Padmakar Daggumati…… ” మంచి ఉపన్యాసం ఒక కళ” … నాలెడ్జ్ అనేది సాపేక్షం. అందులో ఎవరి స్థాయి వారిది. జ్ఞాపకశక్తి కూడా సాపేక్షమే. ఎవరి కెపాసిటీ వారిది. సరే ఇదలా ఉంచుదాం.
చక్కటి ఉపన్యాసం ఇవ్వగలగడం ఒక కళ, ఒక నైపుణ్యం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, లేదా ఇతర ప్రధాన బాధ్యులు తాము అనేక సందర్భాలలో మాట్లాడవలసి వస్తుంది. పార్టీ ముఖ్యుల సమావేశంలో మాట్లాడాలి. పార్టీ ఇతర నాయకులతో మాట్లాడాలి. పార్టీ కార్యకర్తలతో మాట్లాడాలి. పార్టీ అభిమానులతో మాట్లాడాలి. ప్రజలతోనూ మాట్లాడాలి. తన మాటలకి పై కేటగరీలలో ప్రేక్షకులు ఎవరోననే స్పృహ ఉండాలి.
ఈ స్పృహ లేకుండా ఎదురుగా ఎవరుంటే వాళ్లే ప్రజలు అనుకుంటూ మాట్లాడితే ప్రజలు అలాంటివారిని ఎప్పటికీ నాయకుడిగా గుర్తించరు.
Ads
ఉదాహరణకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలలో ఎదురుగా అభిమానులను పెట్టుకుని మీరు మీరు అంటూ తను మాట్లాడేది తన అభిమానులతో అనుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. తన వ్యక్తిగత ప్రవర్తన, తన నిజాయితీ, తన సున్నితత్వం అంటూ అనేక ఉదాహరణలు చెబుతూ పోతుంటాడు.
అంతవరకు అదంతా అభిమానులకు ఐతే ఓకే. అదే సమయంలో రాజకీయ ఉపన్యాసం కూడా కలిపేసి ప్రజలకు రాష్ట్రంలో పరిపాలన ఎంత అధ్యాన్నంగా అరాచకంగా ఉందో అంటూ ఆవేశంగా చెబుతాడు. ఎక్కడా ప్రజలు అనేమాట కూడా వాడడు. ఆవేశంతో మాట్లాడే నాయకుడి అప్పీల్ గానీ, విమర్శలు గానీ రాష్ట్రంలోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించలేరనేది ఒక వాస్తవం.
ఒక నాయకుడికి ఆవేశం ఎప్పుడు ఉండాలంటే ఏదైనా ఘోరమైన అన్యాయం ఎదుటిపక్షం చేసినప్పుడు మాత్రమే ఉండాలి. నిరంతరం చేసే రోజువారీ ఉపన్యాసాలలో ప్రజలకు రాష్ట్రంలోని పరిస్థితులు ఓర్పుగా వివరించాలి. ఒక నాయకుడు తన నిజాయితీ, సున్నితత్వం గురించి ప్రజలకు వివరించేవారిని ప్రజలు అసలు నమ్మరు. ప్రజలకు మంచిచేసే చర్యలు ఏమిటో మాత్రమే ప్రజలకు కావాలి.
ఒకపక్కన కేకలు పెడుతూ సున్నితమైన వాడినంటే అభిమానులు అతని అభిమానులు కాబట్టి తర్కించుకోకపోవచ్చు. కానీ ప్రజలు మాటలను చేతలను పోల్చుకుంటారు. రాజకీయ ఉపన్యాసకుడికి తన ఎదురుగా వందమంది ఉన్నా, పదిమంది ఉన్నా వారిని రాష్ట్ర ప్రజలందరిగా గుర్తించే లక్షణం ఉండడం అవసరం. బహుశా అభిమానుల ఈలలు తన ఎదురుగా ఉండేది ప్రజలనే అభిప్రాయం కలగనివ్వక పోవచ్చు.
ప్రజలు నాయకులలో వేలు చూపించి వార్నింగ్ ఇచ్చే లక్షణాలు మెచ్చరు. ప్రజలలో లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. తనకంటే పైకులాలు తమ అహంతో మెచ్చుకోరు, కింది కులాలు నాయకుడి అహంకారం అనుకుని అసలు మెచ్చరు. పత్రికలలో ఎడిటింగ్ చేసి రాస్తారేమో గాని, లైవ్ మీటింగ్ ప్రసారం అవుతున్న కాలంలో రాజకీయ ఉపన్యాసాల ధోరణి నాయకులు మార్చుకోవాలి. ఈ విషయంలో పేర్నినాని ఉపన్యాసంగాని, ప్రెస్ మీట్ గాని చాలామంది నేర్చుకోదగిన విధంగా ఉంటాయి అనుకోవచ్చు.
