‘‘ప్చ్, ప్రస్తుతం నేను లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఉంది…’’ అంటున్నాడు రసమయి… అసలే లిమిటెడ్ కంపెనీ కదా, ఉన్న షేర్లు కూడా లాగేసుకుంటారేమోనని సందేహపడి, అబ్బెబ్బే నా మాటల్ని వక్రీకరించారుపో అనేశాడు… రాజకీయాల్లో ఇవన్నీ కామనే కదా… అవును గానీ… ఈ లిమిటెడ్ కంపెనీ అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయా..? ప్రైవేటు లిమిటెడ్ కంపెనీయా..? బాలకిషన్ ఈ లిమిటెడ్ కంపెనీని మరీ అన్-లిమిటెడ్ కంపెనీగా మార్చకపోతే కష్టం అంటున్నాడా..? అంటే ఏ కట్టుబాట్లూ లేని అపరిమిత స్వేచ్ఛ, భాగస్వామ్యం..? నో, నో, టీఆర్ఎస్లో ఆ చాన్సే లేదు… ఎందుకంటే..? అప్పట్లో ఈటల రాజేందర్ కూడా ఈ జెండాకు మేం కూడా ఓనర్లమే అన్నాడు… బ్యాడ్ లక్ ఏమిటంటే… టీఆర్ఎస్ వంటి పార్టీల్లో అందరూ పైకి ఓనర్లే కానీ ఎవరి ఓనర్ షిప్ ఎంతో ఎవరికీ తెలియదు… ష్, గప్‌చుప్… అసలు ఇతరులెవరికీ ఓనర్ షిప్ ఉండదు… జస్ట్, అలా అందరమూ ఓనర్లమే, ఇది పక్కా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనే చెబుతారు…
వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ లిమిటెడ్ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ అంతకన్నా కాదు… అది ప్యూర్ హెచ్యుఎఫ్… అంటే, హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ… కార్పొరేటు వ్యాపార పరిభాషలో అవిభక్త హిందూ కుటుంబం… మరీ సూటిగా చెప్పాలంటే కుటుంబ పార్టీ… వ్యాపార పరిభాషలో హెచ్యుఎఫ్కు కర్త ఉంటాడు… మొత్తం వ్యవహారాలన్నీ తన పేరిటే నడిచిపోతుంటయ్… కుటుంబసభ్యులే హక్కుదారులు… (అప్పట్లో ఈనాడు కూసాలు కదిలించే క్రమంలో వైఎస్, ఉండవల్లి టీం మార్గదర్శిని బజారుకు లాగినప్పుడు తెలుగు జనానికి ఈ హెచ్యుఎఫ్ కథలు తెలిశాయి)… మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్య నాయకులు, కేడర్ షేర్ల మాటేమిటి అంటారా..? కంపెనీ పంచాల్సిన డివిడెండ్లను కూడా జనం నుంచే వసూలు చేసుకోవాలి… ఇదే నయా పొలిటికల్ కంపెనీ లిమిటెడ్ లేదా హెచ్యుఎఫ్ సూత్రం… అసలు టీఆర్ఎస్ పార్టీని మాత్రమే అనడం ఏమిటి..? మన పార్టీలన్నీ అంతే కదా… ప్యూర్ కుటుంబ పార్టీలు లేదా సింగిల్ ఓనర్షిప్… కుడి పక్కకు ఓసారి చూడండి… ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్యూర్ ఫ్యామిలీ పార్టీ… కాకపోతే అల్లుడు హైజాక్ చేసుకున్నాడు.., వైఎస్సార్సీపీ అయితే సింగిల్ ఓనర్షిప్… పెద్ద సారే సర్వస్వం… జస్ట్, ఓసారి దిగువకు చూడండి… డీఎంకే రాజ్యాంగంలో బొచ్చెడు నీతులు రాసుకుని, ప్యూర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు… కానీ అదీ హెచ్యుఎఫ్ మాత్రమే…
Ads
అన్నాడీఎంకేలో జయలలిత ఉన్నన్నిరోజులూ హెచ్యుఎఫ్… కాకపోతే వారసులు లేకపోవడం, హఠాత్తుగా మరణించడంతో ఓనర్షిప్ లేని కంపెనీ అయిపోయింది… కమల్‌హాసన్ పార్టీ కూడా సేమ్ సేమ్, సింగిల్ ఓనర్షిప్… రజినీకాంత్ పెట్టాలనుకున్నదీ అంతే… జస్ట్, అలా కేరళ వైపు లుక్కేయండి… సీపీఎం నిజమైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయే… తన కేడర్ మొత్తం షేర్ హోల్డర్లే… కాంగ్రెస్ మాత్రం మళ్లీ ఫ్యామిలీ పార్టీ… కాస్త ఎగువకు రండి… దేవెగౌడ పార్టీ ఫ్యామిలీ పార్టీయే… బీజేపీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయే… ఇంకాస్త ఎగువకు వస్తే శివసేన ప్యూర్ హెచ్యుఎఫ్… ఎన్సీపీ సేమ్… ఇటు వచ్చేయండి… ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ హెచ్యుఎఫ్ టైపే… కాకపోతే ప్రస్తుత కర్తకు రాజకీయ వారసుల్లేరు… ఆయన తరువాత పార్టీ ఏమిటనేది ఎవరూ చెప్పలేరు… బెంగాల్లో మమత పార్టీ కూడా హెచ్యుఎఫ్… ఈశాన్యం వైపు చూడకుండా ఇటు పడమర వైపు చూడండి… బీహార్‌లో లాలూ పార్టీ కూడా హిందూ అవిభక్త కుటుంబ పార్టీ… ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ అంతే… హర్యానా ఐఎన్ఎల్డీ కుటుంబ కంపెనీయే… ఇప్పుడు ఓ పాయ విడిపోయి జేజేపీ పేరిట బీజేపీ చంకలో చేరిపోయింది… పంజాబ్‌లో అకాలీదళ్ కుటుంబమే… కాశ్మీర్లో ముఫ్తి, అబ్దుల్లా పార్టీలూ కుటుంబ పార్టీలే… ఇలా ఎన్నో, ఎన్నెన్నో… సో, భారత రాజకీయాల్లో ప్యూర్ లెఫ్ట్, ప్యూర్ రైట్ తప్ప మిగతావన్నీ పేరుకే ప్రజాకంపెనీలు… అసలు ఓనర్షిప్ మాత్రం కుటుంబాలదే… అందుకే వారసత్వాలు, ప్రజాస్వామిక పట్టాభిషేకాలు… అంతే…!!
Share this Article