సిద్ధార్థ్… లవ్వులు, పెళ్లిళ్లు, బ్రేకప్పులు, సహజీవనాలు ఎట్సెట్రా తన వ్యక్తిగత జీవితమే ఓ పెద్ద సినిమా కథ… సుడిగాలి సిద్ధార్థ్ అని పెద్ద వెబ్ సీరీసే తీయొచ్చు… అప్పుడప్పుడూ కొన్ని వివాదాస్పద రాజకీయ వ్యాఖ్యలూ చేస్తుంటాడు… చాన్నాళ్లుగా హిట్లు లేవు… ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరో… అలాంటి సిద్ధార్థ్ ఆమధ్య తన సినిమా ప్రమోషన్ కోసం బెంగుళూరు వెళ్తే కావేరీ ఆందోళనకారులు అడ్డుకున్నారు… ఫలితంగా అవమానంతో తిరిగి చెన్నై వెళ్లిపోయాడు… సో, ఎప్పుడూ ఏదో ఓ కారణంతో వార్తల్లో ఉంటున్నాడు తప్ప ఓ మంచి హిట్‌తో కాదు…
తనది ఇరవై ఏళ్ల సినిమా ప్రయాణం… అలాంటి సిద్ధార్థ్ మొన్న తెలుగులో తన సినిమా చిన్నా గురించి మాట్లాడుతూ… `నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది.. ఇంత కంటే మంచి సినిమా నేను తీయలేను.. ఈ సినిమా కూడా నచ్చకపోతే.. నేను మీకు కనిపించను` అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు… తన సొంత సినిమా… తమిళంలో పాజిటివ్ టాక్ వచ్చింది… వసూళ్ల సంగతి తెలియదు…
Ads
నిజంగానే సిద్ధార్థ్‌కు ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే బలమైన నమ్మకం ఉంది… అందుకే అలా మాట్లాడాడు… ఒకప్పుడు తెలుగులో మంచి హిట్లు ఇచ్చిన తనను క్రమేపీ టాలీవుడ్ దూరం పెట్టిందనే బాధ కూడా ఉన్నట్టుంది… తన సినిమాను సగటు సౌత్ సినిమా తాలూకు దుర్వాసనలకు దూరంగా మంచి టేస్టుతోనే తీశాడు… పాటలకు, ఫైట్లకు, పిచ్చి గెంతులకు ఈ కథ ప్రకారం చాన్స్ లేదు… అఫ్‌కోర్స్ మనవాళ్లు అవన్నీ ఇరికిస్తుంటారు కదా… ఆ పోకడలకు దూరంగా సినిమా తీశాడు…
సూటిగా కథలోకి వెళ్లి, కథనంపైనే దృష్టి పెట్టారు ఈ సినిమాలో… సబ్జెక్టు కూడా సీరియసే… అంటే గతంలో ఈ సబ్జెక్టు రాలేదని కాదు… కాకపోతే చైల్డ్ అబ్యూజ్ అనే సబ్జెక్టును ఓ కొత్త కథలో చెప్పడానికి ప్రయత్నించారు… ఎన్నుకున్న సబ్జెక్టు మంచిదే అయినా, ఓ మంచి సందేశం ఇవ్వాలని ప్రయత్నించినా… అక్కడక్కడా కొన్ని సీన్లు చూడటానికి పెయిన్‌ఫుల్‌గా ఉండి కలుక్కుమంటుంది… కేవలం కాసేపు వినోదం కోసం థియేటర్‌కు వచ్చేవాళ్లకు ఈ సినిమా అక్కరకు రాదు…
హీరో… తనకు ఓ అన్నయ్య… ఆయన మరణం తరువాత కుటుంబ బాధ్యత తనపైనే వేసుకోవడం… అన్న భార్య, అన్న బిడ్డను కూడా తనే పోషిస్తుంటాడు… అన్న బిడ్డకు మరో స్నేహితురాలు… మరో స్నేహితుడి మేనకోడలు తను… హఠాత్తుగా ఆ పిల్లను హీరో లైంగికంగా వేధించాడనే అపవాదు మీద పడుతుంది… నిందను పోగొట్టుకోవడంతోపాటు దోషులు ఎవరో తేల్చడానికి హీరో చేసే ప్రయత్నమే సినిమా కథ… సిద్ధార్థ్ వ్యక్తిగా ఎలాంటివాడైనా మంచి నటుడు… మంచి ఎమోషన్స్ పలికించే పాత్ర దొరికితే తనేమిటో చూపిస్తాడు… ఇది అలాంటి పాత్రే… సహజంగానే సిద్ధార్థ్ అందులో ఒదిగిపోయాడు… నటీనటులు అందరూ బాగానే చేశారు… పిల్లలతో సహా…
లవ్వు ట్రాకుతో సినిమా కథను పక్కదోవ పట్టించలేదు ఎక్కడా… కథానాయిక ఫ్లాష్ బ్యాక్ కూడా ఇలాంటిదే అయినా దాన్ని నాలుగు ముక్కల్లో చెప్పి ముగించారు… ఇలా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నా సరే… ఇది మాస్‌కు ఎక్కే సినిమా కాదు… థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు మెచ్చుతారా..? ఇదీ ప్రశ్న… తక్కువ బడ్జెట్‌తోనే తీశారు కాబట్టి డిజిటల్, టీవీ, ఓవర్సీస్ రైట్స్ ప్లస్ థియేటర్ రెవిన్యూ కలిపితే సిద్ధార్థ్ గట్టెక్కుతాడేమో… ఏదేమైనా సిద్ధార్థ్ ప్రయత్నాన్ని మాత్రం అభినందించాలి…!!
(ప్రతి మగాడూ గడ్డం పెంచాల్సిందే అనే ధోరణి నడుస్తోంది ప్రస్తుతం… అదొక ట్రెండ్… అందరికీ గడ్డం అందంగా ఉండదు… ఐనాసరే పెంచుతూనే ఉన్నారు… సిద్ధార్థ్‌కు మొత్తం గడ్డం నిండుగా పెరగదు… ఏదో గదుమ మీద నాలుగు పోచలు ఉంటాయి… దీంతో సిద్ధార్థ్ లుక్కు ఈ సినిమాలో ఏమాత్రం బాగా లేదు…)
Share this Article