పైన పేర్కొన్నటువంటి తప్పులే చంద్రబాబు కూడా సభలలో చేస్తుంటాడు. రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని అంటూ, మరోపక్కన ఏం తమ్ముళ్లూ.. అంటాడు. అలాంటప్పుడు తన మాటలను ప్రజలంతా ఎందుకు రిసీవ్ చేసుకుంటారు? తన ఉపన్యాసం ఎదురుగా ఉన్నవాళ్లకే అని సరిపెట్టుకుంటారు. స్వతహాగా చంద్రబాబు ప్రజలతో కనెక్ట్ కాగలిగే ఉద్వేగపూరిత ప్రసంగం చేయలేడు.
తన ఎదురుగా ఉన్నవారితో రాష్ట్రంలో పాలన అధ్వాన్నంగా ఉందని ఒప్పించడం తన అభిమతం కావచ్చు. కానీ అలాంటి ఎత్తుగడ ఎన్టీఆర్, వైయస్సార్, కరుణానిధి, ఎమ్జీఆర్, జయలలిత, మాటల మాంత్రికులు కేసీఆర్ మరియు మోడీ వంటివారికి సరిపోతుంది. వాళ్లకి ప్రజలందరితో ఎమోషనల్ కనెక్టివిటీ ఎలా ఉండాలో తెలుసు. ఈ వయసులో తాను పదేపదే ఏం పీకావు లాంటి భాష ఆ పార్టీ అభిమానులని సంతృప్తి పరచవచ్చు, కానీ ప్రజలంతా మెచ్చుకోరు.
ఆ వయసు, అంత అనుభవం ఉన్న నాయకుల మాటలు కొత్త తరాలకు ఆదర్శంగా ఉండగలగాలి. మళ్లీ పవన్ కళ్యాణ్ దగ్గరకి వస్తే… తన అభిమానులతో తనకి ఉన్న విపరీతమైన ఎమోషనల్ కనెక్టివిటీ ప్రజలందరితో ఉందనే భ్రమలో తానున్నాడు అనిపిస్తుంది. తాను ఇండివిడ్యువల్ గా పార్టీని ఎదిగించుకుంటూ, ప్రజలకు తానేం చేస్తాడో, తన అవసరం రాష్ట్రంలో ప్రజలకు ఎలా అవసరమో, పాలనాపరమైన విశేషాలు ఒక్కటి కూడా ఎప్పుడూ ప్రస్తావించకుండా జగన్ని దించడమే తన లక్ష్యంగా మాట్లాడడంతో ప్రజలతో కనెక్టివిటీ తనే కోల్పోయాడు.
ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పటికీ తాను ఎక్కడ నుండి పోటీ చేస్తాడో కూడా ప్రజల నుంచి దాచడం. దీనిని ప్రజలు ఎలా అర్ధం చేసుకుంటారు? అంటే తాను ఎక్కడనుండి గెలుస్తాడో తనకే క్లారిటీ లేదని కదా అనుకుంటారు. ఇంక అలాంటి వ్యక్తికి రాష్ట్ర పాలనపై క్లారిటీ ఉందని ఎలా నమ్మాలి? ఎలా నమ్ముతారు?
ఇక జగన్ దగ్గరకు వద్దాం. జగన్ పెద్ద స్పీకర్ కాదనేది నిజం. అయినా తను ఓదార్పు యాత్ర ద్వారా, పాదయాత్ర ద్వారా ప్రజలతో ఎమోషనల్ కనెక్టివిటీని బాగా పెంచుకున్నాడు. ప్రతి ఉపన్యాసంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలందరినీ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఓన్ చేసుకుంటాడు. పైన దేవుడు, ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్నాను అంటాడు. ఇదే ప్రజలతో కనెక్టివిటీలో ఉండడం అంటే.
ఈ మాటలలో నిజమెంత, చిత్తశుద్ధి ఎంత అనేది పాలనలో చూస్తారు ప్రజలు. నమ్మితే నచ్చితే మళ్లీ ఎన్నికల్లో గెలిపిస్తారు. లేకపోతే లేదు. ఒకటి మాత్రం నిజం. మాట్లాడే నాయకుడి ఆవేశం తమ మంచి కోసమా లేక అతని అధికారం కోసమా అనేది ప్రజలు క్షణాలలో గ్రహిస్తారనేది మాత్రం నిజం.
Share this Article