు… అవే లుక్కులు… మధ్యలో ఒక్క సినిమా కాస్త బెటర్… ఉన్నది ఒకటే జిందగీ… తరువాత ఇస్మార్ట్ శంకర్ హిట్టే… కానీ అదీ దంచుడు సినిమాయే… కాకపోతే డబుల్ యాక్షన్ రక్తికట్టింది… దర్శకుడి పనితనం కనిపించింది… మళ్లీ ఈ రాముడు పాత మాస్ బాలుడే…
అసలు తెలుగు హీరోలకు టేస్ట్ తెలియదు… దంచుడు మాత్రమే బాగా తెలుసు… ఎన్ని సినిమాల్ని జనం ఛీత్కరించినా సరే, మళ్లీ మళ్లీ అవే… దాదాపు అందరిదీ అదే బాట… హీరోయిన్లకు వాల్యూ ఉండదు… ఎమోషనల్ సీన్లలో లాజిక్ ఉండదు… చెప్పుకుంటే పోతే బోలెడు మైనసులు… ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లున్నారు… ఒకరు తాజా సెన్సేషన్ శ్రీలీల… రెండు సయీ మంజ్రేకర్… ఇద్దరూ ఉన్నారంటే ఉన్నారు… అంతే…
శ్రీలీల అదరగొట్టే డాన్సర్… కనీసం డాన్సులకైనా ఆమెను సరిగ్గా వినియోగించుకోలేదు… రామ్ కూడా మంచి డాన్సరే కదా, కానీ అలా ఇద్దరూ పోటీపడేలా కంపోజ్ చేసిన డాన్సులు ఏవి..? ఎంతసేపూ దంచుడు యావలో పడి ఇవన్నీ మరిచిపోయినట్టున్నాడు బోయపాటి…
మీకు దంచుడు, కుమ్ముడు సినిమాలంటే ఇష్టమా..? తెలుగు హీరోల ఇమేజీ బిల్డప్పులని ఎంజాయ్ చేస్తుంటారా..? సినిమా కథలో లాజిక్కులేమిట్రా అని నవ్వుకుంటూ ఉంటారా..? స్కంద చూడొచ్చు మీరు… సినిమా తెర నిండా నెత్తురే…! కామన్ సెన్స్ తొక్కా తోలూ అంటే మాత్రం రాపో మన తొక్క తీయడం, తోలు వొలవడం ఖాయం.. ! (సోర్స్ :: ఓవర్సీస్ ఫీడ్ బ్యాక్)
Share this Article