థియేటర్ల జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు… కేవలం ఆహా ఓటీటీకే ఎందుకు పరిమితం చేశారో తెలియదు… కానీ సరైన నిర్ణయమే… ఓటీటీ అయితే అక్కడక్కడా స్కిప్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు… సినిమాలో బాగా ల్యాగ్… వేగంగా కథనం సాగదు… పలుచోట్ల ఎడిటింగ్ ఫెయిల్యూర్లు… ఐతేనేం… ఈ సినిమాను కొన్ని కోణాల్లో అభినందించవచ్చు…
అనవసర అట్టహాసాలు, పటాటోపాలు… రొటీన్ తెలుగు సినిమా తాలూకు బిల్డప్పులు గట్రా లేవు… సౌండ్ బాక్సులు బద్దలయ్యే బీజీఎం, తెర నిండా నెత్తురు పూసే ఫైట్లు, వెకిలి గెంతులు, వెగటు డైలాగులు గట్రా లేనే లేవు… ఇది ఓ భిన్నమైన కథ… చెప్పడంలో దర్శకుడు విప్లవ్ కోనేటి తడబడ్డాడు గానీ కథ ఎంపిక పర్‌ఫెక్ట్… నటీనటులు కూడా ఎక్కడా ఓవరాక్షన్ లేదు, తక్కువా చేయలేదు…
నిజానికి ఈ సినిమా పేరు మొదట్లో ‘తెలిసినవాళ్లు’… ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అని మార్చారు… పాత పేరే బాగుండేది… సినిమా కథాంశంలో కీలకమైంది కల్ట్ సూసైడ్స్… అనగా మూఢనమ్మకాల మీద ఆధారపడిన సామూహిక ఉన్మాద ఆత్మహత్యలు… అందుకని అలా పేరు మార్చారేమో… కొన్ని మూఢనమ్మకాలతో సామూహికంగా ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చరిత్రలో బోలెడు… మన మదనపల్లెలో కూడా అలాంటి ఘటన జరిగిందట… దాన్నే బేస్‌గా తీసుకుని దర్శకుడు కథ అల్లుకున్నాడు… మంచి అడుగే…
Ads
నటీనటుల్లో ప్రత్యేకించి ప్రధాన కథానాయిక హెబ్బా పటేల్ నటన పాత్రోచితం… పాత్ర కూడా విభిన్నం… సినిమా ఆరంభంలో మనం కొన్ని పాత్రల కేరక్టరైజేషన్ అనుకున్నది వేరు… తీరా భిన్నంగా కనిపిస్తుంటాయి… నరేష్ విలనీ షేడ్స్, హీరోయిన్ నెగెటివ్ షేడ్స్ బాగా వచ్చాయి… పవిత్ర కూడా బాగా చేసింది… ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు… ఏదో తాపత్రయపడ్డాడు… కాకపోతే సినిమాకు కావల్సిన బిగి లోపించింది… అంతే…
ఒక హీరో… తనకు ఓ కాఫీ షాప్… తన షాపుకి కుకీస్ సప్లయ్ చేసే హీరోయిన్‌ను ప్రేమిస్తాడు… పెళ్లి చేసుకుంటానంటే ఆమె ఓ షాకింగ్ విషయం చెబుతుంది… తమ కుటుంబం అంతా ఒకేసారి ఆత్మహత్య (ఆత్మతర్పణం) చేసుకోబోతున్నామని, దీనివల్ల ప్రమాదంలో మరణించిన తమ పెద్దనాయన బతికి వస్తాడని చెబుతుంది… దీని వెనుక మిస్టరీ చేధించి, తన ప్రేమికురాలిని కాపాడుకోవడానికి వాళ్ల ఇంట్లో హీరోయిన్ మొగుడిగా అడుగు పెట్టి సొంతంగా దర్యాప్తు చేస్తాడు…
ఒక్కొక్క ట్విస్టే రివీల్ చేస్తాడు దర్శకుడు… కొంత బోర్‌ను తట్టుకుని, కాస్త ఓపికగా చూడగలిగితే మంచి కథే… ముందు సాధారణ ప్రేమకథతో మొదలెట్టి, కల్డ్ సూసైడ్ దిశగా మళ్లించి, చైల్డ్ అబ్యూజ్ మీదుగా ఓ సందేశాన్ని ఇవ్వగలిగాడు దర్శకుడు… ప్రయత్నం మంచిదే… ఎటొచ్చీ కథాగమనంలో చిక్కదనం లోపించి బోర్ కొడుతుంది… ఐతేనేం… ఎలాగూ థియేటర్ వాడికి నిలువుదోపిడీ ఇవ్వాల్సిన పని లేదు… ఆల్రెడీ ఆహా ఓటీటీ చందాదారులు అయిఉంటే ఓ లుక్కేయవచ్చు…! ఐనా మన స్టారాధిస్టార్లు వదిలే మూసీ చెత్తకన్నా చాలా నయం కదా…!!
Share this Article