కిరణ్ అబ్బవరం… ఈ పేరు వినగానే ఓ మోస్తరు బడ్జెట్‌తో తీసే సినిమాలు గుర్తొస్తాయి… హిట్టయిందా, ఫ్లాపయిందా తనకు అక్కర్లేదు… అవకాశాలు వస్తూనే ఉన్నాయి… తను సినిమాలు చేస్తూనే ఉన్నాడు… ఓటీటీ, టీవీ, ఓవర్సీస్ రైట్స్, లోబడ్జెట్ పుణ్యమాని నిర్మాతల చేతులు కాలడం లేనట్టుంది… సో, మిడిల్ రేంజ్ సినిమాలకు తనే చాయిస్‌గా మారినట్టున్నాడు…
కానీ ఇప్పటికీ పెద్ద హిట్టేమీ లేదు తన కెరీర్‌లో… తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమా వచ్చింది… రంజన్ అంటే మనోరంజన్… ఓ మధ్యతరగతి కుర్రాడు… హిందీ రాదు, ముంబైకి వెళ్లి ఆఫీసులో అవమానాల పాలవుతాడు… ఏదో అలెక్సాతో గట్టెక్కుతూ టీమ్ లీడర్ అవుతాడు… అన్నీ రూల్స్ ప్రకారం నడవాలి… తనకు పూర్తి విరుద్ధం వెన్నెల కిషోర్ పాత్ర… ఓ ప్లేబోయ్ తరహా పాత్ర… రూల్సూ గీల్సూ జాన్తా నై బాపతు…
తన లవర్ నేహాశెట్టి కనిపిస్తుంది… తను కాలేజీ రోజుల్లో గాఢంగా ప్రేమించిన యువతే… కానీ తన ప్రేమ గురించి చెప్పడు… ఇప్పుడు ముంబైలో కనిపిస్తుంది… తన ప్రేమ చెబుతాడు… ఇద్దరూ ప్రేమలో పడతారు… కట్ చేస్తే ఆమె కనిపించదు… వెతుకుతూ తిరుపతి వెళ్తాడు… ఇలా ఆ లవ్వు కథ బోర్‌గా సాగుతూ ఉంటుంది…
Ads
మధ్యలో వెన్నెల కిషోర్, హైపర్ ఆది ఎట్సెట్రా కామెడీ చేసే ప్రయత్నం కనిపిస్తుంది… పెద్దగా నవ్వించదు… హైపర్ ఆది పాత్రను చూస్తే ఆమధ్య ఈ సినిమా ఫంక్షన్‌లో ఆది దాదాపు 20 నిమిషాల పాటు తెలుగు హీరోలందరి భజనను చేసి, సినిమాను, సినిమావాళ్లను ఎవరూ లైట్ తీసుకోవద్దు, అవమానించొద్దు అనే సందేశం ఇచ్చిన తీరు గుర్తొచ్చి నవ్వొస్తుంది…
ఇలాంటి సినిమాలు తీసి జనం మీదకు వదిలితే… సినిమా వాళ్ల మీద గౌరవం ఏం పెరుగుతుంది ఆదీ..!? తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమావాళ్లను గౌరవిద్దాం సరే గానీ, ఈ హీరోల భజనకూ ఈ సందర్భానికీ ఏమైనా లింకుందా అసలు..? పోనీ, అసలు ఏముందని ఈ సినిమాలో… జస్ట్, నేహాశెట్టి అందంగా కనిపించింది… ఆమె మాత్రమే బాగుంది… అంతేతప్ప ఓ కామెడీ పండలేదు… ఓ పాట బాగా లేదు… బీజీఎం నప్పలేదు… కథ సోసో… కథనం మరీ ల్యాగ్… ఎక్కడా హై అనిపించే సీన్ లేదు… ఎమోషన్ లేదు… ఏదో ఓ సినిమా తీశారంటే తీశారు, అంతే… ఇంతకుమించి సినిమా గురించి చెప్పడానికి ఏముంది ఆదీ..?
నిజం చెప్పు… దీనికన్నా ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో నయం కదా… అవి ఎంత నాసిరకంగా మారినా సరే…! ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి… వెన్నెల కిషోర్ పాత్రల్లో, నటనలో బాగా మొనాటనీ వచ్చేసింది… ప్రతి తెలుగు సినిమాలో కనిపిస్తాడు… చిన్నదో పెద్దదో పాత్ర, అప్పట్లో బ్రహ్మానందంలాగే, ఇప్పుడు సినిమాల్లో తను కూడా ఉండాల్సిందే అనే సెంటిమెంట్ బాగా ఎక్కువైనట్టుంది… ఈ గాలిని తను బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు, సహజమే… కానీ ఇదిలాగే కొనసాగితే అదే బ్రహ్మానందంలా డౌనయిపోయే ప్రమాదం ఉంది… బహుపరాక్…
Share this Article