*సంతోషకరమైన జీవితం ఎలా గడపాలి?!*
ప్రకృతిలో మేధోపరంగా విపరీతంగా ఎదిగిన మనిషికి ఉన్న కష్టాలు, చికాకులు అన్నీ ఇన్నీ కావు. కోట్లాది జీవజాతులలో కూడా మనుషుల్లో ఉన్నట్టే ప్రేమ, సుహృద్భావం, సౌభ్రాతృత్వం వంటివి అన్నీ చూస్తాము. ఇటీవల కాలంలో మనం వైరి జాతులుగా భావించే కొన్ని జంతువులు ప్రేమాభిమానాలతో ఉండడం కూడా చూసాం. మనిషి కాకుండా ఇతర జంతువుల్లో కెరీరిస్టు ధోరణులు, తోటి జంతువులపై విద్వేషాలు కనిపించవు.
ఆహార వేట కోసమే మొత్తం సమయాన్ని గడపాల్సిన జంతువులతో పోలిస్తే… ఎంతో తీరిక సమయాన్ని సొంతం చేసుకున్న మనిషి, జీవితాన్ని గొప్పగా ఆస్వాదించే అవకాశం ఉంది. వందల, వేల సంవత్సరాలుగా తన సంతోషం కోసం అభివృద్ధి పరుచుకున్న కళలను ఆస్వాదించే వెసులుబాటు మనిషికి మాత్రమే ఉంది. ఉదాత్తమైన పనులను విలువలు – ఆదర్శాలుగా మనిషి ఎంచుకొన్నాడు. అట్టి ఉదాత్తమైన జీవితంతో మనిషి ఎనలేని సంతృప్తిని, హాయిని అనుభవించవచ్చు.
జంతు ప్రపంచంలో భాగమైన మనిషి… విచిత్రంగా ఇన్ని వేల సంవత్సరాలలోనూ అనేక అవలక్షణాలను మూట కట్టుకున్నాడు. ఒకరిని మించి మరొకరు పై చేయి సాధించాలని తాపత్రయం మనిషిని నిలువనీయడం లేదు. వస్తువులు – భూములు – బలం – హోదా… ఇవే సమాజానికి తన ఆధిక్యాన్ని చూపిస్తాయనే భ్రమలో పడిపోయాడు. మనిషి ఒక్కసారి ఈ సంపద పోగు చేసుకోవటం అనే విషవలయంలో పడితే ప్రశాంతతను, సుఖాన్ని కోల్పోతాడు. నిజానికి మానవుని మేధ, చుట్టూ ఉన్న వనరులతో ప్రపంచంలోని అందరూ హాయిగా, ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంది. కానీ మనిషి అలా చేయడు కదా! ఇంకా ఇంకా సంపదను, సుఖాలను తోడుకోవాలనే వెర్రి ఆశతో తిక్క ఎక్కిపోతున్నాడు.
ఆశలు ఉన్నచోట ఆశాభంగాలు ఉంటాయి… చుట్టుపక్కల వాళ్లతో పోల్చుకున్నప్పుడు తనకు ఏదేదో తక్కువ అవుతున్నట్టుగా మనిషి భ్రమిస్తాడు. దాంతో మానసికంగా ‘నిత్యం పరుగు’ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ రకమైన నిరంతరమైన ఉత్తేజిత స్థితి వలన జీవనశైలి జబ్బులుగా చెప్పుకునే గుండెపోటు, మెదడు స్ట్రోక్, డయాబెటిస్, స్థూలకాయం వంటి వాటి బారిన పడి జీవితాన్ని బాధామయం చేసుకుంటాడు. అటువంటి వారిలో కొందరు తక్కువ వయసులోనే చనిపోవడం కూడా చూస్తున్నాము.
చాలా తేలికగా ఆరోగ్యకరమైన, దీర్ఘ కాలపు ప్రశాంత జీవితాన్ని గడపవచ్చు. తోటి మనుషులను ప్రేమించడం, ఆధిక్య స్థాయి కోసం పరుగులు పెట్టకుండా ఉండటం, ఎవరితోనూ పోల్చుకోకుండా ఉండటం… కేవలం వీటితో ప్రశాంతంగా గడపవచ్చు… ఉన్న తెలివితేటలను – సామర్థ్యాలను ఉపయోగించుకుని సమాజానికి సేవ చేస్తూ, గొప్పగా సంతృప్తిని పొందవచ్చు. దీనికోసం లక్ష్యాలంటూ నిర్దేశించుకొనక్కర్లేదు. ఒక్కసారి ఎవరితోనూ పోల్చుకోకుండా ఉండటం మొదలు పెడితే… జనం మన గురించి ఏమనుకుంటున్నారో అనేదాని కోసం కాకుండా… మన కోసం – సమాజం కోసం ఉదాత్తమైన జీవితాన్ని గడుపుతూ ప్రశాంతంగా హాయిగా ఉండవచ్చును —– By… డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండీ, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ
Share this Article