Gottimukkala Kamalakar……………………….. పాతదే, కొత్తగా ఏం చెప్పలేక..!
****
ఇవాళ సుందరరాముడి స్మరణలో అందరి మనస్సులలో వేటూరి పాటూరిపోతోంది. సినీ గీత ప్రేమికులు సాహిత్యదీప నివాళులను సమర్పిస్తున్నారు.
రామాయణంలో రామరావణ యుద్ధాన్ని పోల్చడానికి వాల్మీకికి భాష దొరకలేదో, సరిపోలేదో…? అందుకే సాగరం సాగరంలా; ఆకాశం ఆకాశంలా; రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలా ఉంటుదని తేల్చేసి అద్భుతంగా పోలుస్తాడు. నా బోటి అల్పజ్ఞానులకు దిక్సూచి అవుతాడు. అందుకే….
వేటూరి పాట వేటూరి పాటలా ఉంటుంది…!
పాటలన్నీ గుర్తు చేయడానికి సినీసాహిత్యం మీద జ్ఞానంగానీ, భావంగానీ, అధారిటీ గానీ నాకు లేవు, రావు..! కానీ ఏనుగంత సైజులో, ఎలకకున్నంత చురుకైన చెవులున్నాయి.
యమకాలూ; గమకాలూ; నానార్ధాలూ; జతులూ; కృతులూ; తరంగాలూ; అలంకారాలూ; మమకారాలూ; నుడికారాలూ; జానపదాలూ; జ్ఞానపథాలూ; ఛందస్సూ; వయస్సూ; మనస్సూ అన్నీ ఓవర్ ఫ్లో అయ్యే భోగీ, యోగీ వేటూరి.
“ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే వేళలో” అంటూ మణిరత్నం సినిమా కథని; “సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణమూ..” అంటూ విశ్వనాథ్ గారి సినిమా కధనీ ఒఖ్క వాక్యంలో తేల్చేయగల స్రష్ట వేటూరి.
“కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్తపూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు..?” అని అంటూనే, “రాలిపోయె పువ్వానీకు రాగాలెందుకే” అని తికమక పెట్టేసి, “నేడేరా నీకు నేస్తమూ రేపేలేదూ” అని మన వెన్నును నిటారు చేసి, “గాలినై పోతాను గగనానికీ” అంటూ నిర్వేదంతో కూలబడేసే క’పాట’ నాటక సూత్రధారి వేటూరి.
సాహిత్యం నాట్యంలో అభినివేశం ఉన్న జాణతో “నిన్నటిదాకా శిలనైనా, నీ పదముసోకి నే గౌతమినైనా” అంటూ అతిశయోక్తులు చెప్పించి పెళ్లాన్నొదిలొచ్చేలా చేయించి; వేశ్యతో “పట్టుమనీ పదారేళ్లురో, నా సామీ కట్టుకుంటే మూడే ముళ్లురో..!” అని కమిట్ చేయిద్దామనుకునే రసిక శిఖామణి వేటూరి.
“సిరిమల్లెపూవా..! అంటూ ముగ్ధలా; చీకటింట దీపామెట్టీ, చీకుచింత పక్కానెట్టీ, నిన్ను నాలో దాచీపెట్టీ, నన్ను నీకు దోచిపెట్టీ..” అంటూ ప్రేయసిలా; ” నడిరాతిరివేళా నీ పిలుపూ.. గిలిగింతలతో నను ఉసిగొలుపూ..!” అంటూ ఇల్లాలిలా బహుముఖీయ స్త్రీత్వాన్ని ప్రకటించిన వాడు వేటూరి.
ఓ దగ్గర “పిల్లనగ్రోవికీ నిలువెల్ల గాయాలూ” అంటాడు. మరోదగ్గర రామాచిలకమ్మా పాటలో “వేణువంటే వెర్రిగాలి పాటేలే..” అంటూ తేల్చేస్తాడు. ఇంకోదగ్గర కాదిలి వేణుగానం గురించి డబ్బింగ్ సినిమా పాటలో చెబుతాడు. “వేణుగానమేదో యెంకి పాటలాయె” అంటూ జగదేకవీరుడితో పాడిస్తాడు. చివరగా ” వేణువై వచ్చాను భువనానికీ.. గాలినై పోతాను గగనానికీ ” అంటూ సినీబృందావనపు రేపల్లె ఎద జల్లుమనేలా మురళీ గానం చేస్తూ అవతార సమాప్తి చేసిన సినీకృష్ణుడు వేటూరి..!
పంచమహాకావ్యాలలో ఒకటైన కిరాతార్జునీయాన్ని ఐదునిమిషాల పాటగా మార్చి మనకందించిన భారతీసుతభారవి వేటూరి..!
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానాన్ని శంకరుడిచే అవధరింపజేసి వినితరించేలా చేసిన శివతత్వం వేటూరి..!
సినీమీటరు సాహిత్యసాగరాన్నంటినీ అవపోసన పట్టిన అగస్త్యుడు వేటూరి..!
కొందరు విజ్ఞమూర్ఖులు వేటూరి కలానికి రెండు వైపులా పదునున్న కత్తి అంటారు, కానీ ఈ మూర్ఖవిజ్ఞుడు దాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాడు.
వేటూరి కలం అన్నివైపులా పదునున్న సుదర్శనం…!
ఆయన కలంతో అక్షరీకరింపబడ్డ గగనజఘనాల ఇందువదనల అందం రవివర్మ కుంచెక్కూడా అందదు.
ఆయన గురించి అక్షరీకరించడానికి నాకు గగనం కూడా సరిపోదు.
****
నరుని బతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ
మనకెందుకింత తపన….??
****
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..?
****
మీ గానలహరి మేమ్మునుగంగా
ఆనందవృష్టి లో తడవంగా…
****
చినుకులా రాలి నదులుగా మారి
వరదలైపోయి కడలిలా పొంగె
నీ పాటా.. నీ పాటా…!
****
నూటికో కోటికో ఒక్కరూ
ఎక్కడో ఎప్పుడూ పుడతారూ
అది మీరేమీరే వేటూరీ..……………………. Gottimukkala Kamalakar
Share this Article